నేటి తరం విద్యార్థిని విద్యార్థులకు సమాజం పట్ల కనీస అవగాహన, గౌరవమర్యాదలు లేకుండా పోతున్నాయి. అందుకు కారణాలు అనేక విధాలుగా ఉండవచ్చు.. తల్లిదండ్రులే పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చి వారు ఏమి చేస్తున్నారనే విషయాలను వారి తప్పు తెలిసే వరకు కూడా తమ పిల్లలు ఇలా చేస్తున్నారనే విషయాలు కూడా కొన్ని సందర్భాల్లో నమ్మశక్యం కానివి ఉంటుంటాయి.. సాధారణంగా పాఠశాల దశ ప్రతిఒక్కరికీ జీవితాన్ని పరిచయం చేస్తుంది. చదువు, స్నేహం, పెద్దల పట్ల గౌరవం, కుటుంబ సభ్యులతో, బంధువులతోనూ స్థాయికి తగ్గ ప్రవర్తించుటకు పాఠశాల దశ కీలకంగా ఉంటుంది. పాఠశాలలో ఉపాధ్యాయులు సంబంధిత సబ్జెక్టు విషయాలతో ఇవన్నీ విషయాలు విద్యార్థులకు బోధించేవారు. దాదాపు పదిహేనేళ్ళ నుంచి క్రమక్రమంగా విద్యార్థులో మానవీయ విలువలు తగ్గిపోతున్నాయి. తోటి వారితోనే కలహాలు పెట్టుకుంటూ పాఠశాల దశలోనే అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడుతున్నారు. మద్యం సేవిస్తూ తిరుగుతున్నారు.
చదువు చెప్పే గురువులకు కూడా కనీస విలువ ఇవ్వడం లేదు. ఇందుకు నూతనంగా విద్యావిధానంలో మార్పులు చోటుచేసుకోవడం ..ప్రధానంగా ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానంగా మారటంలో కీలకమైనది. 2009లో వచ్చిన విద్యా హక్కు చట్టం ఇది 2010 ఏప్రిల్ ఒకటో తేది నుండి అమలులోకి వచ్చింది. అందులో సెక్షన్ 17 ప్రకారం బాలలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం నిషేధం. దాని ప్రకారం ఎవరైనా ఉపాధ్యాయులు శారీరక శిక్షలకు, మానసిక వేదింపులకు గురిచేసినట్లయితే విద్యాహక్కు చట్టంలో సెక్షన్ 17 ప్రకారం ఉద్యోగ నియమాల ఆధారంగా క్రమశిక్షణ చర్యలకు గురవుతారని ఆ చట్టం పేర్కొంటోంది. అందువలన పిల్లల్లో పాఠశాల స్థాయి నుంచే దాదాపు పదిహేనేళ్ళ నుంచి వారి స్టైలిష్ వస్త్రధారణ, కటింగ్లు చేసుకుంటూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటున్నారు. కనీసం పరీక్షల సమయంలో అయినా చదువుకోవడానికి శ్రద్ధ చూపడం లేదు. ప్రాథమికంగా పిల్లల్లో క్రమశిక్షణ విలువలు లోపించడం వలననే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పదోతరగతి పరీక్షలకు సంబంధించి గుర్రంకొండ తెలుగు జిల్లా పరిషత్ పాఠశాలలో కేటాయించిన పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్ కొరకు సహకరించలేదని ఓ విద్యార్థినిని వేరే పాఠశాల విద్యార్థి పరీక్ష అనంతరం వేధించడంతో రెండు పాఠశాల విద్యార్థుల మధ్యన ఘర్షణకు దారితీసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ప్రధానంగా పాఠశాల దశలో దండన తప్పనిసరిగా చేస్తే విద్యార్థుల్లో ప్రతికూల ఆలోచనలకు తావు ఉండదనేది అభిప్రాయం.
కొరోనా వైరస్ ద్వారా విద్యా విధానం చిన్నాభిన్నం కావడం కూడా కొంతవరకు విద్యార్థుల్లో నిర్లక్ష్యం చోటుచేసుకుంది. ఆన్లైన్ తరగతుల పేరుతో చాలా వరకు విద్యార్థులు అంతర్జాలంలో మునిగిపోతూ ఆన్లైన్ గేమ్స్లో బెట్టింగులకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల ఖాతాల నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత ఆలోచనలకు బదులు ఇతరత్ర చెడు ఆలోచనలు ఎక్కువవుతున్నాయి.
విద్యార్థుల్లో మందగించిన క్రమశిక్షణ విలువలు, చదువును అశ్రద్ధ చేయడం వంటి వాటిపై ప్రభుత్వాలు దృష్టి సారించి పాఠశాల సముదాయల ద్వారా, తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశాల ద్వారా సమగ్రంగా అధ్యయనం చేసి దండన పైన పునరాలోచన చేయాలి. తప్పనిసరిగా కొన్ని పరిమితులు ఉపాధ్యాయులకు నిర్దేశిస్తూ పాఠశాలలో దండన విధించాలి. మొదట పాఠశాలలో క్రమశిక్షణకు అలవాటుపడ్డ విద్యార్థిని విద్యార్థులు కళాశాల,ఉన్నత చదువుల్లో రాణిస్తారు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉంటారు సానుకూల ఆలోచనలు చేస్తారు. గురువును గౌరవించని వారెవరు ఇతరులను గౌరవించలేరు. దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్యనే నిర్మితమవుతుందన్న డి.ఎస్.కొఠారి కమిషన్ చెప్పిన మాటలు అక్షరసత్యాలు.
-ఎజ్జు మల్లయ్య
తెలుగు లెక్చరర్
9100610501





