- లోక్‌సభ ఎన్నికల ముందు బద్నాం చేసే యత్నం
- అడ్డుకోవాలంటూ హైకోర్టులో బిఆర్‌ఎస్ పిటిషన్
హైదరాబాద్, మే 3 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో శుక్రవారం ఆసక్తికర పరిణామం జరిగింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్‌కు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ పట్టించుకోవడం లేదని పిటిషన్‌లో బీఆర్‌ఎస్ పేర్కొంది. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేతలపై ప్రచారం చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. పలు సందర్భాల్లో బీఆర్‌ఎస్ నాయకులపై చేసిన ఆరోపణలను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు.
తమ ఫిర్యాదుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందిస్తామని ఎలక్షన్ కమిషన్ కోర్టుకు తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్‌కుమార్ అందించే వివరాలతో.. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించేవారిని బెదిరించి లొందీసుకునేవారమని, సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారమని చెప్పారు. బీఆర్‌ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవారమని తెలిపారు. గత నెల 3 నుంచి 10వ తేదీ వరకు దర్యాప్తు అధికారులు రాధాకిషన్‌ను కస్టడీలోకి తీసుకుని, విచారించిన విషయం తెలిసిందే..! ఆ క్రమంలో గత నెల 9వ తేదీన సేకరించిన వాంగ్మూలంలో.. రాధాకిషన్ పలుమార్లు అప్పటి సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. పెద్దాయన(కేసీఆర్)కు చిన్న విమర్శ ఎదురైనా చిరాకు పడేవారు. అందుకే.. ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరగకుండా అణచివేసేవాళ్లమని వాంగ్మూలంలో రాధాకిషన్ పేర్కొన్నారు.





