ప్రజలకు స్వేచ్ఛ, స్వచ్ఛత రెండూ అవసరమే…!!!

బ్రిటిష్‌ వాడి పరిపాలనలో మన భారతీయులకు స్వేచ్చలేదనే ప్రాథమిక కారణంతో ఎందరో మహనీయులు వారి జీవితాలను ఫణంగా పెట్టి మరణాలను కూడా లెక్క చేయక తెల్లవాడి కబంధ హస్తాల నుండి దేశాన్ని విడిపించి మన చేతులలో పెట్టారు. ఆ తరువాత మన రాజ్యాంగాన్ని మనమే రాసుకుని మనకి మనమే సమర్పించుకున్నాం. అందులో కీలకమైన ప్రాథమిక హక్కులలో మొట్టమొదటిది భావ ప్రకటనా స్వేచ్చ. నిన్నటి సుప్రీం కోర్టు తీర్పు ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. ఆర్టికల్‌ 19(1) (ఎ) ప్రకారం భావ వ్యక్తీకరణ అనేది ప్రతీ భారతీయుని హక్కు. అలాగే తమిళనాడులోని తూత్తుకుడిలోని వేదాంత గ్రూపు సంస్థ స్టీరిలైట్‌ కాపర్‌ ఫ్యాక్టరీ మూసివేత సరైనదేనంటూ గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ గారు మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, స్వచ్ఛమైన నీరు త్రాగడం కాలుష్యము లేని గాలిని పీల్చడం, అనారోగ్యం వ్యాధులు లేని జీవితం గడపడం పౌరులు హక్కు అని తీర్పు ఇచ్చారు. రాబడి ఉపాధి పెరిగిన కూడా స్వచ్ఛమైన గాలి నీరు లేకపోతే ఏం ప్రయోజనం అని తెలపడం చాలా మంచి విషయం.

ఈ రెండు తీర్పులు దేశ పౌరులకు ఉండే హక్కులను తెలియ జేస్తున్నాయు. మన రాజ్యాంగం యొక్క ఔన్నిత్యం, గొప్పతనం ఎలాంటిదో స్పష్టంగా తెలుసుకోవచ్చు. పరిశ్రమలు ప్రజలకు ఉపాధి కల్పించడం దేశానికి అవసరం. కానీ అదే సందర్భంలో ఈ పరిశ్రమలు ప్రజలకు యెటువంటి అనారోగ్య సమస్యలు కలిగించగూడదని కాదనలేని నిజం. గాలి కాలుష్యం వలన ఎన్నో అనారోగ్యాలు కలుగుతున్నాయి. వాయు కాలుష్యం వల్ల మనుషులకు, జంతువులకు వ్యాధులు వస్తాయి. ఇది భూమిపై మరియు నీటిలోని సున్నితమైన పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది మరియు గ్లోబల్‌ వార్మింగ్‌ మరియు వాతావరణ మార్పులకు కారణమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదిక ప్రకారం ఆరుబయట గాలి కాలుష్యం అనేది తక్కువ, మధ్యస్థ మరియు అధిక-ఆదాయ దేశాలలో ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే ప్రధాన పర్యావరణ ఆరోగ్య సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 2019లో బయటి వాయు కాలుష్యం-సంబంధిత అకాల మరణాలలో 37 శాతం గుండె జబ్బులు మరియు స్ట్రోక్‌ కారణంగా సంభవించాయి.

18 శాతం మరియు 23% మరణాలు వరుసగా క్రానిక్‌ అబ్‌ స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ మరియు తీవ్రమైన లోయర్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ల కారణంగా సంభవించాయి మరియు 11% మరణాలు శ్వాసకోశంలో క్యాన్సర్‌ కారణంగా సంభవించాయి. ప్రతి సంవత్సరం, వాయు కాలుష్యానికి గురికావడం వల్ల 7 మిలియన్ల మంది అకాల మరణిస్తున్నారు. కాలుష్య కారకాలలో పర్టిక్యులేట్‌ మ్యాటర్‌ , కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ డయాక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌, ఓజోన్‌ మొదలైనవి ముఖ్య కారకాలుగా ఉన్నాయి. భారతదేశంలోని కోట్లాది మంది ప్రజలు నిరంతరం విషపూరితమైన గాలికి గురవుతున్నారు. వారు 24 గంటల సగటున 25 మైక్రోగ్రామ్‌లు/క్యూబిక్‌ మీటర్‌ గాలిని పీల్చుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితి 10 మైక్రోగ్రాములు/క్యూబిక్‌ మీటరుగా ఉంది. ఈ నలుసు పదార్థం ఊపిరితిత్తులలోకి మరియు ఇతర అవయవాలు మరియు వ్యవస్థలకు లోతుగా వెళుతుంది, క్రమంగా శరీరం యొక్క రక్షణ యంత్రాంగాన్ని ఓడిస్తుంది. విషపూరితమైన గాలిని పదే పదే పీల్చడం  వల్ల హృదయ మరియు శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తులు మరియు ఇతర క్యాన్సర్‌లు, స్ట్రోక్స్‌, ప్రీ-టర్మ్‌ బర్త్‌, టైప్‌-2 డయాబెటిస్‌ మరియు ఇతర అనారోగ్యాలు వస్తాయి. పట్టణ పరిసరాల్లోని నీటి వనరులు విపరీతంగా కలుషితమవుతున్నాయి.

నీటి కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటి పరిశ్రమలు విడుదల చేసే విష రసాయనాలు. శుద్ధి చేయని లేదా తగినంతగా శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్ధాలను నీటి వనరులలోకి విడుదల చేయడం వల్ల ఉపరితల మరియు భూగర్భ జలాల కలుషితానికి దారి తీస్తుంది. పారిశ్రామిక మరియు వాణిజ్య సంస్థలు చెత్త మరియు విషపూరిత రసాయనాలను డంపింగ్‌ చేయడం వల్ల ఇది సంభవిస్తుంది. నీటి కాలుష్యం నీటి జీవులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది వారి జీవక్రియ మరియు ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది మరియు అనారోగ్యం మరియు చివరికి మరణానికి కారణమవుతుంది. డయాక్సిన్‌ ఒక రసాయనం, ఇది పునరుత్పత్తి నుండి అనియంత్రిత కణాల పెరుగుదల లేదా క్యాన్సర్‌ వరకు చాలా సమస్యలను కలిగిస్తుంది. ఈ రసాయనం చేపలు, చికెన్‌ మరియు మాంసంలో చేరుతుంది. ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే పరిశ్రమలు అవసరం లేదు. వాటి వలన వచ్చే లాభం కంటే నష్టాలే యెక్కువ. అలాగే శుధ్ధి చేయకుండా నదులలోనికి, భూగర్భంలోనికి వ్యర్థాలను విడిచి పెట్టే పరిశ్రమలను నిషేధించాలి.

జనక మోహనరావు దుంగ
శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్‌
8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *