‘‘దేశవ్యాప్తంగా 1.36 లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచి పోయింది. బొగ్గు ధర పెరిగితే విద్యుత్ ఉత్పత్తి ధరలు, చమురు ధరలు, కరెంటు చార్జీలతో పాటు అన్ని నిత్యవసరాల ధరలకు రెక్కలు వస్తాయి. ఈ కరెంటు కష్టాలు మరో 6 నెలలు వెంటాడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనితో ద్రవ్యోల్బనంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బొగ్గు, గ్యాస్ వినియోగంతో వాతావరణ ప్రతికూల మార్పులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో దేశం మరో హరిత విప్లవం 2.0 రూపంలో సాంప్రదాయేతర తరగని ఇంధనాల ఉత్పత్తి పట్ల సత్వరమే దృష్టి సారించి విద్యుత్ సంక్షోభాన్ని శాశ్వతంగా తొలగించడానికి వడివడిగా అడుగులు వేయాల్సి ఉంది. ’’
భారతావని బొగ్గు కొరతతో విద్యుత్తు సంక్షోభపు అంచున నిలబడి ఉంది. దేశంలోని 135 బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో సగానికి పైగా ప్లాంట్లలో బొగ్గు కొరత రానున్నది. పవర్ ప్లాంట్లలో అవిచ్ఛిన్నంగా విద్యుత్ ఉత్పత్తి జరగడానికి ఇంధనంగా బొగ్గు లేదా గ్యాస్ అందాల్సి ఉంది. భారీగా విద్యుత్ వినియోగం పెరగడం, బొగ్గు టన్ను ధర 60 నుంచి 200 డాలర్లకు పెరగడంతో ఉత్రత్తి పడిపోవడంతో పాటు 16 ప్లాంట్లు మూతపడడం, మరో 30 ప్లాంట్లు తాళాలు బిగించే దిశగా వెళుతున్న వేళ విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలు చీకటి అంచు నిలబడనున్నాయి. దేశవ్యాప్తంగా 1.36 లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచి పోయింది. బొగ్గు ధర పెరిగితే విద్యుత్ ఉత్పత్తి ధరలు, చమురు ధరలు, కరెంటు చార్జీలతో పాటు అన్ని నిత్యవసరాల ధరలకు రెక్కలు వస్తాయి. ఈ కరెంటు కష్టాలు మరో 6 నెలలు వెంటాడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనితో ద్రవ్యోల్బనంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బొగ్గు, గ్యాస్ వినియోగంతో వాతావరణ ప్రతికూల మార్పులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో దేశం మరో హరిత విప్లవం 2.0 రూపంలో సాంప్రదాయేతర తరగని ఇంధనాల ఉత్పత్తి పట్ల సత్వరమే దృష్టి సారించి విద్యుత్ సంక్షోభాన్ని శాశ్వతంగా తొలగించడానికి వడివడిగా అడుగులు వేయాల్సి ఉంది.
భారతంలో దాదాపు 70 శాతం పెట్రోలియం చమురు ఉత్పత్తులు, బొగ్గు, గ్యాస్ లాంటి సాంప్రదాయ శిలాజ ఇంధన వనరుల వినియోగం జరుగుతోంది. ప్రపంచంలోనే అధిక బొగ్గు వినియోగిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఉన్నది. మన దేశపు అవసరాలకు తగిన బొగ్గు నిల్వలు దాదాపు 300 ఏండ్ల వరకు అందుబాటులో ఉన్నప్పటికీ సప్లై-డిమాండ్ అంతరంతో దిగుమతులు జరుగుతున్నాయి. బొగ్గు వినియోగంతో కార్బన్ ఉద్గారాలు పెరుగుతూ అధిక గాలి కాలుష్యం, భూతాపం, వాతావరణ ప్రతికూల మార్పులు జరిగి మానవాళి ఆరోగ్యాన్ని హరిస్తాయి. బొగ్గు, చమురు, గ్యాస్ లాంటి తరిగే పర్యావరణ ప్రతికూల ఇంధనాల వినియోగాలకు ప్రత్యామ్నాయంగా తరగని, సాంప్రదాయేతర పునరుత్పాదక (రిన్యువబుల్) ఇంధనాలను వినియోగంలోకి తేవడానికి ప్రభుత్వాలు పథక రచనలు చేస్తున్నాయి. సౌరశక్తి, పవన శక్తి, టైడల్ ఎనర్జీ (అలల శక్తి) లాంటి శక్తి వనరులను తక్షణమే అధిక మ్నెత్తంలోఅన్వేషించాల్సి సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపకపోవడంతో పర్యావరణహిత తరగని సాంప్రదాయేతర శక్తి ఉత్పత్తులు తగినంతగా పెరగడం లేదు.
పర్యావరణహిత తరగని శక్తి వనరులను అధిక మ్నెత్తంలో వెలికి తీయడానికి మరో హరిత శక్తి విప్లవం 2.0 (క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రెవొల్యూషన్ 2.0) రావలసి ఉంది. 2022 నాటికి 175 గీగావాట్స్ (జిడ్ల్యూ) శక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అంచనాలను అందుకోవడం అసాధ్యంగానే తోస్తున్నది. నేడు 100 జిడ్ల్యూ హరిత శక్తి(గ్రీన్ పవర్)ని మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. రిలియన్స్ కంపెనీ రూ: 75,000 కోట్లను వెచ్చించి నాలుగు ఫ్యాక్టరీలను నెలకొల్పి హరిత సౌర శక్తి నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నది. హరిత శక్తి ఉత్పత్తి కంపెనీలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ: 4,500 కోట్లను సబ్సిడీల రూపంలో కేటాయించింది. ఇండియాలోని పరిస్థితులు 1,000 జిడ్ల్యూ హరిత శక్తి ఉత్పత్తికి సహకరిస్తాయని అంచనా. పారిస్ ఒప్పందం అమలు జరిగితే ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి 26 ట్రిలియన్ డాలర్లకు చేరి, 24 మిలియన్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. అదానీ కంపెనీ యాజమాన్యం రానున్న 10 ఏండ్లలో 20 బిలియన్ డాలర్లను వెచ్చించి హరిత శక్తి ఉత్పత్తి, రవాణ, పంపిణీ చేయనున్నది. టాటా కంపెనీ యాజమాన్యం రానున్న రోజుల్లో బొగ్గు ఆధారిత ప్లాంట్ల స్థాపనకు చరమగీతం పాడుతూ, హరిత శక్తి ఉత్పత్తి ప్లాంట్లను పెద్ద ఎత్తున చేపట్టనున్నది. అనేక కంపెనీలు, స్టార్ట్అప్‌లతో పాటు హరిత శక్తి విప్లవం 2.0 వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తున్నాయి. ప్రభుత్వరంగ యన్‌టిపిసి, ఐఓసి కంపెనీలు సౌరశక్తి, పవనశక్తి ఉత్పత్తికి చొరవ తీసుకుంటున్నాయి.
తరగని సాంప్రదాయేతర ఇంధన పర్యావరణహిత సౌరశక్తి, పవనశక్తి, అలల శక్తితో పాటు హైడ్రోజన్ ఇంధనం, బయోమాస్, శరీర ఉష్ణం, వ్యర్థ ఆల్కహాల్ లాంటి వనరులను వినియోగించి అధిక హరిత శక్తిని ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇటీవల యుయస్ కంపెనీ హైదరాబాద్?లో హరిత శక్తి ఉత్పత్తి నిమిత్తం రూ: 5,000 కోట్లను వెచ్చిస్తున్నట్లు తెలిపింది. ఇన్ఫొసిస్, రీన్యూ, విక్రమ్ సోలార్, వారీ ఎనర్జీస్ లాంటి పలు కంపెనీలు హరిత శక్తి విప్లవం 2.0లో ప్రధాన భూమికను పోషించనున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 234 జిడ్ల్యూ (61 శాతం) థర్మల్ ఎనర్జీ, 99 జిడ్ల్యూ (25 శాతం) పునరుత్పాదక తరగని శక్తి, 46 జిడ్ల్యూ (12 శాతం) జల విద్యుత్తు, 6.7 జిడ్ల్యూ (2 శాతం) అణువిద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నది. 2030 నాటికి ఇండియాలో ప్రస్తుత 43 శాతం నుంచి 66 శాతం వరకు సౌరశక్తి ఉత్పత్తి పెంచాలని నిర్ణయించారు. హరిత శక్తి విప్లవం 2.0 అమలులో భాగంగా 2022 నాటికి 175 జిడ్ల్యూ, 2024 నాటికి 225 జిడ్ల్యూ, 2030 నాటికి 450 జిడ్ల్యూ పర్యావరణహిత శక్తిని ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు వేశారు.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగరం, 9949700037




