అం‌తరంగ భావ సముద్రం…

అనుభూతితో పరవశించే ఆత్మ ఉంటే కవిత్వం ప్రవాహమవుతుంది. మంద్రంగానో, దీర్ఘ శ్రుతిలోనేదో కవిలో నిరంతర భావ ఘంటిక మ్రోగుతూనే ఉంటుంది. కళ్లనిండా నీలాకాశాన్ని నింపుకుని ప్రకృతి దృశ్య సంయోగాన్ని విచ్చుకున్న పుస్తకంలా మార్చి ప్రగాఢ నీలిమలకు సమున్నత భావాలను అద్ది గగన హృదయంతో ఆవిష్కరించిన కవిత్వం అందించే ఆత్మానుభూతి శాశ్వతంగా నిలుస్తుంది. పసితనాన్ని పసిగట్టే స్పర్మలా, అలలపై కలల తీగల్లా నక్షత్రాలతో శోభిల్లే ఆకాశ పందిరిలా, జ్ఞాపకాలలో అందంగా విచ్చుకునే నెమలికన్నులా, పండిన పొలాల్లో ఎండకు ఎగిసిపడే బంగారు కాంతిలా, వర్ణనిశిలో వేకువను వెతికే ఆశలా, శ్రావణ మేఘంలా, ప్రకృతిని చుట్టేసిన పచ్చదనంలా కవిత్వం స్నేహ హస్త్రాన్ని అందించడం అపురూపంగా తోస్తుంది. హృదయానికి హత్తుకునే ఆనంద స్ఫురణగా, స్వరధునిగా, లోతైన ఆలోచనల చిత్రదృశ్య కవిత్వ సంగమమై నిశ్శబ్దలయగా ముందుకొచ్చారు శిరీష శ్రీభాష్యం. ఊపిరినిచ్చే గాలి, చల్లని వెన్నెలలు కురిపించి నిద్ర పుచ్చే చందమామ, ఆహ్లాదంతో ఎగిసిపడే కల్లా కపట మెరుగని బాల్యం బాధ్యతలు, ఆరాట పోరాటాలు, చింతలు, చింతనలు గాయాలు, ఆనవాళ్ళు, భావాలు, మౌనాలు, చిరునవ్వుల ఆయుధాలు, జ్ఞాపకాల జడులు, ఋతువర్ణరాగాలు, అనుబంధాలు, దూరాలు, తేరుకొని తిరిగి మొదలయ్యే ప్రయాణాల మధ్య అక్షరాలా జీవన లయల్ని పరిచారు శిరీష. శాంతి ప్రియత్వం, క్రాంతి భావుకత్వంతో మానవీయతా తపనతో ఆత్మీయ ఆనంద ప్రపంచాన్ని ఆకాంక్షించిన సృజన పరిమళం శిరీష కవిత్వం.

రేగుముల్లోలే, నేరేడు పళ్ళోలే కష్టసుఖాల ఉరుముల మెరుపులతో సాగే జీవితంలో అప్పుడప్పుడూ మెరిసే హోళీ లాంటిది చిరునవ్వు. మనిషి ఆత్మ ధైర్యానికి చిరునవ్వే సాటిలేని ఆయుధం, రాజహంసకు చీరకట్టినట్టు చిరునవ్వుల వరుసలా మది తరంగాల్లో నాట్యం చేస్తున్న ఒకో అక్షరాన్ని కురిపించి గువ్వ పిట్టల్లా ఎగరేస్తానంటారు. అక్షరం నా చిరునవ్వు అన్న కవితలో శిరీష అక్షరం నా చిరునవ్వుకు ఆయుధం అనడంలో ఆమెలోని ఆత్మగౌరవపు అక్షరాత్మ అక్షరాలా ఆవిష్కృతమైంది. కళాత్మకమైన జీవితాన్ని కవిత్వ కోణంలో చూపిన కవిత నాలో నేను నాతోనేను. శిల్ప చిత్ర నాట్య సంగీత కళల్ని కవితా కళలోకి ఒంపి అవన్నీ తన జీవం, జీవితమని మనుసులో ముద్రించుకున్న పదాలను సాక్ష్యంగా శిరీష పరిచయం చేశారు. నీకు నాకు మధ్య ఇన్ని నిశ్శబ్ద రాగాలు అంటూ ఒక్కోసారి తను అర్థవంతమైన గేయంగా, మరోసారి అర్థం కాని గాయంగా మారుతుంటానన్న సంవేదనను అభివ్యక్తీకరించింది శిరీష రాసిన నిశ్శబ్దరాగం కవిత. అక్షరాలు గాయపడి హృదయ విదారకంగా కుమిలిపోతే కుతంత్రాలు, అన్యాయాలను ఎది రించే ఆలోచనాస్త్రాలు అగ్నిపూలై కురిసి కన్నీళ్ళను తుడుస్తాయని అక్షరావేదన కవితలో నిశితమైన తన అవలోకనను వెల్లడించారు. ఆమె ఒడి బహు మానం… ఆమె స్పర్శ దయా గుణం… ఆమె మాట ఎదిగేందుకు విజ్ఞానం అంటూ అమ్మను తన ఆనంద జీవన గమ్యాల చిరునామాగా శిరీష అభివర్ణించి అక్షరీకరించారు.

భుజంపై మోసే పుస్తకాల్లో… నాకు వాడి బరువైన జీవితమే కనబడుతుంది అని వాడొక యోగి కవితలో బడిగంట తోనే మౌనంగా పుస్తకాల సంచిని మోస్తూ, సవాలక్ష సందేహాలను విసురుతూ చొక్కా చిరుగుల్తో వివేకాలను నిలదీసే విద్యార్థిని కళ్లకు కట్టినట్లు చూపారు శిరీష. నిత్యం గ్రామీణ బడిపిల్లల మధ్య ఉపాధ్యాయినిగా గడిపే శిరీష సునిశిత దృష్టి పరంపరను ఈ కవితలో ఒక పూట తినే యోగి అనే పద ప్రయోగాన్ని బట్టి అంచనా వేయొచ్చు. అమ్మఖాళీ కడుపు తప్ప… ఏ అక్షరమూవాడి మెదడును తాకదు… ఏ భాష వాడికి అవగతమవదు అన్న వాక్యాలలో గ్రామీణ పేదరికం గాయమై తగులుతుంది. అది నా హృదయాన్ని చదివిన ఆనంద శకటం అంటూ బడికి తీసుకెళ్ళే బస్సును తలుచుకునే ఉపాధ్యాయునిగా నేను పంతులమ్మను కవితలో శిరీష కన్పిస్తారు. గృహిణిగా గిన్నెల శబ్దాల మధ్య ఇంటి బాధ్యతలు చక్కబెట్టి బస్సెక్కి సమయానికి బడికి చేరుకుని అక్షర సూర్యుళ్లైన విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట నిర్మించే నిత్య ప్రయాణంలో ఉపాధ్యాయినిలకు బడి పాఠాలు, వల్లెవేసే పద్యాలు శబ్దతరంగాలై ఊపిరిపోసే శబ్ద తరంగాలై భావ ప్రేరకాలుగా మారుతాయనడంలో అధ్యాపక వృత్తిపై ఉన్న మమకారం వ్యక్తమైంది. అంతర్మథనంలోనూ జీవనసారమంతా వడబోసి ఆనవాళ్ళకై పరుగులాట మనిషికి తప్పదని పేర్కొంటూ చివరికి మదిలో పగిలి మిగిలిపోయిన ముక్కలే దొరుకుతాయని అప్పుడు చింతనలోకి దూరిపోక తప్పదని అంటారు. నిలువెల్లా గాయాలే ఉన్నప్పుడు నేనెలా రెక్కలు విప్పాలన్న వేదననూ వినిపించారు. అక్షరాల సాహవాసంతో ఎంతో ఆనందించారు. ఉదయ సంధ్యల స్పర్శతో ఉదయించిన భావనతో బంధాన్ని పెంచుకొని కఠిన శిలల మాటున గాలి తెమ్మెరలు మోసుకొచ్చిన కృష్ణుడి మురళీరవాల్ని విన్నారు. తెరుచుకున్న పుస్తకమై బాల్యపు నెమలీకను పలకరించారు. నిశ్శబ్ద హృదయ లయను సంగీతంగా మార్చుకున్నారు. కనురెప్పలకు తాళం పడినా చుక్కలు పొడిచేసే వేళను మనసు కళ్ళతో చూశారు.

కవితను జీవన జతగా భావించి నడిచారు. అక్షరోదయాల కోసం మధనపడ్డారు. మరుజన్మలో కూడా చినుకై పుట్టి చిగురుపై ఆర్తితో కురవాలని ఆకాంక్షించారు. అపురూపమైన అక్షర ప్రవాహినిగా సాగాలని కన్నీటి సుడులను తప్పించి చిరునవ్వుల పూలు కప్పాలని కోరుకున్నారు. అక్షర సేద్యం చేసి అద్భుత శిరీషాలను ఆవిష్కరించాలన్న సుమరాగ పిలుపై స్నేహ హస్తం అందించారు. జ్ఞాపకాల దొంతరలో అబద్దం అంటని, సంఘర్షణాగాయాలెరుగని జీవితపు నిరీక్షణ మౌనరాగమేనని చెబుతారు. వర్ణచిత్రమై వెలిగే మనసు గులాబీకి బాధాతప్త జ్ఞాపకం కంటకం అని అంటారు. శిశిరంలోనూ భ్రమారహిత జీవితాన్ని నిలకడగా ధైర్యంగా నిర్దేశించారు. హృదయంలో ఉదయ రాగాల్ని జీవన భావనలతో పలికించారు. నెమలి హొయలు ఆషాడానికి, సిరిమల్లె పరిమళం గ్రీష్మానికి, వసంతం కోయిలకు సొంతమవుతుందా అంటూ కాలాతీత స్థిరత్వాన్ని ప్రతిపాదించి ఆపాదించడం ఆలోచింపజేస్తుంది. అక్షరమే ఆలంబనగా కాలప్రవాహపు లోతుల్ని జయించడానికి నువ్వు నేను మనమై నడవాలంటారు. పువ్వై పూసినా పరిమళమే నవ్వని అది జీవిత గాయాలకు లేపనమని చెబుతారు. అక్షరాన్ని అతడుగా సంబోధించి నిత్యం వెంటాడే భావ సమీరంతో పోల్చారు. సుదూరాల నుండి రేణువులను మోసుకుంటూ, పువ్వుపువ్వును పలకరిస్తూ కష్టమైనా నిష్టూరమైనా కర్తవ్యం నా రెక్కలార్చడం అంటూ సమాజంలో విరుపుల విన్యాసాలుగా తుమ్మెదల్లాంటి సామాన్యులు, కష్టజీవులు పడే విచ్చుకత్తుల బాధలకు ప్రతిరూపాలైన కవితలిందులో ఉన్నాయి.

కలతలు, వెలితుల మధ్య ఎదగలేక ఒదిగి బరువెక్కిన మనిషి బ్రతుకు స్పందనలూ ఉన్నాయి. జీవిత పయనం విరిసి విరియని వసంతం.. రాలీ రాలని శిశిరం అంటారు. మరుజన్మ అంటే మరణం తరువాత వచ్చేది కాదు నిన్ను చూసాక మళ్ళీ పుట్టడమే నేస్తమా అని ప్రగాఢానుబంధాన్ని ప్రస్తావించారు. వసంతంలా వచ్చి వెళ్లాక నీ ఆలోచనలో మిగిలిన నేను శిశిరమే అవుతానని చెప్పారు. నిత్యం వెంటాడే భావ సమీరం అంతరంగ కల్లోలమై కవనం ఆవిష్కృతమవుతుందని చెప్పారు. ఆనందమొచ్చినా, కలవరపడినా తనకూ, సంద్రానికి తెలిసింది ఎగిసిపడడమేనని అన్నారు. ప్రవాహమైన జీవితానికి గుర్తు కవిత్వం. చైతన్యానికి అక్షరమే రూపాకృతి. కొత్త రంగుల సవ్వడులతో జీవన యవనికపై అక్షర ముత్యమై ప్రతిక్షణం మెరవాలన్న బలీయమైన ఆకాంక్షను ఈ సంకలనంలోని కవితలన్నీ వ్యక్తం చేశాయి. సంద్రంలాంటి తనలోని మనోభావనాలయల్ని తీరైన కవితాక్షర మందారాలుగా శిరీష తీర్చిదిద్దారు. కళలన్నింటిలో మమేకమై మనసులో ముద్రించుకున్న పదాలను అలవోకగా జాలువార్చి అపురూపమైన కవితా కళనవుతానని చెప్పుకున్న శిరీష కవితాత్మక కృషికి నిశ్శబ్దలయలు సంకలనం నిదర్శనంగా నిలిచింది.
– తిరునగరి శ్రీనివాస్‌, 8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *