తాజా ఫోటోతో ప్రకటన విడుదల చేసిన ఎన్‌ఐఎ
న్యూ దిల్లీ, సెప్టెంబర్ 1 : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి సమాచారం అందించిన వారికి రూ 25 లక్షల రివార్డును ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎ ప్రకటించింది. ఈ మేరకు దావూద్ తాజా ఫోటోను విడుదల చేసింది. అదేవిధంగా దావూద్ ఇబ్రహీం అనుచరుడు చోటా షకీల్‌పై కూడా రూ. 20 లక్షల బహుమతిని ప్రకటించింది. వీరితో పాటు ఉగ్రవాదులు అనీస్ ఇబ్రహిం, జావేద్ చిక్నా, టైగర్ మొమోన్ తలపై కూడా రూ. 15 లక్షల రివార్డు ఇస్తామంది.
దావూద్‌తో పాటు ఇతరులు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, జైషే మహ్మద్, ఆల్ ఖైదాలకు నిధులను సమకూరుస్తూ…వాటితో కలిసి పనిచేస్తున్నారని ఎన్‌ఐఎ తెలిపింది. 1993 నాటి ముంబయి పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం, ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదలు పొరుగు దేశాల్లో దర్జాగా బతుకుతున్నారని గత ఏడాది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ పేర్కొంది. ఉగ్రవాద సంస్థల నుండి వచ్చే బెదిరింపులను పరిష్కరించుకునేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలను కేంద్రీకరించాలని పిలుపునిచ్చింది.




