- పళనిస్వామి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక
- ద్వంద్వ పదవుల విధానం రద్దు చేస్తూ తీర్మానం
చెన్నై, జూలై 11 : అన్నాడీఎంకేలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. రెండు వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. పార్టీ పగ్గాలు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి చేతికి వచ్చాయి. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పళని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీని తన నియంత్రణలోకి తీసుకొన్న కొద్దిసేపటికే ప్రత్యర్థి నేత ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్)పై ఈపీఎస్ చర్యలు తీసుకొన్నారు. ఆయనను కోశాధికారి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఆయనతో పాటు ఓపీఎస్ మద్దతుదారులను కూడా పార్టీ నుంచి తొలగించారు. అన్నాడీఎంకేలో ఏక నాయకత్వ వ్యవహారంపై పళని, పన్నీర్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పళని నేతత్వంలో సర్వసభ్య సమావేశంపై నిషేధం విధించాలని పన్నీర్ సెల్వం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన కాసేపటికే.. పళని నేతత్వంలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఈపీఎస్ వర్గం తీసుకొచ్చిన 16 తీర్మానాలకు ఆమోదముద్ర వేసింది. పళనిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించే తీర్మానాన్ని కూడా ఆమోదించారు. ఈ సందర్భంగా.. ఓపీఎస్, అతడి మద్దతుదారులను పార్టీ నుంచి తొలగించేందుకు తీసుకొచ్చిన ప్రత్యేక తీర్మానానికి కూడా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు అన్నాడీఎంకే వెల్లడించింది.
పార్టీ నిర్ణయంపై పన్నీర్ సెల్వం తీవ్రంగా స్పందించారు. తాను 1.5కోట్ల మంది పార్టీ కార్యకర్తల చేత అన్నాడీఎంకే కో ఆర్డినేటర్‌గా ఎన్నికయ్యాయని తెలిపారు. తనను పార్టీ నుంచి బహిష్కరించే హక్కు పళనిస్వామికి లేదన్నారు. ఈపీఎస్‌నే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై తాను కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు. అన్నాడిఎంకెలో ఆధిప్యతం కోసం జరుగుతున్న పోరాటంలో అన్నాడిఎంకె నేత ఓ పన్నీర్ సెల్వానికి మద్రాస్ హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. భవిష్యత్ నాయకత్వాన్ని నిర్ణయించే కీలకమైన జనరల్ కౌన్సిల్ సమావేశానికి మద్రాస్ హైకోర్టు సోమవారం అనుమతినిచ్చింది. అన్నాడిఎంకెలో మరో వర్గం, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ఏర్పాటు చేసిన సమావేశంపై స్టే విధించాలని కోరుతూ పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. సోమవారం ఆ సమావేశం 9.15 నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. 9 గంటలకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చట్టానికి లోబడి సభను నిర్వహించవచ్చునని తెలిపింది. తీర్పు అనంతరం సమావేశం ప్రారంభమైంది. సోమవారం ఉదయం 2500 మందితో జనరల్ కౌన్సిల్ సమావేశం జరగ్గా అన్నాడిఎంకెలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ.. ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరించడానికి తీర్మానాన్ని ఆమోదించింది.
తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనీస్వామి నియమితులయ్యారు. ఇదిలావుంటే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి నియామకం చెల్లదని అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ అన్నారు. పార్టీ కేడర్ ద్వారా ఎంపిక చేయబడిన వ్యక్తి మాత్రమే జనరల్ సెక్రటరీగా ఉంటారని చెప్పారు. డీఎంకేలో వారసత్వ పోరు నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీని స్థాపించారని చెప్పారు. ఇదే పరిస్థితి ఎంజీఆర్ స్థాపించిన పార్టీలో రాకూడదన్నారు. పార్టీ జనరల్ సెక్రటరీని కిందిస్థాయి కార్యకర్తలే ఎన్నుకోవాల్సిన పరిస్థితిని ఎంజీఆర్ కల్పించారని..కానీ ప్రస్తుతం అన్నాడీఎంకేలో ఆ పనిచేయడం లేదన్నారు. అన్నాడీఎంకేలో ఉన్న ప్రస్తుత నాయకులు స్వార్థంతో వ్యవహరిస్తున్నారని శశికళ మండిపడ్డారు. సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని రద్దు చేశారని చెప్పారు. ఈ క్లిష్టపరిస్థితుల్లో..అన్నాడీఎంకే కార్యకర్తలందరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పేర్కొన్నారు. నాయకత్వ పదవిని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తే అది ఎప్పటికీ నిలవదన్నారు. డబ్బు ద్వారా పొందే ఏ స్థానమూ శాశ్వతం కాదని చెప్పారు. అది చట్టబద్ధంగా కూడా చెల్లదని శశికళ వ్యాఖ్యానించారు.




