నేటి నుండి ‘ప్రజాపాలన’

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో ఇంతకాలం సాగిన రాజరిక పాలనకు భిన్నంగా ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుతామని చెబుతూవొచ్చిన కాంగ్రెస్‌ ప్రజల నమ్మకం వమ్ముకాకుండా అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలకు కూడా నేడు శ్రీకారం జరుగనుంది. పదేళ్ళుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌పార్టీ ఆరు గ్యారంటీలతోపాటు పదుల సంఖ్యలో అనేక వాగ్ధానాలు చేసింది. అయితే ఈ ఆరు గ్యారంటీలను మాత్రం వందరోజుల్లోనే పూర్తిచేసి చూపుతామని శపథం చేసింది. అన్నట్లుగానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన రెండవ రోజున్నే రెండు గ్యారంటీలను అమలుచేసి చూపించారు. ఇప్పుడు మిగతా గ్యారంటీలను ప్రజల ముందు పెట్టే బృహత్‌ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించబోతున్నారు. ఈ నెల ఏడున ప్రమాణ స్వీకారంచేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే గడీల ప్రభుత్వానికి భిన్నంగా తమ పాలనను సాగిస్తున్నది.

ప్రమాణ స్వీకారం జరుగుతున్న క్రమంలోనే  ప్రగతి భవన్‌ ముందున్న ఇనుమ కంచెను తొలగించి దాన్ని ప్రజాభవన్‌గా పేరు పెట్టడంతోపాటు అక్కడ ఏర్పాటు చేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమంతో వేలాది మందికి ఆ భవన్‌లో ప్రవేశం ఉందని  రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరూపించింది. ఇప్పుడు ప్రజాపాలనను మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్ళే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టంది. ప్రజాపాలన పేరుతో గ్రామీణ ప్రాంతంనుండి నగర ప్రజలవరకున్న సమస్యలను పరిష్కరించే సరికొత్త ప్రణాళికను రూపొందించింది. నిరుపేద వర్గాలకు ప్రభుత్వం అందించే పథకాలు సక్రమంగా అందేందుకు ప్రజాపాలన పేర కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం ఒక సమగ్ర దరఖాస్తు నమోనాను ప్రభుత్వం సిధ్ధం  చేసింది. దాన్ని బుధవారం  రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క ,ఇతర మంత్రులు ,అధికారుల నడుమ  ఉదయం 11 గంటలకు  విడుదల చేసారు.. ‘ప్రజాపాలన గ్యారెంటీ దరఖాస్తు’గా నామకరణ చేసిన ఈ నమోనాలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సంబంధించిన  అంశాలన్నిటినీ ఒక దరఖాస్తులోనే పొందుపర్చారు.

ఈనెల 28న విడుదలయ్యే ఈ దరఖాస్తు ద్వారా లబ్ధిదారులు తమకు కావల్సిన పథకాలను ఈ నెల ఆరవ తేదీలోగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆరవ తేదీ తర్వాత దరఖాస్తులు తీసుకోరన్నది ఏమీలేదని మంత్రులు చెబుతున్నారు. ఆ తర్వాత కూడా ఆఖరి  దరఖాస్తు వరకు అధికారులు స్వీకరిస్తారంటున్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా తమ ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టదన్న విశ్వాసాన్ని ప్రజలకు కలుగజేసేవిధంగా ప్రతీ దరఖాస్తును స్వీకరించడంతోపాటుగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని చెబుతున్నారు. అర్హులైన ప్రతీఒక్కరికీ పథకాలను అందజేయడం జరుగుతుందని మంత్రులు పేర్కొంటున్నారు. నగరాల్లో సదస్సులు,  సమావేశాలతోపాటు  గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించే కార్యక్రమంలో అధికారులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందిగా ప్రభుత్వం సంబంధిత  అధికారులకు సూచనలు చేసింది.

ఇందులో ప్రధానంగా మహిళలకు ప్రతీనెల 2500 రూపాయలు అందజేసే మహాలక్ష్మీ పథకం, 500రూపాయలకు గ్యాస్‌ సిలిండర్‌,  గృహ జ్యోతిపథకం కింద ప్రతీ కుటుంబానికి రెండు వందల యూనిట్లవరకు ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ పథకం కింద దివ్వాంగులకు ఆరు వేల రూపాయలు, ఇతరులకు నాలుగు వేలరూపాయాలు ఇవ్వనున్న పథకాలు ఉండడంతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు దరఖాస్తులకు కావాల్సిన ఇన్‌కం సర్టిఫికేట్‌, ఆధార్‌కార్డులను సరిచేసుకునే విషయంలో ఆధార్‌ సెంటర్‌ల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఆయా సెంటర్లన్నీ కోలాహలంతో నిండిపోయాయి. అయితే గతంలో కొన్ని పథకాల ద్వారా లబ్ది పోందుతున్న వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పథకం రాని వారు మాత్రం ఈ కొత్త ప్రభుత్వంలో తిరిగి దరఖాస్తు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు. అయితే ఈ పథకాలకోసం దరఖాస్తుచేసుకునేందుకు కేవలం తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారే అర్హులా లేక ఎవరైనా దరఖాస్తు చేసుకోవొచ్చా అన్న విషయంలో మాత్రం స్పష్టత లేక పోవడంతో తెల్ల రేషన్‌ కార్డులేనివారు అయోమయానికి గురి అవుతున్నారు. కాగా దరఖాస్తు చేసుకునే విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులే స్యయంగా ఆయా గ్రామాల్లో పర్యటించి వివరాలను తీసుకుని వారే దరఖాస్తులను నింపుతారని, అనవసరంగా  దలారీలతో  నింపించి ఇబ్బంది పడాల్సిన అససరం లేదని ప్రభుత్వం హెచ్చరిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *