గత పదేళ్ళలో కేంద్రంలో ఒక్క రూపాయి అవినీతి లేదు

సికింద్రాబాద్‌లో అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తున్నాం
కిషన్‌ రెడ్డి అందరిలా కాదు..నీతిమంత నాయకుడు
సికింద్రాబాద్‌లో కిషన్‌ రెడ్డి నామినేషన్‌  సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌ నాథ్‌

 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : గత పదేళ్ళలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరుగలేదని, తమది అవినీతి రహిత ప్రభుత్వమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కిషన్‌ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిషన్‌ రెడ్డి ఎంపీ అయ్యాక సికింద్రాబాద్‌ ఎలా అభివృద్హి అయ్యిందో చూస్తున్నామని, ఆయన అందరిలాంటి వాడు కాదని, నీతిమంతమయిన నాయకుడని రాజ్‌నాథ్‌ ప్రశంసించారు. అనేకమంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో  తొలిగా అధికారంలోకి వొచ్చిన బీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శించారు. రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వారి ఆత్మలు శాంతించలేదని అన్నారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఉన్నామని, ఆర్థికంగా అత్యంత వేగంగా ఎదుగుతున్నామని తెలిపారు. 2047 లోపు దేశం మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందన్నారు. తమ ప్రభుత్వం వొచ్చాకే అయోధ్య రామ మందిరం కట్టామని, రామ రాజ్యం వొచ్చిందని అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేశామని, జమ్మూ కాశ్మీర్‌ ఇప్పుడు భారత ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఉందని అన్నారు. అదే విధంగా ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేశామని, సిఎఎను తీసుకువొచ్చామని రాజ్‌నాథ్‌ తెలిపారు.

బీజేపీ దేశంలోనే అత్యంత ప్రజాస్వామ్య పార్టీ అని, రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతుంటే.. అక్కడ మన విద్యార్థులు ఉన్నారని, రెండు దేశాలతో మాట్లాడి..యుద్ధాన్ని ఆపి విద్యార్థులను తీసుకోచ్చిన ఘనత ప్రధాని మోదీదని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేనంతగా దేశంలో డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ తీసుకువొచ్చామని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. కిషన్‌ రెడ్డికి మనుషులు మాత్రమే తెలుసునని, మతం, కులం రంగు లేదని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ 33 శాతం రిజ్వరేషన్‌ ఇస్తామని అన్నారు కానీ ఇవ్వలేదని, మోడీ చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. దేశం ఇప్పుడు అత్యంత శక్తిమంతమైనదిగా అవతరించిందని, రక్షణ వ్యవస్థను అత్యంత శక్తిమంతంగా తయారు చేసామన్నారు. కిషన్‌ రెడ్డి తనతో పాటు పని చేశారని, ప్రజల సమస్యలను..వారి ఆలోచనలను పార్లమెంట్‌లో వినిపిస్తారని తెలిపారు. సిరింద్రాబాద్‌ అభ్యర్థిగా కిషన్‌ రెడ్డిని, మల్కాజ్‌ గిరి అభ్యర్థిగా ఈటలను గెలిపించాలని రాజ్‌నాథ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఈటల ్న పార్టీ అవినీతిని చూసి బయటకు వొచ్చేశాడని రాజ్‌నాథ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *