స్వరాష్ట్ర తెలంగాణ సిద్ధించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడిగుపెడుతున్న తెలంగాణ ప్రజలకు, అలుపెరుగని పోరాట ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తెలంగాణ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటోందని ఎందరో పిచ్చి కూతలు కూసినారు తెలంగాణలో కరెంట్ ఉత్పత్తి తక్కువ కావడంతో కరెంట్ సమస్య నుంచి అనేక రకాల సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతారని కరెంటు సరియైన సరఫరా ఉండక ప్రజలు తిరగబడతారని నక్క ఎదురు చూసినట్టు ఎదురు చూసినారు. కానీ తెలంగాణ ఏర్పడిన వెంటనే అపర భగీరథుని ముందు చూపుతో 24 గంటలు నాణ్యమైన కరెంటు కనురెప్పలు కొట్టినంత సేపు కూడా పోకుండా నిరంతరాయంగా పరిశ్రమలకు, గృహ అవసరాలకు, ఇతర పరిశ్రమలకు సరఫరా జరుగుతున్నది. ఇది తెలంగాణ సాధించిన మొట్ట మొదటి ఘనత. చిత్తశుద్ధి ఉంటే ఏ పనైనా చేయవచ్చునని దానికి తెలంగాణ దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నది. తొమ్మిదేళ్లలో తెలంగాణ అద్భుతంగా పురోగమించింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికల్లో తెలంగాణ అభివృద్ధి స్వరూపం కళ్లకు కట్టినట్టు విశదపరిచినది.
ధాన్యం ఉత్పత్తి అధిక రెట్లు పెరగింది. అంటే సాగునీటి లభ్యత పెరిగిందని అర్థం. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి కార్యాచరణతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీడీపీలతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, నీటి పారుదల రంగాల్లో తెలంగాణ దేశ సగటుతో పోలిస్తే మెరుగైన అభివృద్ది చెందినది. తెలంగాణ అభివృద్ధిని కొరోనా కూడా నిరోధించలేకపోయినది. కొరోనా కారణంగా దేశ జీడీపీ 3 శాతం తగ్గగా తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2.4 శాతం పెరిగింది. విద్యుత్, మౌలిక సదుపాయాలు, ఐటీ రంగంలో పెట్టుబడులు పెరగడంతో ఇతర రంగాల్లోనూ మంచి అభివృద్ధి నమోదు అయింది. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు జరిగినవి. ప్రస్తుతం తెలంగాణ అద్భుత ప్రగతి సాదిస్తుందని దానికి అభివృద్ధే సూచికలే నిదర్శనం.
అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసింది మన ప్రభుత్వం. ఒకప్పుడు కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణ నేడు దేశపు ధాన్యాగారంగా మారింది. తాగు నీరు సమస్య తెలంగాణలో ఇక కనపడదు. నల్లగొండ ఫ్లోరోసిస్ సమస్యలు తీరిపోయింది. పుట్టినప్పటి నుంచి జీవితాంతం మనిషి అవసరాలకు ప్రభుత్వపరంగా తోడ్పాటు అందించాలనేది పట్టు వదలని విక్రమార్కుడైన కేసీఆర్ ఆలోచన. మొత్తం 33 జిల్లాలతో పాలన ప్రజల వద్దకు వచ్చింది. భూ రికార్డుల ప్రక్షాళన వల్ల వివాదాలు తగ్గిపోయి, భూములకు భద్రత లభిస్తున్నది. విద్య, వైద్యం, పర్యావరణం వంటి ఏ రంగంలోనైనా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది ఎండాకాలంలో కూడా చెరువులో మత్తడి దుంకుతున్నవి అలుగులు పారుతున్నవి. భూగర్భ జలాలు పెరిగి నీరు పైకి ఉబికి వస్తున్నది. తెలంగాణ రాకముందు ఎక్కడ చూసినా చెలుకలు పల్లేరు కాయలతో నెర్రెలతో భూమి పడావుగా థార్ ఎడారి మాదిరిగా ఉండేది. సరియైన రోడ్డు సౌకర్యాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రామాల నుండి మండలానికి డబల్ రోడ్డు మండలం నుండి జిల్లా కేంద్రానికి నాలుగు వరసల నల్లటి నున్నటి రోడ్లతో రవాణా అత్యంత సక్రమంగా సమయానికి అనుకూలంగా జరుగుతున్నది. బస్తీ దవఖానలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఉన్నత స్థాయికి పెంచడం, ఉచితంగా ల్యాబ్ టెస్టులు, డయాగ్నిక్ సెంటర్లు ఏర్పాటుతో ప్రజల ఆరోగ్యం మెరుగుపడి కార్పొరేట్ దవఖానాల దోపిడి నుండి విముక్తి చెందుతున్నారు.
కమాండ్ కంట్రోల్ ఏర్పాటుతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా శాంతిభద్రతలు అదుపులో ఉంటున్నవి. హరితహారం ద్వారా రోడ్ల వెంబడి చెట్లు నాటడం వలన చల్లటి వాతావరణం లో ఆకుపచ్చని చెట్ల మధ్య ప్రయాణం అత్యంత ఆహ్లాదంగా కొనసాగుతున్నది. గుట్టలపై ఇతర స్థలాలలో చెట్లు విస్తృతంగా నాటడం వలన అటవీ సంపద గణనీయంగా పెరుగుతున్నది తద్వారా వాతావరణం సమతుల్యం జరుగుతుంది జంతువులు జనారణ్యం లోకి రాకుండా నిరోధించడానికి ఉపయోగపడుతున్నది. ఒకప్పుడు ఎండిన చెట్లతో ముళ్ల కంపలతో అతి దారుణంగా ఉండేది కానీ నేడు ఆకుపచ్చని తెలంగాణగా విరాజిల్లుతున్నది. పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు ఆట స్థలాలు, మురికి కాలువలు చెత్త తీసుకపోవడానికి ట్రాక్టర్లు, వైకుంఠధామాలు ఏర్పాటు చేయబడినవి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వివిధ ప్రాంతాలలో ఫ్లైఓవర్లు అండర్ పాసులు ఏర్పాటు చేయడం వలన హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందనటంలో సందేహం లేదు. అత్యంత మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ, సిమెంట్ రోడ్లు పలు కాలనీలలో ఇప్పుడు దర్శనం ఇస్తున్నాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుబంధు ద్వారా ప్రజలకు అన్నం పెడుతున్న రైతులను ఆదుకుంటున్న మహనీయుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. దళిత బంధు , ఇతర పథకాల ద్వారా ఇతర కులస్థులను కూడా అక్కున చేర్చుకుని వారి జీవన గమనానికి పూల బాటలు వేస్తున్నాడు. రాష్ట్రంలోని అన్ని మతాలు కులాల అణగారిన వర్గాలైన వయోవృద్ధులు ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆసరా పథకాల ద్వారా చేయూతనందిస్తున్నది మన తెలంగాణ ప్రభుత్వం. అన్ని కులాలు మతాల వారికి ఆత్మగౌరవ భవనాలు హైదరాబాదులో నిర్మాణం చేసినారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంగా బతకటానికి ఈ కార్యక్రమాలు ఒక నిదర్శనంగా ఉంటున్నవని చెప్పవచ్చు.
మన తెలంగాణలో గోదావరి నది బాసర వద్ద మొదలై భద్రాచలం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అడిగిడుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో గోదావరి నదిపై కేవలం మూడు నాలుగు రోడ్డు వంతెనలు ఉండేవి. గోదావరి నదిపై అనేక చోట్ల వంతెనలు నిర్మించాలని ఎన్నిసార్లు మొత్తుకున్న మొరపెట్టుకున్నా అప్పటి పాలకులు నిర్మాణం చేయలేదు. ఇందుకు ఉదాహరణంగా గోదావరిఖని మంచిర్యాల మధ్య నిర్మించబడిన వంతెన దాదాపు 18 సంవత్సరాలు నిర్మాణం చేసినారు . ఇంతేకాక ఇతర నదులు వాగులు వంకలపై కూడా నిర్మాణం చేయుటకు శ్రద్ధ కనబరిచే వారు కాదు. కానీ ఇప్పుడు అవసరమైన ప్రతి చోట అనుకున్న వెంటనే అవసరమైన ప్రదేశాలలో గోదావరి నదిపై వంతెనలు , ఇతర అవసరమైన వాగులు వంకలపై నిర్మాణం జరిగినవి తత్పఫలితంగా వాణిజ్య వాహనాలు మరియు ప్రయాణికుల రవాణా వ్యవస్థ అద్భుతంగా కొనసాగుతున్నది.
రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రైల్వే లైను మనోహరాబాద్ కొత్తపల్లి (కరీంనగర్) మధ్య కెసిఆర్ దృఢ సంకల్పంతో నిర్మాణం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగముతో జరుగుతున్నది. తెలంగాణ స్వరాష్ట్రాంగా ఏర్పడిన తర్వాత అనూహ్యమైన ప్రగతిని సాధించింది. 2015 -16 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక వృద్ధి రేటు 11 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అంటే ఉమ్మడిగా ఉన్న ఆ ఆర్థిక సంవత్సరం మినహా మిగిలిన ఆర్థిక సంవత్సారాల్లో ఆర్థిక వృద్ధి 11 శాతానికి పైగా ఉంది. రాష్ట్రం విడిపోక ముందే తెలంగాణలో తొమ్మిది శాతాని కంటే తక్కువగానే వృద్ధి రేటు ఉండేదని లెక్కలు చెబుతున్నాయి. అంతే కాకుండా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని నీతిఆయోగ్ విశదపరిచినది. జీఎస్డీపీ పరంగా ఏడో పెద్ద రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. పారిశ్రామిక రంగం ఫార్మా, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ భారీగా జీఎస్డీపీని అందిస్తున్నాయి. అదే సమయంలో వస్త్ర పరిశ్రమ లెదర్, ఫుడ్ ప్రాసెసింగ్, మినరల్స్ వంటి సంప్రదాయ రంగాలు కూడా మంచి ప్రతిభను కనబరుస్తున్నాయని నీతి ఆయోగ్ తన నివేదికలో తెలిపింది ఇక ఫార్మా రంగంలో తెలంగాణ కేంద్ర బిందువుగా ఎదిగింది. దేశం ఫార్మా ఎగుమతుల్లో హైదరాబాద్ వాటా 20 శాతంగా ఉంది. తెలంగాణలో మౌలిక సదుపాయాలు కూడా ఎక్కువగా ఉన్నాయని సాధారణ టూరిజంతో పాటు మెడికల్ టూరిజం కూడా హైదారబాద్‌లో భారీగా వృద్ధి చెందుతోందని ప్రకటించారు. ఐటీ రంగంలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నది. హైదరాబాదులో ఐటీ కంపెనీల స్థాపనకు ప్రపంచంలో పేరెన్నికగన్న అత్యుత్తమైనవి నెలకొల్పడం జరుగుతున్నది. మన రాష్ట్రంలో జీఎస్డీపీ రెట్టింపు అయింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తెలంగాణ 18.5 శాతం అద్భుత ప్రగతి సాధిస్తోంది. జాతీయ స్థాయిలో ఇది 6.6శాతం మాత్రమే ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి జీఎస్డీపీ 93.8 శాతం పెరిగింది. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానం. రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతం ఉండగా ఏడేళ్లలో ఇది 5 శాతానికి పెరిగింది. తలసరి ఆదాయంలో తెలంగాణలో దేశంలోనే ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు పదకొండో స్థానంలో ఉండేది. ప్రపంచంలోని అన్ని మతాల ప్రాంతాల వారిని ఆప్యాయతతో అనురాగంతో ఆదరిస్తున్న ప్రాంతం ప్రకృతితో మిలితమైన తెలంగాణ గడ్డ అని సగర్వ పడుతున్నాను.ఒక్క మాటలో చెప్పాలంటే తొమ్మిది ఏళ్ల స్వపరిపాలన తో రొమ్ము విరిచి ఇది నా తెలంగాణ అని సగర్వంగా నొక్కి వక్కాణించవచ్చు.
దండంరాజు రాంచందర్ రావు, రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్, సింగరేణిభవన్ హైదరాబాద్
98495929583




