కాలుష్యరహిత హోలీ రంగులు వాడుకుందాం !

(నేడు ‘హోలీ పర్వదినం’ సందర్భంగా..)
ప్రధానంగా ఇండియా, నేపాల్‌, బంగ్లాదేశ్‌ లాంటి దేశాలలో రంగుల హోలీ హిందూ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. నేడు ప్రపంచవ్యాప్త హిందూ సమాజం హోలీని విశ్వవ్యాప్తం చేశారు. ఈ పర్వదినాన్ని హిందువులతో పాటు సిక్కులు, జైనులు, నేవార్‌ భౌద్దమతస్తులు కూడా ఘనంగా జరుపుకుంటారు. పాల్గున మాస శుక్ల పక్షం పౌర్ణమి రోజున వసంత రుతువు ఆరంభంలో ‘వసంతోత్సవం’గా సంతోషంగా నిర్వహించుకునే ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ లవ్‌ అండ్‌ కలర్స్‌’నే హోలీగా జరుపుకుంటాం.
హోలీ పుట్టుక వెనుక చరిత్ర: తనే దేవుడినని, అందరు తనను ఆరాధించాలని ఆదేశించిన హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదు తన తండ్రిని కాకుండా విష్ణువును పూజించడం ప్రారంభిస్తాడు. హిరణ్య కశిపుడి సోదరి రాక్షసి హోలిక ప్రహ్లాదున్ని ఎత్తుకొని మంటలో వేసినపుడు విష్ణు లీలతో ప్రహ్లాదుడు మంటల నుంచి కాపాడబడతాడు. ప్రహ్లాదుడి భక్తికి మెచ్చిన విష్ణువు నరసింహుడి రూపంలో హిరణ్యకశిపుడిని హతమారుస్తాడు. ‘హోళికా దహన్‌ లేదా కామదహనం’కు గుర్తుగా హోలీ పర్వదినాన్ని జరుపుకుంటారని పురాణాల ఇతివృత్తం. హిందూ పురాణాల ప్రకారం ప్రపంచ రక్షణార్థం కామడు యోగనిద్రలో ఉన్న శివున్ని నిద్ర నుంచి లేపడం జరుగుతుంది.
హోలీ వేడుకలు:  హోలీ పర్వదినాన తొలి సంధ్య వేళన భోగి మంటల మీద హోళిక దిష్టి బొమ్మను దహనం చేస్తూ, మంట చుట్టు తిరిగి హుషారుగా నాట్యాలు చేస్తూ, చేడు మీద మంచికి జరిగిన విజయంగా రంగులు చల్లుకుంటూ అమితానందంగా హోలీ వేడుకలను నిర్వహిస్తారు. హోళికా దహన్‌, చోటి హోలీ, దులేటి, పగ్వా, డోల్‌ పూర్ణిమ, వసంతోత్సవ్‌ లాంటి పేర్లతో ప్రాంతాల వారిగా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. కృష్ణుడి సంబంధ మథుర, బృందావనం, నందగావ్‌, బర్సానా లాంటి ప్రదేశాలలో హోలీని ఘనంగా నిర్వహిస్తారు. హోలీ పండుగ రోజున పిల్లలు, యువతీయువకులు పెద్దలతో కలిసి సరదాగా ఒకరి మీద మరొకరు రంగులు వెదజల్లుకుంటూ ప్రేమలు, నవ్వులు పంచుకుంటారు.
నిమ్మ, బిల్వ, పసుపు కుంకుమలతో చేసిన పొడి రంగులు, రంగు నీళ్లు, వాటర్‌ గన్స్‌, బెలూన్స్‌, పేయింట్స్‌ చల్లుకోవడం అనాది వస్తున్న ఆచారం. ఈ వేడుకల్లో గులాల్‌ రంగులను ఇతరుల ముఖాలకు పూయడం, తీపి పదార్థాలు తినడం, మత్తు ద్రవాలు తాగడం, సామూహిక నాట్యాలు చేయడం లాంటివి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. హోళీ మరునాడు తలస్నానానికి ముగించుకొని బంధుమిత్రులతో సరదాగా గడపడం, మిఠాయులు పంచుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. హోళీ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యత, క్షమాగుణం లాంటి విశిష్ట లక్షణాలను పెంపొందిస్తుందని నమ్మకం. ఉత్తర భారతంలో పెద్ద ఎత్తున జరిగే హోలీ వేడుకలను తెలుగు రాష్ట్రాల పట్టణాల్లో అధికంగా, పల్లెల్లో స్వల్ప స్థాయిలో హోలీ పండుగ జరుపుకుంటారు.
రసాయన రంగులు ప్రమాదకరం: ఆధునిక కాలంలో హోలీ రోజున లెడ్‌ ఆక్సైడ్‌, అల్యుమీనియం బ్రోమైడ్‌, మెర్కూరీ సల్ఫైట్‌, ఫ్రూసియన్‌ బ్లూ,  కాపర్‌ సల్ఫేట్‌ లాంటి పలు ప్రమాదకర రసాయన రంగులను వాడడంతో క్యాన్సర్‌, చర్మవ్యాధులు, నేత్ర ఎలర్జీ, అస్తమా, శరీర వివర్ణం, సాధారణ వ్యాధులు కలుగుతున్నాయి. హోలీ రంగు తయారీలో క్రోమియం, కాడ్మియం, నికెల్‌, కాపర్‌, మెర్కూరీ, జింక్‌, ఐరన్‌, సిలికా, ఆజ్బెస్టాస్‌ లాంటి రసాయన ఘటకాలు వాడతారు. వీటి వల్ల పలు రకాలైన శ్వాసకోశ, లివర్‌, కిడ్నీ, న్యుమోనియా, ఎముకల జబ్బు, నాజీ మండల, గర్భంలో శిశు లోపం లాంటి అనారోగ్యాలు కలుగుతాయి. సాధారణ పసుపు, కుంకుమ, నిమ్మ, గులాల్‌ లాంటి రంగులను నీటిలో కలుపుకొన హోలీ పండుగను జోరుగా, హుషారుగా, ఆరోగ్యంగా, సామూహికంగా జరుపుకుందాం. చెడును మంటలకు అర్పించి మంచిని మనసులలో నింపుకుందాం.
 –డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
కరీంనగర్‌, 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *