ఈ నెల 23, ఆదివారం పొద్దున్న కృష్ణా నది వంతెనపై పొరుగు రాష్ట్రం కర్నాటక నుంచి తెలంగాణలో అడుగు పెట్టిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మూడు రోజుల విరామం తరువాత ఈ రోజు తిరిగి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మఖ్తల్ నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ సమాజం యాత్రకు స్వాగతం పలుకుతుంది. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాలది పేగు బంధం. ఆంధ్ర వలస పాలనకు వ్యతిరేకంగా ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ అధ్యక్షురాలిగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగా 2014 జూన్ 2న తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. రాష్ట్ర విభజన ప్రక్రియకు తెలంగాణ వ్యతిరేకులు, సమైక్య వాదులు కొందరు వక్ర భాష్యం చెప్తున్నారు. గోద్రా మారణ కాండ నిందితులు, తడి పార్ శిక్ష అనుభవించిన వారు తల్లిని చంపి బిడ్డకు జన్మ నిచ్చారని తీవ్ర పదజాలాన్ని బహిరంగ సభల్లో, లోక్ సభ సమావేశాల్లో ప్రస్తావిస్తూ తమ తెలంగాణ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈర్ష్య, హింస, అసూయ ప్రవృత్తి గల వారి నుంచి అంతకన్నా ఆశించలేము. కానీ ఈ మధ్య కొందరు పక్కా తెలంగాణ వాదులు కూడా రాష్ట్ర విభజన నిర్ణయం అకస్మాతుగా, హడావుడిగా, ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయం అని మాట్లాడడం దురదృష్టకరం.
2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు కరీంనగర్ బహిరంగ సభలో తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తించాననీ ..2014లో రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకునే ముందు యూపీఏ చైర్ పర్సన్‌గా శ్రీమతి సోనియా గాంధీ ఎదుర్కున్న అవరోధాలు, సమైక్య వాదుల, తెలంగాణ వ్యతిరేకుల కుట్రలు, కుయుక్తులు పది సంవత్సరాలు చాల దగ్గరగా గమనించిన వారు కూడా రాష్ట్ర విభజన ఎన్నికల ముందు జరిగిన ప్రక్రియ అని తప్పుపట్టడం..మోదీ, అమిత్ షాల అభిప్రాయంను సమర్థించినట్లుగా భావించవలసి వొస్తుంది. రాష్ట్ర విభజన ప్రక్రియ కోసం 2004 నుంచి దశాబ్ద కాలం సుదీర్ఘ సమావేశాలు, మంతనాలు, బుజ్జగింపులు జరుపుతూ…అడ్డంకులను, అవరోధాలను అధిగమిస్తూ..సమైక్య వాదుల కుట్రలను, కుతంత్రాలను తిప్పి కొడుతూ ఆఖరికి 2014లో శ్రీమతి సోనియా గాంధీ నిర్ణయం తొందరపాటుగా ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయం కాదు…అని వివరించడానికి ఈ ప్రయత్నం..
2004 సార్వత్రిక ఎన్నికల వరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్య మంత్రిగా నారా చంద్రబాబు నాయుడును ఎదుర్కునలేక చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎదురుకోడానికి ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి 2004 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వొచ్చింది. సమైక్య వాది డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 26 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న తెలంగాణా రాష్ట్ర సమితిని నిర్వీర్యం చేసే కుట్రలతో ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని రాష్ట్ర కాంగ్రెస్ అటకెక్కించే ప్రయత్నం చేసింది. 2005లో టీఆరెస్‌ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీల్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2004 ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన ఏకాభిప్రాయం ద్వారానే సాధ్యమని వున్న ఒప్పంద పత్రంపై టీఆర్ఎస్ నాయకుడు ఆలే నరేంద్ర సంతకం చేశారని పేర్కొంటూ 130 కోట్ల దేశ ప్రజలు ఒప్పుకుంటేనే రాష్ట్ర విభజన సాధ్యమని..తెలంగాణా తలకాయా అంటూ డా.రాజశేఖర్ రెడ్డి చేసిన అవహేళన వ్యాఖ్యలతో రాష్ట్ర విభజన ప్రక్రియకు అడ్డంకులు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర విభజన ప్రక్రియను చర్చలు, సంప్రదింపుల ద్వారా కొనసాగిస్తూనే ఉంది. బహుశా 2006లో అనుకుంట..కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వంతో సత్సంబంధాలు ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్య నాయకుడు మాట్లాడుతూ తమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారని ..పార్టీ అంతర్గత సమావేశాల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగ పొతే ..‘‘లోగ్ హమే పత్తర్ సే మారెంగే..దాదా ..’’ అని తెలంగాణ కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీతో తన ఆందోళన వ్యక్తం చేసేవారని ఆయన తెలిపారు.
2004, 2009 మధ్య కాలంలో తెలంగాణ అంశాన్ని తొక్కేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వైఎస్ నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేసింది . తెలంగాణ ఏర్పాటుకు మేము అడ్డం కాదు..నిలువు కాదు అంటూనే భాగస్వామ్య పార్టీ టీఆర్ఎస్ను అడ్డంగా చీల్చింది. 26 మంది శాసన సభ్యులున్న ఆ పార్టీ 16కు కుదించుకుపోయింది. 2009 సార్వత్రిక ఎన్నికల ముందు ..2008 డిసెంబర్ నెలలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర విభజన అంశంపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర ముఖ్య మంత్రి డా. వైఎస్ రాజశేఖర్‌ని దిల్లీకి రమ్మంది. ఆయన, ఆయన వెంట డా. కెవీపీ రామ్ చందర్ రావు వారం రోజులు దిల్లీలోనే మకాం వేసి రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకున్న విషయం రాజకీయాలను సమీపంగా, సూక్ష్మంగా పరిశీలించే విశ్లేషకులకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు ..! రాష్ట్ర విభజనకు మొగ్గు చూపితే తను రాజకీయాలకు దూరంగా బెంగుళూరు వెళ్లిపోతానని…లేదా అవకాశమిస్తే ఒంటి చేత్తో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని తన విశ్వాసంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే..! 2009 సెప్టెంబర్ 2న డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం, తదనంతరం తెలంగాణ ఉద్యమ ఉధృతి గమనించి డిసెంబర్ 9న యుపీఏ ప్రభుత్వం హోమ్ మంత్రి పి చిదంబరం చేసిన రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రకటన సమైక్య వాదులు చంద్రబాబు నాయుడు, చిరంజీవి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులను తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఏకం చేసింది. సీమాంధ్రలో సమైక్య వాదులు కృత్రిమ ఉద్యమం ప్రారంభించి అగ్గి రాజేసారు. కాంగ్రెస్ పార్టీ అప్పటి కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోక్ సభలో తెలుగు దేశం సభ్యుల చేతిలోని జాతీయ జెండా లాక్కొని తెలంగాణ ఏర్పాటుకు తన వ్యతిరేకతను ప్రదర్శించారు. కొంత కాలానికి తెలంగాణ ఉద్యమ ఉధృతిని గమనించి..తాను తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదనీ ..సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా అలా నిరసన తెలుపవలసి వొచ్చిందని లోక్ సభలో తన చర్యను సమర్ధించుకున్నారు. ఆ తరువాత సంవత్సర కాలానికి మళ్ళీ సమైక్య నినాదం ఎత్తుకున్నారు.
2004 నుంచి రాష్ట్ర విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా మొదలయిన కుట్రలు, ప్రయత్నాలు 2014 ఫిబ్రవరి నెలలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్ సభలో ‘పెప్పర్ స్ప్రే’ వరకు కొనసాగాయి. రాష్ట్ర విభజన ప్రక్రియ ను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యుపీఏ ప్రభుత్వం దశాబ్ద కాలం కొనసాగించిన తరువాతనే తెలంగాణ ఏర్పాటుకు లోక్ సభలో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదం పొందింది. సమైక్య వాదుల కుట్రలను, కుతంత్రాలను తిప్పికొడుతూ..అనేక అవరోధాలను, అడ్డంకులను అధిగమిస్తూ ఆఖరికి కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధపడ్డ శ్రీమతి సోనియా గాంధీకి..కాంగ్రెస్ పార్టీకి తోడుగా..రాహుల్ గాంధీకి అండగా రాజకీయాలకు అతీతంగా ప్రతి తెలంగాణ వాది నడవాల్సిన సమయమిది..!
– దేవులపల్లి అజయ్




