ప్రాణాంతకంగా మారుతున్న సోషల్‌ మీడియా అశ్లీల అమానవీయ క్రీడలు !

 నేటి డిజిటల్‌ యుగంలో బాడీ షేమింగ్‌, సోషల్‌ ట్రోలింగ్‌, సైబర్‌ బుల్లీయింగ్‌, స్లట్‌-షేమింగ్‌, సైబర్‌స్టాకింగ్‌ లాంటి సోషల్‌ మీడియా వికృతాలు హద్దులు దాటి ప్రమాదకర ప్రాణాపాయ దుస్థితి చేరుతున్నాయి. ఒక వ్యక్తి శారీరక ఆకృతి లేదా లక్షణాలను బట్టి అమానవీయ, అవమానకర, అసహ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని ‘బాడీ షేమింగ్‌’ అంటాం. ఒక వ్యక్తిని అకారణంగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ‘ట్రోలింగ్‌’ అని పిలుస్తున్నాం. సామాజిక మాద్యమ వేదికగా ఇతరులను భయపెట్టడం, వేధించడం, ఇబ్బందులకు గురి చేయడాన్ని ‘సైబర్‌ బుల్లీయింగ్’‌ అంటున్నాం. ఇటీవలే భార్య అందంగా లేదని ఓ భర్త పెట్టిన వేధింపులతో అమాయక అబల ఆత్మహత్య చేసుకుంది. తన భార్య బాగా అందంగా ఉందని, వివాహేతర సంబంధం కలిగి ఉండవచ్చనే అనుమానంతో భార్యనే హత్య చేశాడో అనాగరిక మానవ మృగం. బాడీ షేమింగ్‌ దురాచారం పురుషులకు తక్కువగా, మహిళలకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకరి శారీరక అవలక్షణం మరొకరి సంతోషానికి కారణం కారాదు. ఇలాంటి శారీరక వికారం కలిగిన వారిని జోకర్లుగా చూపించడం నేటి సినిమాలు/ టివీ షోల్లో సాధారణం కావడం విచారకరం. నేటి కృత్రిమ మేధ సాంకేతిక విప్లవ సునామీలా ఏది నిజమో, ఏది అబద్దమో తెలియడం లేదు.
వికార వ్యాఖ్యలు:
         లావుగా ఉన్నోడిని ‘బండోడని / దున్నపోతని/ పందిలా ఉన్నావని’, సన్నగా ఉన్నోడిని ‘బక్కోడని/పుల్లారావ్’‌ అని, కంటి రంగును బట్టి ‘పిల్లి కండ్లోడ’ని, దేహకండరాల్ని బట్టి ‘లావు తోడలు/ బర్రె పిర్రలోడని’ నేటి అసభ్య సమాజం తరుచుగా ఎగతాళి మాటల తూటాలు విసురుతూనే ఉంటున్నది. అమ్మాయి స్లిమ్‌గా ఉంటే ‘కత్తి’లా ఉందని, చర్మం నలుపుగా ఉంటే ‘కర్రోడ’ని, తెల్లగా ఉంటే ‘ఎర్రోడని’, దంత అమరికలో ‘ఎత్తు పళ్లోడని’, కురుచగా ఉన్నోళ్లను ‘పొట్టోడని’, ఆరడుగులా ఉన్నోళ్లని ‘పొడుగోడని’ అనేక అవమానకర దుర్భాషలను విసిరే ప్రభుద్ధులు మన మధ్యనే ఉన్నారు. ఆకారంపై వికార వ్యాఖ్యలు చేయడం అన్యాయం, అమానవీయం అని సమాజం గుర్తించాలి. సెలబ్రిటీల శరీర ఆకృతులపై అసహ్యకర కామెంట్స్ చేసే వ్యక్తుల మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండక పోవచ్చని తెలుస్తున్నది. లావెక్కడం, నల్లగా ఉండడం, బట్టతల ఉండడం, పొట్టరావడం, శరీరాకృతి సరిగ్గా లేకపోవడం, స్టైల్‌గా కనిపించడం, హేయిర్‌ స్టైల్‌, పొడుగ్గా ఉండడం, పొట్టిగా ఉండడం లాంటివి సహజంగా వచ్చిన శారీరక మార్పులు మాత్రమే. ప్రత్యేక వస్త్రధారణ, మేకప్ అతిగా/తక్కువగా ఉండడం లాంటి సందర్భాలను ఆసరాగా చేసుకొని పోకిరి సమాజం మాటల ముళ్లతో గుండెల్లో గునపాలుదించుతానే ఉంటుంది. శరీర ఆకారాన్ని బట్టి కూడా పుట్టుకతోనే నలుపు చర్మం రావడం, పొట్టిగా ఉండడం, అంగవైకల్యం, బట్టతల లాంటివి ఎవరు కోరుకునే అంశాలు కావని మనందరికి తెలుసు.
సోషల్‌ ట్రోలింగ్‌ అశ్లీల క్రీడలు:
          మనుషుల శారీరక ఆకృతి, ఇతర అమానవీయ విమర్శలు, ప్రతికూల వ్యాఖ్యల పట్ల అసహ్యకరంగా ‘ట్రోలింగ్‌’ చేయడం అనే దురాచారం నేటి ఆధునిక సామాజిక మాద్యమాల్లో సర్వ సాధారణమైంది. ఎదుటి వారిని విమర్శించడం, వెక్కిరింతలకు గురి చేయడం లాంటి అశ్లీల సామాజిక మాద్యమ క్రీడలతో విద్యార్థులు, యువతీయువకులు, సెలబ్రిటీలు మానసికంగా కుంగి పోవడం, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకోవడం గమనిస్తున్నాం. ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు సదరు వ్యక్తుల మానసిక స్థితిపై దుష్ర్రభావాన్ని కలిగిస్తున్నాయి. నేడు జబర్ధస్తుగా అంద వికారమే ఆధారంగా నవ్వుల షోల ఎపిసోడ్లు మనకు తాత్కాలిక ఆనందాన్ని కలిగించి ఉండవచ్చు. బూతుకు, కామెడీకి వ్యత్యాసం చెరిగి పోవచ్చు. మన సమాజం సన్నగా, తెల్లగా, అందంగా ఉన్న వారినే ఆరాదిస్తున్నది. ఇలాంటి వారినే సమాజంలో ప్రముఖులుగా, సినిమాల్లో హీరోలు/హీరోయిన్లుగా పూజించబడి అసంఖ్యాక అభిమానులను కలిగి ఉంటున్నారు. శారీరక కొలతలను సిక్స్ ప్యాక్‌, జీరో సైజ్‌లంటూ సమాజం ప్రమాణీకరించింది కూడా. శారీరక ఆకృతిలో తేడాలున్న వారిని ‘అంద వికారులంటూ’ ముద్ర వేస్తూ, నేటి సమాజంలో అమానవీయ, ఆక్షేపణీయ మాటల తూటాలు విసిరే దురాచారం వేగంగా విస్తరిస్తున్నట్లు కనబడుతున్నది.
బాడీ షేమింగ్‌ దుష్ప్రభావాలు:
బాడీ షేమింగ్ అనాచారానికి గురైన ఆయా వ్యక్తులు మానసికంగా గాయపడడం, కుంగి పోవడం,ఏకాగ్రత కోల్పోవడం, ఆందోళన చెందడం, నిరాశకు గురి కావడం, ఇబ్బంది పడటం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, తన మీద తనకు కోపం రావడం, పది మందిలో నిలువక ఒంటరిగా ఉండి పోవడం, బెదిరింపులను లోను కావడం, ఆవేశంగా ప్రవర్తించడం, ఈటింగ్‌ డిసార్డర్స్‌, సెల్ఫ్- ఇంజురీకి పాల్పడడం, వ్యక్తిత్వం తిరోగమన దిశలో మారడం, నిరుత్సాహపడడం, మానసిక రుగ్మతలకు లోను కావడం, సమాజంలోకి/కాలేజీకి వెళ్లడానికి భయపడడం, భావోద్వేగ ఒత్తిడికి లోను కావడం జరుగుతుంది. బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు చేసేవారిలో బజారు రౌడీలు, శత్రువులు, పోకిరీలతో పాటు తల్లితండ్రులు, సోదర సోదరీమనులు, స్నేహితులు, క్లాస్‌మేట్స్‌, బంధువులు కూడా ఉండడం చూస్తున్నాం. నాగరికంగా కనిపించే మేక వన్నె గుంట నక్కలు కూడా నోరు జారడం కనిపిస్తున్నది. శరీర ఆకృతితో పాటు ధరించే దుస్తువులను బట్టి కూడా నెగెటివ్‌ కామెంట్స్‌ వింటుంటాం. బాడీ షేమింగ్‌లో వ్యక్తిలోని శరీర అమరికను ఇతరులతో పోల్చి హేళన చేయడం, వ్యక్తి ముందే నెగెటివ్‌ కామెంట్స్‌ చేయడం, వ్యక్తి లేనపుడు అసహ్యకర వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది.
శారీరక ఆకారం సరిగా లేని యువతులు, వాటిని వదలుకోవడానికి పలు ఖరీదైన ప్రమాదకర కాస్మటిక్స్‌, బ్యూటీ పార్లర్లు, సర్జరీలు, చికిత్సలు చేయించుకోవడానికి కూడా వెనుకబడడం లేదు. అధిక బరువుతో లావుగా ఉన్న వారిలో బాడీ షేమింగ్‌కు భయపడి 65 శాతం మంది బరువు తగ్గించుకోవడానికి అతిగా ఖర్చులు చేస్తున్నారు. బాలికల్లో 33 శాతం, బాలల్లో 25 శాతం మంది బరువు-ఆధార అవహేళనాలకు గురి అవుతున్నారు. లావుగా ఉన్న వారిని 84 శాతం మంది సహవిద్యార్థులు హేళన చేయడం జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల ప్రజలు బాడీ షేమింగ్‌ ఫలితంగా ఈటింగ్‌ డిసార్డర్‌ వలలో చిక్కుతున్నారు. బాడీ షేమింగ్‌కు గురైన వారిలో ఈటింగ్, స్లీపింగ్‌‌ డిజార్డర్స్ తరుచుగా కనిపిస్తాయని తెలుసు. కర్రకు పట్టిన చెదలుగా బాడీ షేమింగ్‌ అసహ్యకర వ్యాఖ్యలు వ్యక్తి మనసును చిధ్రం చేస్తాయి.
శరీర ఆకృతి దైవప్రసాదం:
          శారీరక ఆకృతి మన చేతిలో లేదు. ఇది పుట్టుకతోనే దేవుడు ప్రసాదించినదని నమ్ముతాం. చర్మ రంగు, ఎత్తు, జట్టు, కళ్లు, లావు లాంటివి జన్మతహ సంక్రమించవచ్చు. సాధారణ జీవనశైలి కలిగిన వారు కూడా సహజంగా లావుగా కనిపిస్తారు. ఇలాంటి వ్యక్తులు బాడీ షేమింగ్‌ను తీవ్రంగా తీసుకోకుండా మానసికంగా ధృఢంగా ఉండే ప్రయత్నం చేయాలి. మనం పట్టించుకొని భయపడినంత కాలం పోకిరీలు హేళన చేస్తూనే ఉంటారు. మనం ప్రతిస్పందించని వేళ, ఎదురు తిరిగి చెప్పు చేత పట్టిన వేళ, అల్లరి మూకలు తోక ముడిచే అవకాశం ఉంటుంది. మానసిక సౌందర్యంతోనే శారీరక వికారాన్ని జయించాలి. నల్లగా, లావుగా, పొట్టిగా ఉన్న వారెందరో ప్రపంచ ఖ్యాతిని పొందడం మనం చూశాం. మన శరీరాన్ని మనమే ప్రేమించుకోవడం ప్రారంభించాలి. బాడీ షేమింగ్‌ను పట్టించుకోకుండా తమ తమ వృత్తుల పట్ల దృష్టి కేంద్రీకృకరించాలి. మన మనసును మన నియంత్రణలో ఉంచుకుంటూ, ఆశావహ జీవనశైలిని అలవర్చుకుంటూ, ఆనందంగా ఉండేందుకు కృషి చేయాలి.
బాడీ షేమింగ్‌, ట్రోలింగ్‌, సైబర్‌ బుల్లీయింగ్‌లు ప్రాణాంతకంగా మారుతున్నాయా !
         బాడీ షేమింగ్‌ను బహు తేలికగా తీసుకుంటూ, అమానవీయ అశ్లీల క్రీడలో నిండు మనసులు మానసికంగా కృంగి పోయి ఆత్మహత్యల వరకు దారితీయడం అత్యంత దారుణం. బాడీ షేమింగ్‌ అశ్లీల, అమానవీయ, అభ్యంతరకర దురాచారానికి దూరంగా సమాజం వికసించాలి. మనిషిని మనిషిగా చూడగలగాలి. శరీర ఆకృతిని బట్టి ఎగతాళి చేయడం, అసహ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని నేరంగా భావించాలి. స్పష్టమైన శిక్షలు ఉండేలా చట్టంలో మార్పులు తేవాలి. మనిషిలో మానవత్వపు పరిమళాలు గుబాళించాలి. ఆన్‌లైన్‌ వేదికల్లో బాడీ షేమింగ్, ట్రోలింగ్‌, సైబర్‌ బుల్లీయింగ్‌ రూపంలో బురద చల్లే ప్రబుద్ధుల విష వలయంలో చిక్కకుండా సోషల్‌ మీడియా వ్యాఖ్యల పట్ల సున్నితంగా ఉండకుండా స్థితప్రజ్ఞతను, డిజిటల్‌ ఎలాస్టిసిటీలను పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
అనవసర వ్యాఖ్యల్ని వదిలేయడం, లక్ష్య సాధనలో దృష్టిని కేంద్రీకరంచడం, సామాజిక మాద్యమాల్లో ప్రైవసీ సెట్టింగ్స్ చేసుకోవడం, అనవసర సామాజిక‌ మాద్యమాలకు దూరంగా ఉండడం, మన మనసును మనమే నియంత్రించుకోవడం, స్క్రీన్‌ టైమ్‌ను తగ్గించుకోవడం, డిజిటల్‌ ఫాస్టింగ్‌ చేయడం లాంటి మార్గాలు సోషల్‌ మీడియా అశ్లీల క్రీడల నుంచి మనకు భద్రత, మనశ్శాంతిని ప్రదానం చేస్తాయి. ఆన్‌లైన్‌ వేదికల అశ్లీల వ్యాఖ్యలకు తిట్టుకుంటూ కుమిలి పోవడం కన్న తట్టుకుంటూ ఉజ్వల భవితకు ముందడు వేద్దాం. ఇకనైన సైబరాసురులు, సోషల్‌ మీడియా మైదానంలో అనుచిత వ్యాఖ్యల అశ్లీల క్రీడాకారులు అభ్యంతరకర వ్యాఖ్యలకు తిలోదకాలిచ్చి, డిజిటల్‌ వేదికల్లో మానవీయ ఆరోగ్యకర రాతలను, చేతలను ప్రదర్శించాలి. మనుషులంతా ఒక్కటే అని, విమర్శల నొప్పి ఎవరికైనా హానిని కలిగిస్తుందని తెలుసుకుందాం. బాహ్య సౌందర్యానికి, అశ్లీల వ్యాఖ్యలకు బదులు ఆరోగ్యకర ఆలోచనలు పంచుకోవడానికి సోషల్‌ మీడియాలకు పట్టం కడదాం.

     డా: బుర్ర మధుసూదన్ రెడ్డి 

             కాలమిస్ట్‌ – కీర్తి పురస్కార గ్రహీత
                       9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *