ఆనాడు మేడిగడ్డకు రానన్నారు కదా..

  • ఇప్పుడెందుకు వెళుతున్నారు
  • బొందలగడ్డతో పోల్చింది విూ నాయనే కదా
  • కెటిఆర్‌కు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి చురకలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : ఆనాడు మేడిగడ్డకు రానన్న వారు ఇప్పుడు ఎందుకు వెళుతున్నారని బిఆర్‌ఎస్‌ నేతలను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి  నిలదీసారు. మేడిగడ్డనా..బొందలగడ్డనా..ఏం పీకడానికి మేడిగడ్డకు పోతున్నారు..అని కేసీఆర్‌ మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌పై  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా పని చేసిన ఓ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం సమంజసమేనా..అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్ల కేసీఆర్‌కే అంత కోసం వొస్తే.. యంగ్‌ డైనమిక్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి, భట్టి విక్రమార్కకు ఆవేశం రాదా..అంటూ ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ చేసిన అవినీతిని బయటపెట్టడానికే తాము మేడిగడ్డకు వెళ్లామని ఉద్ఘాటించారు. కేటీఆర్‌..విూ నాన్నకు అలా మాట్లాడ కూడదని బుద్ది చెపమంటూ జగ్గారెడ్డి సూచించారు. అలాగే.. మేడిగడ్డని బొందలగడ్డతో పోల్చకూడదని విూ మేనమామ అయిన కేసీఆర్‌కు చెప్పు అని హరీష్‌ రావుకి చెప్పారు. మేడిగడ్డను బొందలగడ్డతో పోల్చిన కేసీఆర్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

క్షమాపణలు చెప్పేదాకా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావులను వదిలేదే లేదన్నారు. ప్రభుత్వం మేడిగడ్డకు రమ్మన్నప్పుడు కేసీఆర్‌ ఎందుకు రాలేదన్న ఆయన.. ఇప్పుడు విూరు రమ్మంటే మేమెందుకు వొస్తామని కౌంటర్‌ ఇచ్చారు. కడియం శ్రీహరి గురించి మాట్లాడి టైమ్‌ వృథా అంటూ..బాల్క సుమన్‌ ఒక బచ్చా అని సెటైర్లు వేశారు. ఇక ఈ ప్రపంచంలో ప్రజలెవ్వరూ దేవుడిని మొక్కడం లేదు, మేము మాత్రమే మొక్కుతున్నామన్నట్లుగా ఉంది బండి సంజయ్‌ వ్యవహారమని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. శ్రీరాముడు బీజేపీలో కొంతమందికే దేవుడా..అంటూ ప్రశ్నించారు. శ్రీ రాముడు తన తల్లిని గౌరవించే మహానుభావుడని, తల్లి మాటలు కాదనకుండా వనవాసానికి పోయిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. కానీ.. బండి సంజయ్‌లో రాముడి విలువలు ఏమాత్రం లేవని తూర్పారపట్టారు. పొన్నం ప్రభాకర్‌  తల్లిపై కామెంట్‌ చేసి.. శ్రీరాముడికున్న విలువల్ని బండి సంజయ్‌ తగ్గించారని విమర్శించారు. బేషరతుగా పొన్నం ప్రభాకర్‌కు క్షమాపణలు చెప్పాలన్నారు. మీ అమ్మను ఒక మాట అంటే.. మీకు కోపం రాదా బండి సంజయ్‌..అంటూ ప్రశ్నించారు. వోట్ల కోసమే రాముడిని వాడుకుంటున్నారని, రాముడికున్న గొప్ప చరిత్రను దిగజారుస్తున్నారని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *