‌ప్రజలే కాంగ్రెస్‌ ‌ను కాపాడుకోవాలి

 ‘‘పట్వారీ దొరగారు పరమాన్నం పెడుతుంటే పరమా త్ముడనుకున్న, ఆడుకొమ్మని ఆట బొమ్మిస్తే దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న, జాలితోటి జామ పండిచ్చి తలమీద చేయి పెడితే తండ్రి లెక్కనుకున్నా, వెండి గిన్నెల పాలు పోసిస్తే దండి గుణమని దండాలు పెట్టిన, కాటు వేసేదాకా తెలువదయ్యా కడుపులో విషమై అది పెరిగి పోయింది. గొరగాని బ్రతుకై పోయింది’’ 25 ఏండ్ల క్రితం ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒసేయ్‌ ‌రాములమ్మ సినిమాలోని పాటను నేటి రాజకీయాలకు పోల్చి చర్చించాల్సిన సందర్బం ఏర్పడింది. ఒక అమాయకపు ఆడ పిల్లను నమ్మించి మోసం చేసిన దొరగారి గురించిన సన్నివేశంతో నేటి రాజకీయాలను, రాజకీయ నాయకుల వాగ్ధానాలను, వారి పాలనను పోల్చి చూడవచ్చును. నేటి రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం కోసం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజల ఓట్లతో మోసపూరితంగా రాజ్యాధికారంలోకి వస్తున్నారు. రాజకీయ పార్టీలు ప్రజల పేదరికాన్ని ఆసరా చేసుకొని ప్రలోభ పథకాలతో ప్రజల ఓట్లు కొళ్లగొట్టి అధికారంలోకి వచ్చి మరింత దోపిడి చేస్తున్నారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అయినా మెజార్టీ ప్రజలు నేటికి అమాయకత్వంతో, అజ్ఞానంతో, చైతన్య రాహిత్యంతో, ప్రజాస్వామిక బానిసత్వంతో జీవిస్తున్నారు. ఈ దేశాన్ని ఏలుతున్న నేటి పాలకులు కూడా మెజార్టీ ప్రజలు చైతన్యం చెందకూడదని, అభివృద్ధి కాకూడదని చూస్తున్నారు. ప్రజల అభివృద్ధికి దోహదపడే  విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ మౌళిక రంగాలను కావాలనే నిర్వీర్యం చేస్తున్నారు. ప్రపంచమంతా వర్గ అసమానతలు కొనసాగుతుంటే ఆయా దేశాల్లో జరిగిన పోరాటాల వల్ల అక్కడ ప్రజలకు విముక్తి జరిగింది. కట్టు బానిసత్వం కొనసాగిన అమెరికాలో నల్ల జాతి ప్రజలకు విముక్తి జరగడమే కాకుండా నల్ల జాతికి చెందిన ఒబామా దేశ అధ్యక్షుడుగా కొనసాగారు. భారతదేశం పక్కనే ఉన్న చైనా సైతం అక్కడి పాలకుల నైతిక పాలన వల్ల నేడు ప్రపంచలో అభివృద్ధిలో అగ్ర దేశంగా నిలబడింది. భారతదేశంలో వర్గ అసమాతలతో పాటు కుల అసమానతలు కొనసాగడమే కాకుండా కుల సమాజం వల్ల వర్గ సమాజం కొనసాగి మెజార్టీ ప్రజలు దోపిడీకి గురవుతున్నారు.
విదేశీయుల పాలనకు కుల అసమానతలు తోడై వందల ఏండ్లుగా దోపిడీకి గురైన దేశ ప్రజల బాగు కోసం స్వాతంత్య్ర పోరాటం ముందునుండే ఎన్నో పోరాటాలు జరిగాయి. స్వాతంత్ర అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ అంబేడ్కర్‌ ‌తో రాజ్యాంగం వ్రాయించడమే కాకుండా రాజ్యాంగ ఫలాలు మెజార్టీ ప్రజలకు అందించాలని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేశారు. ముఖ్యంగా అణగారిన ప్రజల అభివృధ్ధికోసం విద్య, వైద్య రంగాలను మెరుగుపరచడంతో పాటు వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఉపాధి కోసం ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు నెలకొల్పి పారిశ్రామిక అభివృద్ధి చేశారు. అణగారిన ప్రజల అభివృద్ధి కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను, రిజర్వేషన్లను చిత్తశుద్ధితో అమలుపరిచారు. కాంగ్రెస్‌ ‌పార్టీ కన్నా ఎక్కువ చరిత్ర కలిగిన కమ్మునిస్టు పార్టీల సూచనలు, సలహాలు కూడా తీసుకొని భూ సంస్కరణలు చేపట్టి సోషలిస్టు సమాజ నిర్మాణం కోసం కూడా కాంగ్రెస్‌ ‌కృషి చేసింది. భిన్న మతాలు, భిన్న కులాలు కలిగిన భారతదేశంలో కులాల మధ్య, మతాల మధ్య సామరస్యం కోసం ఎంతో కృషి చేసిన కాంగ్రెస్‌ ‌పార్టీ అందరికి ఆమోదయోగ్యమైన సెక్యులర్‌ ‌పాలన చేశారు.
దేశంలోని ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ అసమానతల వల్ల పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీల పోరాటాల వల్ల, సుదీర్ఘ పాలనపై సహజంగా వచ్చిన ప్రజా వ్యతిరేకత వల్ల దేశంలో కాంగ్రెస్‌ ‌పార్టీ బలహీనపడింది. కాంగ్రెస్‌ ‌పార్టీ బలహీనతను పసిగట్టిన బిజెపి తన ఎత్తుగడలతో ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యంతో యుపిఎ (యునైటెడ్‌ ‌ప్రోగ్రెసివ్‌ అలయన్స్) ‌గా ఏర్పడింది. కాంగ్రెస్‌ ‌పార్టీపై వ్యతిరేక ప్రచారం చేసిన బిజెపి హిందూత్వ ఎజెండాను ప్రధానంగా తీసుకొని విజయం సాధించింది. స్వాతంత్రం పూర్వం 1925 లో ఏర్పడిన ఆర్‌ ఎస్‌ ఎస్‌ ఆనాటి నుండి బిజెపి అధికారంలోకి వచ్చేంత వరకు తన మిగతా అనుబంధ సంస్థలతో చాపకింద నీరులాగా ప్రజలను హిందూత్వం వైపు మరల్చి లబ్ధిపొందారు. హిందూత్వ నినాదంతో పాటు అవినీతి లేని పాలన, స్వదేశీ పాలన, విదేశాల్లో దాచిన డబ్బు వాపస్‌, ‌నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి బి.సి కార్డ్, ‌చాయ్‌ ‌వాలా, గుజరాత్‌ ‌తరహా అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు నినాదాలతో బిజెపి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన బిజెపి ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాలను తుంగలో తొక్కింది. మేక్‌ ఇన్‌ ఇం‌డియా అంటూ పదే పదే పలికిన బిజెపి కాంగ్రెస్‌ ‌హయాంలో ప్రజల సొమ్ముతో స్థాపించిన ఇండియాలోని పబ్లిక్‌ ‌రంగాలన్నింటిని ఒక్కటొక్కటిగా అమ్ముతున్నారు. తద్వారా  అణగారిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను కొళ్లగొట్టడంలో బిజెపి ప్రముఖ పాత్ర పోషించింది.
ఎత్తులు జిత్తులతో అధికారం చేపట్టిన బిజెపి తన అధికారాన్ని పదిల పరచుకోవడం కోసం చేయరాని తప్పులన్ని చేసింది. ఉద్యమకారులపై ఉక్కు పాదం మోపి ప్రశ్నించే మేధావులను జైళ్లలోకి నెట్టింది. రాజ్యసభలో మెజార్టీ లేని బిజెపి ఆ మెజార్టీ సాధించడం కోసం 2017 లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఎన్నికల ముందు పెద్ద నోట్ల రద్దుకు పాల్పడింది. ప్రతిపక్షాలకు ఎన్నికల్లో డబ్బు దొరకకుండా చేయడం కోసం ఏకంగా దేశ వ్యాప్తంగా నోట్ల రద్దుకు పాల్పడింది. ప్రతిపక్షాలను మట్టుపెట్టడం కోసం నోట్లు రద్దు చేస్తే ప్రజలు పడిన ఇక్కట్లు వర్ణనాతీతం. నోట్ల రద్దుతో ఆయా కంపెనీలు మూతపడి ఉన్న ఉద్యోగాలు ఊడి నిరుద్యోగం పెరిగి దేశ అభివృద్ధి కుంటుపడింది. బిజెపి పార్టీ నోట్ల రద్దు చేసి ప్రతిపక్షాలకు డబ్బు దొరకకుండా చేసి దొంగాటలో నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. బిజెపి అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక ఎత్తులు, జిత్తులు, కుట్రలతోనే అధికారంలోకి వస్తుంది. బిజెపి జిత్తులకు లొంగని రాష్ట్రాలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ తన పాలనను కొనసాగిస్తోంది. పచ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసారు. అధరని బెధరని మమతా తిరిగి బెంగాల్‌ ‌లో అధికారంలోకి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అకాల మరణం వల్ల ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని వాడుకోవాలని తీవ్ర ప్రయత్నం చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌మద్దతుతో నడుస్తున్న కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోసి బిజెపి అధికారంలోకి వచ్చింది.
‘భారతదేశంలో బహు మతాల మనుగడ, బహుభాషల వాడుక, బహు జాతుల ఉనికిని భాజపా గుర్తిస్తుంది, గౌరవిస్తుంది’ అని పూర్వ ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజ్‌ ‌పేయీ పార్లమెంటు సాక్షిగా ఉద్ఘాటించారు. సమ్మిళితత్వం, సాంస్కృతిక భిన్నత్వాలను భారతీయ సమాజ బలిమిగా ప్రధాని మోదీ ఇటీవలే డెన్మార్క్ ‌లో అభివర్ణించారు. అగ్రనేతల మాటల్లో ప్రస్ఫుటమైన ఆ ప్రజాస్వామిక లౌకిక విలువలకు కమలం పార్టీ శ్రేణులు మంట పెడుతున్నాయి. అల్పసంఖ్యాక వర్గాల వేషభాషలు, వ్యక్తిగత విశ్వాసాలు, ఆహార అలవాట్లను ఈసడిస్తూ అవి వెళ్ళగక్కుతున్న విద్వేష భావనలు సామరస్య పూర్వక సాంఘిక జీవనాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. తాజాగా మహ్మద్‌ ‌ప్రవక్త, ఇస్లామ్‌ ‌పై బీజేపీ నేతలు నూపుర్‌ ‌శర్మ, నవీన్‌ ‌జిందాల్‌ ‌చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దేశానికి తలవంపులు తెచ్చిపెట్టాయి. ఖతర్‌, ‌కువైట్‌, ‌సౌదీ అరేబియా, ఇరాన్‌ ‌వంటి వాటితో పాటు 57 దేశాల ఇస్లామిక్‌ ‌సహకార సంస్థ(ఓఐసీ) సైతం వాటిని తీవ్రంగా తప్పుపట్టింది. సంకుచిత ప్రయోజనాల కోసం భాజపా వర్గాలు ముస్లిములపై ఎగజిమ్ముతున్న ద్వేషం దేశీయంగా మత కల్లోలాలను ఎగదోయడమే కాదు, సంవత్సరాల తరబడి శ్రమించి నిర్మించుకున్న పటిష్ఠ ద్వైపాక్షిక సంబంధాల పైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. వోట్ల యావలో విభజన వాదానికి పాలుపోసే దుర్మార్గ రాజకీయాలు అంతిమంగా భారతావనికి తీవ్ర నష్టం కలిగిస్తాయని భారత ప్రజలు గ్రహించాలి.
యోగి ఆదిత్యనాథ్‌, అనంతకుమార్‌ ‌హెగ్దే, గిరిరాజ్‌ ‌సింగ్‌, ‌శోభా కరండ్లాజె వంటి బిజెపి అగ్రశ్రేణి నాయకుల నోటిదురుసు ప్రకటనలు మరింత మత విద్వేషాలను పెంచేవిగా ఉన్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మేఘాలయ గవర్నర్‌ ‌ముస్లిములను ఆర్థికంగా వెలి వేయాలన్న అనాగరిక ఆలోచనలకు తథాగథ రాయ్‌ ‌వంతపాడారు. సామాజిక మాధ్యమాల్లో పొంగిపొర్లుతున్న ఆ మత విద్వేషాల మురుగుపై యుఎఇ యువరాణి హింద్‌ అల్‌ ‌ఖాసిమి రెండేళ్ల క్రితం స్పందిస్తూ ‘భారతీయ హిందువులను ఎమిరేట్స్ ‌కు అనుమతించేది లేదంటే ఇండియన్లు ఏమంటారు. ఇక్కడి నుంచి ఇండియాకు ఏటా వెళ్తున్న 1400 కోట్ల డాలర్లు ఆగిపోతే ఎలా ఉంటుంది. నేను చూసిన భారతదేశం ఇది కాదు’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. సుమారు 90 లక్షల భారతీయుల జీవితాలకు గల్ఫ్ ‌దేశాలు ఆధారమవుతున్నాయి. స్థానికంగా భాజపా మూకల వీరంగాలు వారి భద్రతనే కాదు, దేశ ఆర్థిక ప్రయోజనాలనూ ప్రమాదంలోకి నెడుతున్నాయి. జమ్మూకశ్మీర్‌ ‌స్వయం ప్రతిపత్తి, రాష్ట్ర హోదాలను కేంద్రం ఏకపక్షంగా తొలగించిన దరిమిలా ప్రజ్వరిల్లిన స్థానికుల గుండెమంటలు ఇంకా చల్లారలేదు. పౌరసత్వ సవరణ చట్టం, ఉమ్మడి పౌరస్మృతి తదితరాలపై మైనారిటీల్లో భయాందోళనలూ అలాగే కొనసాగుతున్నాయి. నల్ల చట్టాలతో రైతులను అణచివేయజూసింది. జిఎస్టి లాంటి విధానాలతో రాష్ట్రాలపై పెత్తనం చేయడం ప్రజా వ్యతిరేకతను పెంచుతున్నాయి. మందబలం, మూకదాడులతో ఎవరూ దేశ సమైక్యత, సమగ్రతలను సాధించలేరు. భిన్నత్వంలో ఏకత్వమే సహజాభరణమైన భారతావనికి ఆభిజాత్య పోకడలు, అణచివేత పద్ధతులు ఎన్నటికీ శ్రేయస్కరం కావు.
    ప్రగతిశీల, కమ్యూనిస్టు, బహుజన శక్తులు కాంగ్రెస్‌ ‌తో జతకట్టాలి
గత కొన్ని ఏండ్లుగా బలహీనపడిన కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న దోపిడి పాలన అంతం కోసం ప్రగతీల శక్తులు, బహుజన రాజకీయ వర్గాలు, కమ్యూనిస్టులు ఎలాంటి బేషిజాలకు పోకుండా కాంగ్రెస్‌ ‌తో జతకట్టాలి. కేరళ కమ్యూనిస్టులు ఇప్పటికే కాంగ్రెస్‌ ‌తో కలిసి పాలన కొనసాగిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌కాంగ్రెసుతో కలిసి సాగడమే మేలని ప్రకటించాడు. బీహార్‌ ‌ను పాలిస్తున్న నితీష్‌ ‌బిజెపితో తెగతెంపులు చేసుకొని స్థానిక ఆర్జేడీ, కాంగ్రెస్‌ ‌తో కలిసి పాలన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్‌ ‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలన నడుస్తుంది. ఒకప్పుడు 60 పార్లమెంటు సీట్లు కలిగి కాంగ్రెస్‌ ‌కు మద్దతునిచ్చిన కమ్యూనిస్టులు నేడు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నారు. 25 ఏండ్ల పాటు పచ్చిమ బెంగాల్‌ ‌లో రాజ్యమేలిన కమ్యూనిస్టులు మార్కిజానికి, ప్రగతిశీల భావాలకు బద్ధ వ్యతిరేకి అయిన బిజెపి లో చేరడం చాలా విషాదకరం. కమ్యూనిస్టులు వారి ఉనికిని కాపాడుకోవడానికి ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో జతకట్టాల్సిన దుస్థితికి చేరుకున్నారు. కాంగ్రెస్‌ ‌తో తెగతెంపులు చేసుకోవడం వల్లనే కమ్యూనిస్టులు ఇంతటి దుస్థితికి చేరుకున్నట్లు వారు ఇప్పటికైనా పరిశీలన చేసుకొని కాంగ్రెస్‌ ‌తో జతకట్టాల్సిన అవసరముంది. ఉత్తరప్రదేశ్‌ ‌లాంటి రాష్ట్రంలో అధికారం చేపట్టిన సమాజ్‌ ‌వాది, బిఎస్పి లాంటి పార్టీలు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌తో జతకట్టడం వల్ల మతోన్మాద, మనువాద రాజకీయాలకు అడ్డు చెప్పవచ్చును. ఒకప్పుడు కాంగ్రెస్‌ ‌లో కీలక నాయకురాలుగా ఉన్న తృణమాల్‌ ‌కాంగ్రెస్‌ అధినేత్రి పచ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌ ‌తో జతకట్టడం ఆమెతో పాటు దేశానికి శ్రేయస్కరం. దేశ ప్రజలను ఏకం చేయడం కోసం రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్రతో పాటు బిజెపి వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి బేషిజాలకు పోకుండా ఐక్యత చర్చలు జరపాల్సిన బాధ్యత తీసుకోవాలి.
ప్రజలే కాంగ్రెస్‌ ‌ను కాపాడుకోవాలి
దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ‌ను కాపాడుకోవాల్సి బాధ్యత ప్రజలపైనే వుంది. దేశంలో మతోన్మాద రాజకీయాలను, రాష్ట్రంలో దోపిడి రాజకీయాలను కట్టిడి చేసే అవకాశం ప్రజల చేతిలోనే ఉంది. కాంగ్రెస్‌ ‌పార్టీకి దేశంలో నాయకత్వం సరిగా లేదని, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అమ్ముడు పోతున్నారని నెపంతో ప్రజలు, ప్రగతిశీలవాదులు కాంగ్రెస్‌ ‌కు దూరమై బిజెపి ని ఎత్తిపడితే తెలంగాణతో పాటు దేశానికి తీవ్ర నష్టం జరుగుతుంది. దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ ‌పార్టీకి ఉంది. ఆ క్రమంలో ఇందిరా గాంధీని, రాజీవ్‌ ‌గాంధీని కోల్పోయిన కాంగ్రెస్‌ ‌పార్టీ నేటికి దేశ ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తుందని ప్రజలు గమనించి కాంగ్రెస్‌ ‌ను కాపాడుకోవాలి. ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్‌ ‌ను కాపాడుకోవడమంటే దేశాన్ని, దేశ ప్రజలను కాపాడుకున్నట్లేనని అర్ధం చేసుకోవాలి.

image.png

  సాయిని నరేందర్‌
‌సామాజిక, రాజకీయ విశ్లేషకులు, 9701916091

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *