నేడు హరగోవింద్ ఖొరానా జన్మదినం
కృత్రిమ జన్యువును నిర్మించిన శాస్త్రవేత్తగా హరగోవింద్ ఖొరానా ఆధునిక జీవశాస్త్రములో ఒక విప్లవానికి తెర లేపాడు.ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమము మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచడి ఉన్నదని కనుగొన్న జీవ శాస్త్ర వేత్త హర గోవింద ఖోరానా. వరుసగా ఉన్న కృత్రిమ జీన్ (డిఎన్‌ఏ) ముక్కను ప్రయోగశాలలో మొదటిసారిగా సృష్టించడం ద్వారా ఎన్నో పరిశోధనలకు బాట వేశాడు. ఖోరానా నూతన ఆవిష్కరణ జెనెటిక్ ఇంజనీరింగ్ అనే నూతన శాస్త్ర అధ్యయనానికి దారి తీసింది. ప్రయోగశాలలో డీఎన్‌ఏ (డీ ఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం) సంశ్లేషణ చేయగల్గిన మొట్టమొదటి శాస్త్రజ్ఞుడిగా హరగోవింద్ ఖొరానా పేరుపొందాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో సర్. సి.వి.రామన్ తదనంతరం పేర్కొనదగిన శాస్త్రవేత్త హరగోవింద్ ఖొరానా.
పంజాబ్ (ఇప్పుడు పాకిస్తాన్)లో ఓ గ్రామంలోని ఏకైక అక్షరాస్యత కుటుంబంలో జన్మించి, చదవడం, వ్రాయడం తన తండ్రి ద్వారా నేర్చుకుని, నోబెల్ బహుమతి గ్రహీతగా… కృత్రిమ జన్యువును నిర్మించిన మొదటి వ్యక్తిగా ఎదిగాడు హరగోవింద్ ఖొరానా. హరగోవింద్ ఖొరానా (9 జనవరి 1922- 9 నవంబర్ 2011) భారతీయ సంతతికి చెందిన, నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు. 1922 జనవరి 9న అవిభక్త భారత దేశములోని పంజాబ్ రాష్ట్రమునకు చెందిన రాయపూరు అనే గ్రామములో జన్మించాడు (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నది). తండ్రి పన్నులు వసూలు చేసే గ్రామ పట్వారి. అయిదుగురి సంతానములో చివరి వాడు. తొలుత తండ్రి శిక్షణలోను, తదుపరి ముల్తాన్ లో చిన్నతనం నుండే సైన్స్ పట్ల ఆకర్షితుడైన హర్ గోవింద్ చెట్టు కింద గుమిగూడిన ముల్తాన్ లోని దయానంద్ ఆర్య విద్యా ఉన్నత పాఠశాల నుండి తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. పంజాబ్ విశ్వ విద్యాలయము, లాహోర్ (ప్రస్తుతం పాకిస్తాన్) 1943 లో బీ.ఎస్సీ 1945లో ఎం.ఎస్సీ పట్టాలు పొందాడు. లివర్ పూల్ విశ్వ విద్యాలయములో 1945 నుండి 1948 వరకు శాస్త్ర పరిశోధనలు చేసి పీ.హెచ్.డీ పట్టా పొందాడు. సేంద్రీయ కెమిస్ట్రీలో డాక్టరేట్ పొందిన తరువాత, ప్రొఫెసర్ వ్లాదిమిర్ ప్రిలాగ్‌తో కలిసి తదుపరి రెండు సంవత్సరములు పని చేయడానికి జూరిచ్ వెళ్లాడు. వ్లాదిమిర్ ఒక గురువుగా వ్యవహరించాడు. సైన్స్ పట్ల తనకున్న ప్రేమను హరగోవింద్ ఖొరానా మరింత పెంచుకున్నాడు.
1951-52లో విశ్వవిఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయములో మాంసకృత్తులు, న్యూక్లిక్ ఆమ్లములకు సంధించిన పరిశోధన మొదలు పెట్టాడు. 1952లో కెనడా లోని బ్రిటిష్ కొలంబియా (వ్యంకూవర్) విశ్వ విద్యాలములో చేరాడు. అక్కడ అతను తన పరిశోధనను ప్రారంభించాడు. అటు పిమ్మట 1960 లో అమెరికా లోని విస్కాన్సిన్ విశ్వ విద్యాలయములో (మెడిసన్) ఆచార్యునిగా చేరాడు.1966 లో అమెరికన్ పౌరసత్వం పొందాడు. 1970లో ప్రతిష్ఠాత్మకమైన మశాచుసెట్స్ సాంకేతిక సంస్థలో రసాయన శాస్త్ర ఆచార్యునిగా చేరాడు. 2007లో పదవీ విరమణ చేశాడు. అప్పటి నుండి గౌరవ ఆచార్యునిగా పరిశోధనలు సాగించాడు.
జీవ శాస్త్రవేత్తలు ఎప్పటినుండో ఎదుర్కొంటున్న ప్రశ్న- ప్రయోగ శాలలో జీవాన్ని కృత్రిమంగా సృష్టించడం సాధ్యమేనా? ఈ దిశలో వంశ పారంపర్యముగా సంక్రమించు జీవ నిర్మాణానికి దోహదం చేసే ‘‘కృత్రిమ జీన్’’ను సృష్టించ గలిగాడు. ఈ ఆవిష్కరణ జెనెటిక్ ఇంజనీరింగ్ అనే నూతన శాస్త్ర అధ్యయనానికి దారి తీసింది. జన్యువులలోని కోడ్‌లను సమగ్రంగా వివరించ గలగడం తో, జన్యువులలో తగు విధంగా మార్పులు చేయటం, జీవరాశులలో జన్యు మార్పిడి విధానాల ద్వారా జన్యువులలో అవాంఛిత లక్షణాలు తొలగించటం, అవసరమైనచోట్ల జన్యు మార్పిడి చేయగలగటం వంటి ఎన్నో విధానాలు అమలులోకి వచ్చాయి. ఖొరానా చేసిన ఈ పరిశోధనల ఫలితంగా ఈ రంగం ‘బయో టెక్నాలజీ’ అనే ప్రత్యేకమైన శాస్త్ర విభాగంగా ఏర్పడిరది. ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమము మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందు పరచడి ఉన్నదని ఖొరానా కనుక్కొన్నాడు. వరుసగా ఉన్న కృత్రిమ జీన్ (డీఎన్‌ఏ ) ముక్కను ప్రయోగశాలలో మొదటిసారిగా సృష్టించాడు. డీ ఎన్ ఏ ముక్కలను అతికించు డీఎన్‌ఏ లిగసే అనబడు ఎంజైమును కనుగొన్నాడు. ఈ పరిశోధనల మూలముగా ఆధునిక జీవశాస్త్రములో ఒక విప్లవము వచ్చింది. 1968 లో వైద్య శాస్త్రములో నోబెల్ బహుమతి లభించింది. రాబర్ట్ హోలీ, మార్షల్ నైరెన్‌బర్గ్‌లతో కలిసి అందుకున్నాడు.
గైరిందర్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అవార్డు, లూయిసా స్థూల హోర్విత్జ్ బహుమతి, ప్రాథమిక మెడికల్ రీసెర్చ్ ఆల్బర్ట్ లస్కెర్ అవార్డు, విల్లార్డ్ గిబ్స్ అవార్డు, పద్మ విభూషణ్ అవార్డులను అందుకున్నాడు. 1968లో ఫిజియాలజీ/మెడిసిన్‌లో కణాల జన్యు సంకేతాన్ని కలిగి ఉన్న న్యూక్లియిక్ ఆమ్లాలలో న్యూక్లియోటైడ్ల క్రమం, కణాల ప్రోటీన్ల సంశ్లేషణను ఎలా నియంత్రిస్తుందో చూపించే పరిశోధన కోసం మార్షల్ డబ్ల్యూ. నైరెన్‌బర్గ్ మరియు రాబర్ట్ డబ్ల్యూ హోలీలతో కలిసి ఖోరానా నోబెల్ పురస్కారం పంచుకున్నాడు. నోబెల్ బహుమతి పొందిన తరువాత ఒక సందర్భంలో, డాక్టర్ ఖోరానా ఇలా వ్రాశాడు: ‘పేదవాడు అయినప్పటికీ, నా తండ్రి తన పిల్లలకు విద్యను అందించడానికి జీవితాన్ని అంకితమిచ్చాడు. సుమారు 100 మంది నివసించే గ్రామంలో ఏకైక అక్షరాస్యత కుటుంబం మేము.’ అర్ధ శతాబ్దానికి పైగా, డాక్టర్ ఖోరానా – వేలాది మంది విద్యార్థులకు శాస్త్రీయ విద్యను అందించడం ద్వారా, మానవ జ్ఞాన రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాడు. ఖొరానా నవంబర్ 9, 2011 న కంకార్డ్, మసాచుసెట్స్ లో 89వ ఏట సహజ మరణము చెందాడు.
-రామకిష్టయ్య సంగనభట్ల
9440595494





