బీజేపీలో ఏకస్వామ్యం .. !

ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్నాయి. నాలుగు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పటికే 270 సీట్లు సాధించామన్న ధీమాను హోంమంత్రి అమిత్‌ షా చెప్పుకొచ్చారు. తమ లక్ష్యం 400 సీట్లు కావడంతో మిగతా మూడు దశల్లో ఆ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అలాగే 75 ఏళ్ల వయో పరిమితి మోదికి  వర్తించదని కూడా చెప్పేశారు. మోదికి  వయసుతో నిమిత్తం లేదని ముందే ప్రకటించారు. అంటే బిజెపి గెలిస్తే 80 ఏళ్ల వరకు ఆయనే ప్రధానిగా ఉంటారని తేల్చేశారు. వేరే పార్టీలో ఇలా ప్రకటించడం అసాధ్యం. బిజెపి ఇద్దరు వ్యక్తుల పెత్తనంలో ఉన్న పార్టీ కనుక.. రెండోవాడు అమిత్‌ షా కనుక వెంటనే ఇలాంటి ప్రకటన చేసేశారు. దీంతో రేపటి ఎన్నికల ఫలితాల తరవాత మోదిీయే కొనసాగుతారని స్పష్టం చేశారు. ఎన్‌డి పక్షాలు కూడా ఇదే నిర్దారణలో ఉన్నారు. మోదీ  నాయకత్వంపై ఎవరికీ అనుమానాలు లేవు. ఈ క్రమంలో వారణాసిలో మోదీ  అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. బిజెపి పరివారంతో పాటు, పాత మిత్రులు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కూడా హాజరయ్యరు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మోదీ  ఎన్‌డిఎ నేతలను ఆహ్వానించడం విశేషం. బిజెపి సొంతంగా 200 సీట్లు కూడా సాధించదన్న విమర్శల నేపథ్యంలో ఎన్‌డిఎ నేతలను పక్కన పెట్టుకోవడం గమనించవచ్చు. ఒకవేళ అత్తెసరు మెజార్టీ వొస్తే ఎన్‌డిఎ భాగస్వాములు కీలకంగా మారుతారు.

మరోవైపు దేశంలో ఎన్నికలు కీలకదశకు చేరుకున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ, ఇండియా కూటమి నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాహుల్‌ గాంధీ భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి చూస్తోందన్న ప్రచారం ఉధృతం చేశారు. రిజర్వేషన్లు ఉండవని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో బిజెపి పునాదులు  కదులుతున్నాయని అంటున్నారు. ఇండియా కూటమిదే అధికారం అని చెబుతున్నారు. ఇక దేశంలో బిజెపి బలాలను సవిూక్షిస్తే హిమాచల్‌ దెబ్బ తరవాత, కర్నాకటలో బిజెపికి ఎదురు దెబ్బ తగిలింది. కర్నాటకలో ఓడినా ఆత్మపరిశీలన చేసుకోలేదు. ఓటమికి వోటర్లు లేదా..కులాలు, మతాలు కారణం కాదు. కేవలం బిజెపి అహంకారపూరిత రాజకీయాలు మాత్రమే అని గుర్తించలేకపోయింది.. అన్ని రాష్టాల్ల్రో పాగా వేస్తున్నామని.. మళ్లీ కేంద్రంలో అధికారం తమదే అన్న అహంకారంతో బిజెపి నేతలు  ప్రజల ఆర్తనాదాలు వినిపించుకోవడం  లేదు. ప్రజల గురించి ఆలోచిచంచడం లేదు. బిజెపికి ఎందుకు వోటేయాలో అన్న ఒక్క ప్రశ్న వేసుకుని ఇప్పుడు చర్చించుకోవాలి. ఎందుకు ప్రజలు ఆదరిస్తున్నారో..ఎందుకు తిరస్కరిస్తున్నారో గుర్తించాలి. బిజెపి ఏదో ఒరగబెడుతుందన్న భ్రమలో ఆదరించారు. ఏవిూ ఒరగబెట్టడం లేదన్న సందర్భంలో ఓడిస్తున్నారు. అందుకే కర్నాటకలో బిజెపి విూద కసితో కాంగ్రెస్‌కు వోటేశారు. ఆ తరవాత తెలంగాణలో కూడా అలాగే చేశారు. కాంగ్రెస్‌ ఏదో ఉద్దరిస్తుందన్న భ్రమతో కాకుండా..బిజెపిపై కోపంతో వోటేశారు.

అధికర ధరలు, పెట్రో, గ్యాస్‌ ధరల పెంపు, నిరుద్యోగ సమస్య, జిఎస్టీ వంటి భారాలపై ఎక్కడా చర్చ చేయడం లేదు. 400 సీట్లు గెలిస్తే ఈ సమస్యపై చర్చిస్తామని బిజెపి మిత్రద్వయం ఎక్కడా చెప్పడం లేదు. గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ను విమర్శించడంతోనే ప్రచారం ముగించేస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గురించి ఆలోచన చేయడం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా గమనించడం లేదు. వీటిపై పరిశీలన చేయడం అవసరం అన్న ధోరణి కానరావడం లేదు. ప్రజల సమస్యలపై చర్చించని పాలకులు తమకు వద్దు అన్న ధోరణిలో కర్నాటక ప్రజలు ఓ హెచ్చరిక చేశారు. ఆ తరవాత కెసిఆర్‌ తీరుకు నిరసనగా తెలంగాణలో కూడా ఇలాంటి తీర్పే ఇచ్చారు. ఇది ఒక్క బిజెపికే కాదు.. ఆయా రాష్టాల్ల్రో పాలన చేస్తున్న అందరికి వర్తిస్తుంది. ప్రజలు తమకు అవకాశం వొచ్చినప్పుడే ఉపయోగించుకుంటారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఇవే అంశాలపై నిలదీస్తున్నారు. ఇడి, సిబిఐలు దాడులు చేసి కేసులు నమోదు చేసి, నేతలను లోపల వేస్తున్నా..గత పదేళ్లలో ఒక్క అవినీతి కేసుల్లో ఒక్కటైనా తేల్చలేదు.

ఒక్కరిపైనా శిక్షపడలేదు. నిజంగానే అవినీతి, అక్రమాలపై కేసులు పెట్టాల్సి వొస్తే  బిజెపి నుంచే మొదలు పెట్టాలి. కర్నాటకలో అక్రమాలకు పాల్పడ్డ వారిపైనా కేసులు పెట్టాలి. ఆదానీ అంబానీ వ్యవహారంలో మోదీ  నిజాయితీని నిగ్గు తేల్చాలి. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలపై చర్చ పెట్టాలి. సాగుచట్టాలను తీసుకుని వొచ్చినప్పుడు కూడా మోదీ నిరంకుశంగా వ్యవహరించారు. బహుశా నియంతల పాలనలో కూడా ఇంతగా దారుణాలు జరిగి ఉండవు. ప్రజాస్వామ్యం లో నియంతృత్వం పనికారాదు. తెలంగాణ ల   పాలకలు నియంతలుగా మారారు. వేధింపులతో ప్రత్యర్థులను దెబ్బతీసే కుట్రలకు పాల్పడ్డారు. ఫలితంగా తెలంగాణలో కెసిఆర్‌ నియంతృత్వాన్ని ప్రజలు వోటుతో దెబ్బకొట్టారు. ఇవన్నీ గమనించి పాలకులు ముందుకు సాగాల్సి ఉంటుంది. ప్రజలు  ప్రతీకార రాజకీయాలను ప్రజలు సహించబోరని గుర్తించాలి.
ఇకపోతే భారత్‌ను బ్రహ్మాండంగా నడిపిస్తున్నామని బాకాలు ఊదుకుంటున్న బిజెపి నేతలు తమ విధానాలు పునస్సవిూక్షించుకోవాల్సిందే.

ప్రజలు కోరుకుంటున్నదేదో గుర్తించాలి. ప్రజలకు భారంగా మారిన జిఎస్టీ, పెట్రో, గ్యాస్‌ ధరలను తగ్గించాలి. ఉచిత పథకాలను అటకెక్కించాలి. కుట్ర రాజకీయాలు పక్కన పెట్టాలి. భారతీయ  జనతా పార్టీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలి. మోదీ  తన నిరంకుశ విధానాలను పార్టీలో చర్చించే అవకాశం ఇవ్వాలి. అదానీ.. అంబానీలకు లక్షల కోట్లు కట్టబెట్టేస్తున్నారని.. దర్యాప్తు సంస్థల్ని విపరీతంగా వాడేస్తున్నారని.. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణలు మోదీ  విూద అభిమానాన్ని కాస్తా దెబ్బతీస్తోంది.  ఇవన్నీ గుర్తించకుంటే పుట్టి మునగడం ఖాయం.మరో మూడు దశల ఎన్నికలకు కీలకంగా ఉన్న తరుణంలో బిజెపి స్పష్టమైన ఆర్థిక విధానాలు ప్రకటించాలి. ఎదుటి పక్షాలపై విమర్శలు పక్కన పెట్టి ఈ పక్షం రోజులు ప్రజలకు పారదర్శక విధానాలపై ప్రకటనలు చేస్తే మంచిది.
-ప్రజాతంత్ర డెస్క్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *