ఇంట్లోకి చొచ్చుకు వెళ్లే యత్నం..అరెస్టు…కోర్టులో హాజరు..రిమాండ్ విధింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం మాజీ స్పీకర్ పోచారం ఇంటికి వెళ్లి పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు కండువా కప్పుతున్నతున్న సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పోచారం ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొందరు పోచారం ఇంటిలోకి చొచ్చుకు వేళ్లేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు మాజీ ఎంఎల్ఏ బాల్క సుమన్, టీఆర్ఎస్యువి నేత గెల్లు శ్రీనివాస్ సహా పలువురిని అరెస్టు చేసి అనంతరం కోర్టుకు తరలించారు. వారిని కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. కాగా వారిని కోర్టుకు తరలిస్తున్న క్రమంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాగా సిఎం ఉండగానే మాజీ స్పీకర్ ఇంటిలోకి బీఆరర్ఎస్ కార్యకర్తలు చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేసిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి వొస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ఉన్నతాధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. రంగంలోకి దిగిన డీసీపీ వెస్ట్ విజయ్ కుమార్, సిఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చక్రవర్తి ఘటనా స్థలానికిచేరుకుని విచారణ చేపట్టారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించి, వీడియోలను పరిశీలించి ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశారు. నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.




