నిజాయితీ ఉంటే ప్రాజెక్టు సందర్శనను ఎందుకు అడ్డుకుంటారు?
వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది.
లేదని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
మహబూబ్నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : ఈ నెల 16వ తేదీన ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం పూర్తి అవ్వకుండా ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బోగస్ మాటలు మాట్లాడుతున్నారని, అది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అని ప్రాజెక్టుల్లో వేలకోట్ల అవినీతి కూడా జరిగిందని, లేదని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దశలు పూర్తి కాకుండానే నార్లాపూర్ వద్ద 16వ తేదీ సీఎం కేసీఆర్ పథకాన్ని ప్రారంభిస్తున్న టు చెప్పడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే ప్రతిపక్షాలు ప్రాజెక్టును సందర్శించడానికి వెళుతుంటే పోలీసులతో ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కేవలం పాలమూరు రంగారెడ్డి పథకం ప్రారంభిస్తున్నామని చెప్పి రాబోవు ఎన్నికల్లో వోట్లు దండుకోవడానికి మాత్రమే ఇది ఒక ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారని అన్నారు. ఇదే విషయంపై ప్రాజెక్టును సందర్శించడానికి వెళుతుంటే పోలీసులను పెట్టి మరి అరెస్టులు చేయిస్తున్నారని ప్రజాస్వామ్యంలో ఇది సరైన మార్గం కాదన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి బట్టబయలు అవుతుందని భయంతోనే ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు.

ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవ పరిస్థితి
ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు టెండర్ పిలిచింది 35వేల కోట్ల రూపాయలు. ఇప్పటివరకు ఖర్చుపెట్టిన లెక్క 26 వేల కోట్ల రూపాయలు. కేవలం పంపులు మోటార్లు లింక్ కెనాల్ కు సంబంధించిన ఖర్చు మాత్రమే నార్లాపూర్ నుండి ఎదుల, ఏదుల నుండి వట్టెం నుండి కరివేన మాత్రమే టెండర్ పిలిచారు. ఈ పంపు హౌస్లన్ని పూర్తికాకుండానే నార్లాపూర్ 16వ తేదీన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రజలకు భ్రమ కల్పించి వోట్లు దండుకోవడానికి మాత్రమే చేస్తున్నారన్నారని జూపల్లి తెలిపారు. నార్లాపూర్ మొదటి లిఫ్టు నుండి ఏదుల వరకు సంబంధించిన లిఫ్టు పనులు కెనాల్ పనులు పూర్తి కానే కాలేదని, ఇంతవరకు కాలువకు సంబంధించిన టెండర్లను ఎస్టిమేషన్లను, ప్రతిపాదనను అధికారికంగా లేకుండా పూర్తి అయ్యిందని సీఎం కేసీఆర్ మాయమాటలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు.
అలాగే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి భాషల చెప్పాలంటే మెడకాయ పైన తలకాయ ఉన్నవాళ్లు ఈ విధంగా మాట్లాడరన్నారు. ఈ ప్రాజెక్టులలో వేలకోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలకు తప్పకుండా తెలియజేస్తామన్నారు. ఒక్కొక్క ఎత్తిపోతన పథకంపై రూ 1600 కోట్లపై అవినీతి జరిగిందని, ఓ పక్క కోర్టులో ఇందుకు సంబంధించిన విషయం విచారణ జరుగుతూనే ఉన్నా కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని రైతన్నలను, ప్రజలను ఎందుకు మోసగిస్తున్నారని జేపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల్లో వేలకోట్ల రూపాయలు అవినీతి జరగలేదని నిరూపిస్తే ప్రగతి భవన్ ముందు ముక్కు నేలకు రాసి శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని జూపల్లి సవాల్ విసిరారు. అనంతరం జూపల్లి కృష్ణారావు ప్రాజెక్టు సందర్శన కోసం వెళుతుండగా మధ్యలోనే పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.




