వాటిలోనే తలదాచుకుంటున్న మావోయిస్టులు
కనిపెట్టి సొరంగాలను పరిశీలిస్తున్న భద్రతా బలగాలు
భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 31 : ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలో దంతెవాడ, బీజాపూర్ మావోయిస్టులు భద్రతా బలగాలకు కంట పడకుండా రహస్యంగా ఉండేందుకు భారీ ప్లాన్ చేసారు. ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని దంతెవాడ, బీజాపూర్ అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల కొద్ది సొరంగాలు తవ్వారు. ఎవరికి అనుమానం రాకుండా సొరంగాలపై భాగాలపై కర్రలు వేసి మట్టి కప్పారు. ఈ సొరంగాలను భద్రతా బలగాలు బుధవారం నాడు పసిగట్టాయి. మంగళవారం నాడు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో మావోయిస్టులు భారీగా పాల్గొన్నట్లు తెలుస్తుంది. ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం భద్రతా సిబ్బందిని రాయ్‌పూర్ తరలించారు. జరిగిన ఈ సంఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఒక్కసారిగా అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు.

ఈ పరిస్థితిలో కర్రలతో అమర్చిన బంకర్ కనబడటంతో భద్రతా సిబ్బంది అనుమానం వొచ్చి ఆ కర్రలను తొలగించారు. దీనితో అసలైన నిజాలు బయటపడ్డాయి. మావోయిస్టులు భూమి లోపల భారీగా సొరంగాలు తవ్వి అక్కడే నివసిస్తున్నట్లు భద్రతా బలగాలు పసిగట్టాయి. మావోయిస్టులు ఈ సొరంగాల్లో ఉన్నారని భద్రతా బలగాలు సొరంగాల గుండా కిలోమీటర్ల కొద్ది గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులు ఏర్పరచుకున్న సొరంగాలు గాలి, వెలుతురు వొచ్చే విధంగా కూడ సొరంగాల వద్ద అక్కడక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్లు భద్రతా బలగాలు గమనించాయి. గతంలో మావోయిస్టులు అటవీ ప్రాంతంలోని తలదాచుకునేవారని భద్రతా బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టేవారు. అటవీ ప్రాంతంలోని సమావేశాలు కూడ నిర్వహించుకునేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపడంతో భారీ భద్రత బలగాలు అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి మావోయిస్టులను ఏరివేసేందుకు మాస్టర్ ప్లాన్‌లు వేస్తున్నారు. అందుకు ధీటుగా మావోయిస్టులు కొత్త తరహాలో అటవీ ప్రాంతంలోనే కిలోమీటర్లు కొద్ది భూమిలో సొరంగాలు తవ్వి అక్కడే తలదాచుకునే పరిస్థితి ఏర్పరచుకున్నారు. ఈ సొరంగాలను భద్రతా బలగాలు ఆలస్యంగా కనుగొన్నాయి.
సొరంగాలను పరిశీలించిన తరువాత భద్రతా అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మావోయిస్టులు ఆ సొరంగాల నుండి లోపలికి వేళ్ళేందుకు మరియు ఏమైన ప్రమాదం జరిగితే సునాయాసంగా తప్పించుకునేందుకు ప్రత్యేక ద్వారాలను కూడ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. గత కొన్నినెలల పాటు మావోయిస్టుల ప్రభావం కాస్త తగ్గినప్పటికి మళ్ళీ మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర పోరాటం జరుగుతుంది. ఇరువురి మధ్య తరచూ కాల్పులు జరుగుతున్నాయి. సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై కూడ మావోయిస్టులు ఒక్కసారిగా సుమారు వంద మంది దాడి చేసిన సంఘటనలు కూడ చోటు చేసుకుంది. ఇది మరువక ముందే భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భారీ కాల్పుల యుద్దం జరిగింది. అనంతరం భద్రతా బలగాలు మవోయిస్టుల సొరంగాన్ని అతి చాకచక్యంగా గమనించి సొరంగాన్ని కనుగొన్నారు. భద్రతా బలగాలు సొరంగాల గుండా వెళ్ళి పరిశీలించారు.





