ప్రజాస్వామ్యం ప్రజల పాలిట వరం. కాని ఈ విషయం ఎందరికి అవగతమవుతుంది? ఎండలో తిరిగితేనే నీడ విలువ తెలుస్తుంది. కష్టాలు అనుభవిస్తేనే నిజమైన సుఖం అంటే ఏమిటో స్ఫురణకు వస్తుంది. కొన్ని దేశాల్లో కొనసాగుతున్న అప్రకటిత నియంతృత్వం, మరికొన్ని దేశాల ప్రజలు అనుభవిస్తున్న ప్రత్యక్ష నియంతృత్వ వ్యవస్థల చేదు అనుభవం ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనుభవిస్తున్న ప్రజలంతా తెలుసుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం యొక్క విలువ తెలుస్తుంది. ప్రజాస్వామ్యం స్వేచ్ఛకు ప్రతిరూపం. వోటు ప్రజల చేతిలో వజ్రాయుధం. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రభువులు కారు. కేవలం ప్రజా సేవకులే అన్న భావం గుర్తుంచుకోవాలి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. రాజకీయ వైరుధ్యాలు ప్రజాజీవనానికి ప్రతిబంధకం కారాదు. ప్రజాస్వామ్యంలో వోటు హక్కు ప్రజాభిప్రా యాన్ని ప్రతిబింబించే ప్రక్రియ. ప్రజల అభిప్రాయాలు పరిపాలనా విధానాలను బట్టి తారుమారు కావడం సహజం. ఈ సత్యాన్ని అన్ని రాజకీయ పక్షాలు గమనించాలి. ప్రజలు కూడా వోటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ప్రలోభాలకు లొంగకూడదు.
ఎక్కడ చూసినా, ఏ ఎన్నికల్లో చూసినా వోటు వేటలో ధన ప్రవాహం ఏరులై పారుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి పరిస్థితులు మారాలి. డబ్బు మీద వ్యామోహం నశించాలి. దేశాభివృద్ధి కోసం తపన పెరగాలి. దేశంలోని మేథావులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు ఎన్నికల వ్యవస్థలోను, రాజకీయ రంగం లోను అపసవ్య ధోరణులను నిరోధించడానికి మేథోమధనం జరపాలి. కలుషితమె ౖపోతున్న రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే భావితరాలకు భవిష్యత్తు ఉండదు. భారతదేశం ప్రపంచంలో అధిక జనాభా గల దేశం. భిన్న మతాలతో, విభిన్న కులాలతో, సంస్కృతులతో ప్రత్యేకతను సంతరించుకున్న దేశానికి నియంతృత్వం, అధ్యక్షతరహా పాలనా సరికాదని ఆనాడే మన పెద్దలు భావించారు. ప్రజాస్వామ్య పద్దతే శ్రేయస్కరమని, ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అన్ని వర్గాల ప్రజలకూ సమన్యాయం జరుగుతుందని భావించారు. ప్రజాభీష్టం ప్రకారమే పాలన జరగాలని, ప్రజలెన్నుకున్న ప్రతినిధుల ద్వారానే పాలన జరగాలనేది ప్రజాస్వామ్య మూలసిద్ధాంతం. భారత దేశ ప్రజాస్వామ్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఎలాంటి వివక్షత లేకుండా వోటు హక్కును వినియోగించుకోవచ్చు. యువత ఆలోచనలు, పెద్దల అనుభవాలు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలి. వోటు హక్కు అందుకు మార్గం సుగమం చేస్తుంది. ప్రజాస్వామ్యం పదికాలాలు వర్ధిల్లడానికి ఓటు హక్కు ఒక మహత్తర అవకాశం.
భారత దేశం బ్రిటీషు కబంధ హస్తాల నుండి విముక్తి చెంది, స్వాతంత్య్రం పొందిన తర్వాత ప్రజాస్వామ్య, లౌకిక దేశంగా అవతరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రధానమైనవి. అలాంటి ఎన్నికలను ఎలాంటి ఒడిదుడు కులు లేకుండా సజావుగా నిర్వహించడానికి వోటర్ల హక్కులను కాపాడడానికి ఒక స్వతంత్ర చట్టబద్ధమైన ఎన్నికల వ్యవస్థ ఏర్పడిరది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వోటరు విజ్ఞత మీదే దేశ, రాష్ట్రాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వోటు హక్కు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన వోటు హక్కును దుర్వినియోగం చేసుకోరాదు.
అయితే నేటి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి. ఎన్నికల్లో ధనం, మద్యం ప్రజాస్వా మ్యాన్ని శాసించడం దురదృష్టకరం. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పక్షాలన్నీ అడ్డదార్లు త్రొక్కుతున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిహాసప్రాయం చేస్తున్నాయి. యథాశక్తి వోటరు కూడా ధన ప్రభావానికి లోనౌతున్నాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి వోటు హక్కును దుర్వినియోగం చేయడం జరుగుతున్నది. డబ్బుకు అమ్ముడు పోయిన వ్యక్తులు ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కును కోల్పోయినట్టే. ఎన్నికల ముందు రాజకీయ పక్షాలు ఎరగా వేసే తాయిలాల వలలో చిక్కి సామాన్య వోటరు మోసగింపబడుతున్నాడు. వోటరులో చైతన్యం ఉన్నా రాజకీయ పార్టీల ఎన్నికల పాచికల్లో ఓడిపోయి, పూచిక పుల్లల్లా పరిగణింపబడడం, ఎన్నికల తర్వాత కూరలో కరివేపలా తృణీకరింప బడడం ప్రజాస్వామ్య మనుగడకు విఘాతం.
ప్రజల స్వేచ్ఛను కాపాడడం, ప్రజాభీష్టానికి అనుకూలంగా నడచుకోవడం పాలకుల ధర్మం. ప్రజా ఉద్యమాలను పట్టించుకోకపోతే ప్రజాస్వామ్యం ఒక ప్రహసన ప్రాయంగా మారుతుంది. వోటరు తమ బాధ్యతను విస్మరించకూడదు. వోటరులో చైతన్యం రావాలి. వోట్లను అమ్ముకుని, తమ జీవితాలను తామే నాశన చేసుకుంటున్నామన్న స్ఫృహ వోటరులో కలగాలి. ఎన్నికల సంఘంలో కూడా మార్పురావాలి. అనేక సంస్కరణలు రావాలి. టి.ఎన్.శేషన్‌లా నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తులే ఎన్నికల సారధ్యం వహించాలి. రకరకాల ప్రలోభాలు, వత్తిళ్ళు వోటరును అయోమయానికి గురి చేస్తున్నాయి. వోటరు దృక్పథంతో మార్పు రావాలి. వోటు హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పాశుపతాస్త్రం లాంటిది. అది సక్రమంగా వినియోగపడాలి. ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లాలి. ప్రజలకు నచ్చని ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే చట్టాలను రూపొందించాలి. అప్పుడే వోటు విలువ, వోటర్ల గౌరవం పెరుగుతుంది. పట్టణ ప్రాంత ప్రజలు వోటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహించరాదు. ఈ విషయంలో గ్రామీణ ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి. వోటు హక్కు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతిబంబం. ఎక్కువ పర్యాయాలు వోటు హక్కు వినియోగించుకోని పౌరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
సుంకవల్లి సత్తిరాజు
(సామాజిక విశ్లేషకులు)
సంగాయగూడెం, దేవరపల్లి మండలం,
తూ.గో.జిల్లా, ఆంధ్రప్రదేశ్
9704903463





