– కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి
– సమర్థమైన నాయకత్వ తయారీకి యోచన
– కాంగ్రెస్‌లో నూతనోత్సాహానికి పాలకుల చర్యలు
– జాప్యం చేయొద్దన్న నిర్ణయంలో సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొనే సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నది. అందులో భాగంగా కేబినెట్ విస్తరణ, జిల్లాస్థాయి కమిటీలు, నామినేటెడ్ పోస్టుల ఏర్పాటుపై దృష్టిపెట్టింది. కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనికి కారణాలు ఎన్నో. ప్రధానంగా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న అపవాదనను పాలకులు మూటకట్టుకున్నారు. ఆ ఆరోపణతోనే సీనియర్లు పార్టీని వీడిపోతుండడంపై పార్టీ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల కాలం గడిచింది. మిగిలిన రెండున్నరేళ్లలో చివరి సంవత్సరమంతా రాబోయే ఎన్నికల హడావుడే ఉంటుంది. రేవంత్‌రెడ్డి, హైకమాండ్ పార్టీ నాయకుల కోసం ఏమన్నా చేయాలనుకుంటే ఏడాది లేదా ఏడాదిన్నర కాలం మాత్రమే మిగిలింది. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయం గత ఏడాదికాలంగా నలుగుతున్నది. ఇగో అగో అని అనేక గడువులు పెట్టారు. ద్వితీయ శ్రేణి నాయకులు ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం విదితమే. ఇది పార్టీ అంతర్గత క్రమశిక్షణపై ప్రభావం చూపుతూ వచ్చింది. ఇది పార్టీ ఫిరాయింపులకు దారితీసే ప్రమాదాన్ని అధిష్టానం గుర్తించింది. పార్టీలో ఇప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్న వారిని అనునయించేందుకు ఈ మధ్య కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధినాయకత్వం సమాలోచన చేస్తున్నది. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అసంతృప్తి నాయకులను అనునయించడంతోపాటు పార్టీ బలోపేతానికి కృషిచేయడం, ప్రభుత్వ పథకాల సమన్వయం, చివరగా నామినేటెడ్ పోస్టుల భర్తీ అన్నవి ప్రధానమైనవి. అయితే మిగతావాటి విషయమెలా ఉన్నా నామినేటెడ్ పోస్టుల విషయంపైనే ఎక్కువసేపు చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. ఎంతోకాలంగా పార్టీ జెండా మోస్తూ, కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ద్వితీయస్థాయి నాయకులను సంతృప్తిపరిస్తే తప్ప పార్టీ బలోపేతం కాదన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే ఈ పోస్టుల భర్తీ విషయంలో ఇక ఎంతమాత్రం జాప్యం చేయవద్దన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. సామాజిక సమీకరణలు, ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పదవుల పందేరం చేయాలని ముఖ్యమంత్రి సూచనగా తెలుస్తున్నది. పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు, దాదాపు 40కి పైగా కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పోస్టుల కోసం చాలాకాలంగా నాయకులు ఎదురు చూస్తున్నారు. అయితే వారిలో ఎంతమందికి పదవులు దక్కుతాయోగాని గత అసెంబ్లీతోపాటు, ఇతర హోదాల కోసం పోటీపడి నిరాశకు గురైనవారికి ఈసారి ప్రాధాన్యత కల్పించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ఇదిలాఉంటే ఈసారి కుల కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నందున ప్రభుత్వ పథకాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయగలిగి, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే సమర్థ నాయకులతో కూడిన జాబితాను సిద్దం చేయాల్సిందిగా తనతో సమావేశమైన ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్లకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించినట్లు తెలుస్తున్నది. ఇదిలాఉంటే ఈసారి మంత్రివర్గంలో కూడా మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలున్నాయన్న వార్తలు వస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఈసారి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ప్రభుత్వ సలహాదారు విషయం కూడా ఆలోచనలో ఉంది. మాజీ మంత్రి, స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ప్రభుత్వ సలహాదారుగా తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్నట్లు లీకులు వస్తున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





