పండు పండింది తొడిమ ఎందుకు ఊడలేదు?

ప్రజా ప్రభుత్వంలో నియమించబడిన కొత్త  విద్యాశాఖ కార్యదర్శి స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి) సందర్శించడం, ప్రక్షాళన వెంట వెంటనే ప్రారంభించడం శుభపరిణామం. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎస్‌.సి.ఇ.ఆర్‌.టిని కబ్జాబెట్టి తిష్టివేసుకొని పీఠాదిపతులుగా మారి ముఠాలను సృష్టించి రాష్ట్ర విద్యారంగాన్ని తమ తెలివితక్కువ పథకాలతో సర్వనాశనం చేసారు. డి.ఇ.ఓలను, విద్యాశాఖలోని అధికారులతో సహ ఎవరినైనా ‘నువ్వు’ అంటూ ఏకవచనంతో సంబోధించే సంస్కారహీన పీఠాధిపతులను సైతం వదలకుండా పాత స్థానాలకు సాగనంపిన ఉత్తర్వు సోషల్‌ మీడియాలో చూసిన మరుక్షణం ‘‘కుంగిన మేడిగడ్డ ప్రాజెక్ట్‌లాగా ఆయన పాఠశాల ఎఫ్‌.ఎల్‌.ఎన్‌ బోధనకు సందర్శనా స్థలం కావాలని’’, ‘‘డిప్యూటేషన్ల రద్దుతో ఎస్‌.సి.ఇ.ఆర్‌.టికి మంచి రోజులు వచ్చాయనే’’ సెటైర్లు వేసి మరీ ఉపాధ్యాయ లోకమంతా  హర్షించి,  విద్యాశాఖ ఇచ్చిన ఆ ఉత్తర్వును స్వాగతించింది.

ట్రైనింగ్‌ల, మాడ్యూల్స్‌ తయారీ, రిసోర్స్‌ పర్సన్స్‌, పుస్తక రచయితలు లాంటి వగైరాల పేరుతో విద్యాశాఖలో ఈ నయా పీఠాధిపతులు ఓ మూఠా సామ్రాజ్యాన్నే తయారు చేసారు. ప్రతి జిల్లాలో వారి అనుయాయులు, తా అంటే తందానా అనే వందిమాగదులు ఎంత మంది ఉంటారో లెక్కలేదు. అని వాళ్ళను కూడా ఈ పీఠాధిపతులు నమ్మిందీ లేదు. ఒక ముఠా వ్యవస్థను సృష్టించడం దానిని రద్దు చేయడం అందులో పనిచేసిన ఒకరిద్దరు ఆ పీఠాధిపతులకు పరిపాటి. ఎస్‌.జి.టిలను యం.ఆర్‌.పిలుగా తయారు చేయడం, రద్దు చేయడం. స్కూల్‌ అసిస్టెంటులను యం.ఆర్‌.పిలను చేయడం, వాళ్ళకు పీఠాధిపతుల కథా కమామిషు అర్థమై ఎసరు వస్తుందని కనుగొనగానే రద్దు పరిచి మళ్ళీ కొత్తదానిని సృష్టించడం, అనుచర గణాన్ని విస్తరించడం ఆ ముఠా నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. మొత్తంగా దాదాపు రెండు దశాబ్దాలుగా ఎస్‌.సి.ఇ.ఆర్‌.టిలో వాళ్ళు ఆడిరదే ఆట పాడిరదే పాట. ఆ పీఠాధిపతుల అస్మదీయులతో ఒక కొత్త ముఠా సృష్టిలో భాగమే మానీటరింగ్‌ టీంలు.

ఎస్‌.సి.ఇ.ఆర్‌.టిలో మొన్నటికి మొన్న అత్యంత రహస్యంగా106 మంది తన అస్మదీయ ఉపాధ్యాయులకు డైట్‌లను బలోపేతం చేయడానికంటూ సి.పి.డి పేరుతో ఒక సెల్‌ ఏర్పరిచి, తమ అడుగులకు మడుగులొత్తే ముఠా సభ్యులను గుర్తించి డిప్యూటేషన్‌ పెట్టి వెంటనే డైట్స్‌లో రిపోర్టు చేయమని డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఆర్‌.సి.నెం:185/జనరల్‌/2023, తేది:21.09.2023న ఒక ఉత్తర్వు ఇచ్చారు. ఇది మంచి ఉద్దేశ్యంతో తీసిన ఉత్తర్వు అయితే మరి మూడు రోజులు సదరు ఉత్తర్వులోని వాళ్ళు డైట్స్‌లో రిపోర్టు చేసే వరకు ఎందుకు రహస్యంగా ఉంచారు? వీళ్ళంతా ఎస్‌ఆర్జీలు, డిర్జీలట! డైట్‌లను బలోపేతం చేయడానికి వీళ్ళు మాత్రమే కావాలటా! ఇందులో ఒకరిద్దరు మంచివాళ్ళు ఉంటే ఉండవచ్చుగాక, కాని మిగిలిన వాళ్ళంతా ఎవరి అనుచరులు? వీళ్ళను ఆ రిసోర్స్‌ గ్రూపుల్లోకి తీసుకొచ్చిందెవరు, ఏ ప్రామాణికతకు నిలబడని పుస్తకాల రచయితలుగా మార్చిందెవరు? దశాబ్ద కాలంగా వీళ్ళు పనిచేసే పాఠశాలలను బలోపేతం చేసారా? అక్కడ విద్యార్థుల సంఖ్య వీళ్లు పోయినప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఎంతుంది? వీళ్ళు పనిచేసే పాఠశాలల్లో అందరు త్రీ ఆర్స్‌ సాధించారా? వాల్లు ముఠా సభ్యులైతే చాలా? వాళ్ళకు ఏ టెస్ట్‌, పరీక్ష రాయించి మానీటరింగ్‌ టీంలోకి ఎంపికచేసారు? వాళ్ళు పనిచేసే పాఠశాలల విద్యార్థులు రోడ్లమీదకి వచ్చి మా ఉపాధ్యాయుడు మాకు కావాలి అని ధర్నా చేసినా ఎవ్వరు పట్టించుకోసి దుస్థితిలో విద్యాశాఖ ఉంది.

డైట్స్‌కు వీళ్ళకు ఏం బంధం, సంబంధం? డైట్స్‌ను బలోపేతం చేయాలంటే ప్రమోషన్ల ద్వారా అందులోని ఖాళీ పోస్టులను నింపాలి కాని సంబంధంలేని వాళ్ళను డిప్యూటేషన్‌ పెట్టడమేంటి? ఒక హోదాలో ఉన్నవారిని అదే హోదాలో ఉన్నవారు ఎలా మానీటరింగ్‌ చేస్తారు అని ఉత్తర్వులు ఇచ్చే అధికారులైన ఆలోచించాలిగా?  నేరుగానే వీరందరిని ఉన్నతి మరియు ఎఫ్‌.ఎల్‌.ఎన్‌ ఏ విధంగా పాఠశాలల్లో జరుగుతుందో పరిశీలించడానికి అధికారులు ఉపాధ్యాయుల జాబ్‌ చార్ట్‌లో మానీటరింగ్‌ చేయాలని లేకపోయినా నిబంధనలకు విరుద్దంగా ఎగదోశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర విద్యాశాఖ మేమో నెం.456/ఎస్‌.ఇ.ప్రొగ్రామ్‌.2/2024, తేది.23.01.2024 రోజున పాఠశాలల పర్యవేక్షణ, పరిశీలనాధికారాలన్నింటిని మండల విద్యాధికారులు, డిప్యూటీ విద్యాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులు మాత్రమే చేయాలని స్పష్టమైన ఉత్తర్వు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ 106 మంది డిప్యూటేషన్‌ పెట్టబడిన ఉపాధ్యాయులకు డైట్స్‌లో ఉంచాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.

సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌ లేని ఓ వ్యవస్థ నుండి ఓ మహిళ ఉపాధ్యాయురాలిని అన్ని నిబంధనలను ఉల్లంఘించి ఏకపక్షంగా ఎస్‌.సి.ఇ.ఆర్‌.టిలో నియమించిన విధానం చూస్తే తన అస్మదీయుల కోసం ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి తెగబడి ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తుందో ఇట్టే అర్థమైపోతుంది. ఇలా రద్దు ఉత్తర్వులు వెలువడ్డాయోలేదో అప్పుడే ఆ పీఠాధిపతులు, ముఠాసభ్యులు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షణలు చేయడం ప్రారంభించడంతో పాటు, ‘‘వెల వెల బోతున్న ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి’’ అంటూ తాటికాయంతా అక్షరాలతో వార్తలు వచ్చేవిధంగా చేసి ఏదోరకంగా మళ్ళీ అందులోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

డైట్‌లకు పెట్టబడ్డ 106 ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్లను మరియు ఎస్‌.సి.ఇ.ఆర్‌.టిలో నిబంధనలకు విరుద్దంగా జరిగిన నియామకాలన్నింటిని వెంటనే రద్దు చేయడానికి విద్యాశాఖ కార్యదర్శి, కొత్త ప్రజా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఎస్‌.సి.ఇ.ఆర్‌.టిలో అవసరమైన ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చి ఎంపిక చేయాలి. ఒకవేళ డిప్యూటేషన్‌ పెట్టాల్సివస్తే రెండేళ్ళకు మించి కాలపరిమితికి అనుమతించకూడదు. రిటైర్డ్‌ వారికి కూడా ఎటువంటి అవకాశాలు ఇందులో కల్పించకూడదు. కొత్త ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసి విద్యావ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయడంలో భాగంగా ఎస్‌.సి.ఇ.ఆర్‌.టిని బాగుపరిచి నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆశిద్దాం.
-ఏ.శ్రీదేవి, సామాజిక, విద్యారంగ
విశ్లేషకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *