అబద్దం అంటే నిజం తెలియనంత వరకు
అందలమెక్కేది
అబద్దానికి అందమైన మేలిమి పూతల
జిలిబిలి అల్లికలు
అబద్ధాన్ని కప్పిపుచ్చేది మరో అబద్దమే
నిజ అద్దపు బోను లో అబద్దం ముద్దాయి
ఆరిపోయే దీపం లెక్క అబద్దానికి
అందలం ఎక్కువ!
అబద్దానికి ఆత్రం ఎక్కువ
నిజం నిద్ర లేచేసరికే
అబద్దం గడప దాటి పోతుంది
అబద్దం నిన్ను రక్షించే
కవచకుండలమేమి కాదు
అబద్దం ఊడిపోయే ఉల్లి పొర!
అబద్ధాన్ని నివద్దె గా చెప్పడం
కొందరికే సాధ్యం
అబద్దమాడితే అతికినట్లు ఉండాలి
ప్రాణ విత్త మాన భంగమందు
బొంకిన పాపమంటదు
చిన్ని కన్నయ్యల అబద్దం అది వేరు లే
ధర్మాన్ని రక్షించడానికి ధర్మరాజు
“అశ్వత్థామ హతః కుంజరః”అన్నది సత్యం
పేర్లు మార్చుకొని పాండవులు
అజ్ఞాత వాసం చేసింది నిజం!
వివేకానందుడు తినకున్నా తిన్నానని
అబద్దం చెప్పి మిత్రులకు పెట్టీంది నిజం
థామస్ అల్వా ఎడిసన్ తల్లి
నాన్సీ కప్పి పుచ్చిన నిజం ప్రపంచానికి
బల్బు రూపంలో వెలుగు నింపింది
తెలియక ఆడిన అబద్దం పశ్చాత్తాపపడిన
గాంధీ ని ఆదర్శ వాదిగా మార్చింది
కరువుమంటే కప్పకు కోపం
విడువుమంటే పాముకు కోపం
“చూసే కన్నులు చెప్పలేవు
చెప్పే నోరు వినలేదు
వినే చెవులు చూడలేవు”
సంకట, సందిగ్ధ సమయాలలో
నిజం చెబితే నిష్టూరమే!
అబద్దం ఆడనివారు హరిశ్చంద్రుడు తప్ప
బహుశా వుండరేమో!
అబద్దం – నిజం మాటలతో ప్రతిచోట
అవని లో బ్రతుకులు గడుపులాట
– పి.బక్కారెడ్డి
అబద్దం
9705315250




