– ఆ విషాదాలకు అడ్డుకట్ట వేసేందుకే ‘అరైవ్ అలైవ్’
– సీఎం ఆదేశాలతో అమలు
– డిజిపి శివధర్ రెడ్డి
– నాల్గవ రోజు కార్యక్రమంలో కదం తొక్కిన పోలీస్ యంత్రాంగం
– రోడ్డు భద్రతపై విద్యార్థుల, యువకుల ప్రతిజ్ఞ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: క్షణకాలపు నిర్లక్ష్యం.. ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాక ఆ కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేస్తుంది.. ఇలాంటి విషాదాలకు అడ్డుకట్ట వేయాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంకల్పంతోనే ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో అరైవ్ అలైవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని బి.శివధర్ రెడ్డి తెలిపారు. రోడ్డు భద్రతా కార్యక్రమం అరైవ్ అలైవ్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జిల్లా ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో గురువారం జరిగిన భారీ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం బాలానగర్ మండలం పెద్దాయపల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ‘బ్లాక్ స్పాట’గా గుర్తించిన కూడలి వద్దకు చేరుకున్న డీజీపీ, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక చంద్ర గార్డెన్‌లో సుమారు 3000 మంది విద్యార్థులు, డ్రైవర్లు, ప్రజలతో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ. అతివేగం, నిర్లక్ష్యపు ఓవర్‌టేకింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ప్రజలు తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన యువకులు ఎందరో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఏటా జరిగే హత్యలకన్నా 9, 10 రెట్ల అధికంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడంతో ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. పరిస్థితి తీవ్రతను గమనించి 99 రోజుల ప్రభుత్వ కార్యక్రమమైన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారన్నారు. ఈ సందర్భంగా జడ్చర్ల మెడికల్ అసోసియేషన్ సమకూర్చిన ప్రథమ చికిత్స కిట్లను ఆటో డ్రైవర్లకు అందజేశారు. ఉచిత కంటి పరీక్షలు, కళ్లద్దాలు, డ్రైవింగ్ లైసెన్సుల పంపిణీ స్టాల్స్‌ను ప్రారంభించడంతోపాటు ‘అరైవ్ అలైవ’ లోగోతో కూడిన రేడియం స్టిక్కర్లు, కరదీపికలను ఆవిష్కరించారు. ఈ వినూత్న కార్యక్రమాల ఫలితంగా జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ నాటికి రోడ్డు ప్రమాదాలు 20 శాతం మేర తగ్గాయని ఎస్పీ జానకి వివరించారు. ఈ సదస్సులో రోడ్డు ప్రమాదాల్లో ఆప్తులను కోల్పోయిన బాధితులు తమ ఆవేదనను పంచుకోగా, ఒక చిన్నారి ఇచ్చిన సందేశం సభికులను కదిలించింది. డీఐజీ ఎల్.ఎస్.చౌహన్, జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, డీటీసీ వాణి, ఆర్టీసీ ఆరఎం సంతోష్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి సూచనతో రాష్ట్రవ్యాప్తంగా నాల్గవ రోజు గురువారం పోలీస్ యంత్రాంగం కదం తొక్కింది. కరీంనగర్, వరంగల్ కమీషనరేట్ల పరిధిలో జరిగిన సదస్సుల్లో సీఐడీ అదనపు డీజీపీ¾ చారు సిన్హా పాల్గొన్నారు. కరీంనగర్‌లో సీపీ గౌష్ ఆలం ఆధ్వర్యంలో మెడికవర్ వైద్యులచే విద్యార్థులకు సీపీఆర్ డెమో ఇప్పించి హెల్మెట్లు పంపిణీ చేశారు. నర్సంపేటలో డ్రైవర్లకు కళ్లద్దాలు అందజేశారు. ఆదిలాబాద్ రిమ్స్‌లో అదనపు డీజీపీ డాక్టర్ అనిల్ కుమార్, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో 250మంది వైద్య విద్యార్థులతో సదస్సు జరిగింది. గుడిహత్నూర్ వద్ద ప్రమాదానికి గురైన కారును ప్రజల ప్రదర్శనకు ఉంచి లారీలకు రేడియం స్టిక్కర్లు అతికించారు. వాక్సెన్ యూనివర్సిటీ (సంగారెడ్డి)లో జరిగిన సదస్సుకు శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేష్ ఎం భగవత్, ఎస్పీ పరితోష్ పంకజ్ విద్యార్థులు రూపొందించిన ‘స్మార్ట్ హెల్మెట’ను అభినందించారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్, సిద్దిపేటలో అదనపు డీజీపీ స్వాతి లక్రా కంటి వైద్య శిబిరాలను పర్యవేక్షించారు.
హెల్మెట్ లేదు – ప్రవేశం లేదు – గ్రామ పంచాయతీ తీర్మానం
నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామ పంచాయతీ ‘హెల్మెట్ లేదు – ప్రవేశం లేదు’ అనే విశేషమైన తీర్మానం చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ వంద హెల్మెట్లు పంపిణీ చేశారు. నిజామాబాద్‌లో సీపీ సాయి చైతన్య డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ ‘గోల్డెన్ అవర’లో బాధితులను హాస్పిటల్‌కు చేర్చిన వారికి ప్రభుత్వం రూ.25,000 నగదు బహుమతి ఇస్తుందని ప్రకటించారు. నిర్మల్ జిల్లాలో ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల నాల్గవ రోజును ‘సోషల్ మీడియా డే’గా నిర్వహించి ఆన్‌లైన్ వేదికగా డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై విస్తృత ప్రచారం కల్పించారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట్‌లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సర్పంచులతో సమావేశం నిర్వహించారు. జోగులాంబ గద్వాలలో ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేక ప్రచార రథాన్ని ప్రారంభించారు. కుమరం భీమ్ ఆసిఫాబాద్‌లో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసుకు వచ్చే వారికి హెల్మెట్ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మునగాలలో కలెక్టర్, ఎస్పీలు పాఠశాల విద్యార్థులకు హెల్మెట్లు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. కోదాడలో ఏకంగా ట్రాఫిక్ పోలీసులే రోడ్డు మరమ్మతులు చేపట్టారు.
మెగా వైద్య శిబిరాలు
రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాలకు వాహనాలు నడిపే డ్రైవర్ల కంటిచూపు సమస్యల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తిస్తూ పలు జిల్లాల్లో మెగా వైద్య శిబిరాలు నిర్వహించారు. మహబూబాబాద్‌లో రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీపీ కె.రమేష్ నాయుడు, ఎస్పీ ఆధ్వర్యంలో ఏకంగా 800మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. మెదక్‌లో కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కంటి పరీక్షలతోపాటు బ్లూ కోల్ట్ సిబ్బందికి సీపీఆర్ శిక్షణ ఇప్పించారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఎస్పీ రోహిత్ రాజు (ఇల్లందు సదస్సులో), నారాయణపేటలో ఎస్పీ డాక్టర్ వినీత్ వందలాదిమంది లారీ, ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయించి ఉచితంగా కళ్లద్దాలు, మందులు పంపిణీ చేశారు. ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రైవర్ యూనియన్లకు అవగాహన కల్పించి ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, యువత పాల్గొని రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





