శిశిరంలో ప్రాతఃకాలాన
వికసించు విరులు
ప్రకృతిశోభను ద్విగుణీకృతం చేసి
మదిని దోచే, ఆనందవిప్రుషములే
తుషారబిందువులు.

చేలగట్లు,పచ్చికబయళ్లపై వెలసిన
ఈ తుహినబిందువులను
బాలభానుని లేలేత కిరణాలు స్పృశించగా
ముత్యాల్లా మెరుస్తున్న
ఇంపైన దృశ్యం  నేత్రపర్వమౌ.

ప్రకృతిలోని అణువణువుని
తమ జల్లులతో ఆవరిస్తూ,
మదిని పులకరింపచేసే ఆ రమణీయదృశ్యం
అనుభవైకవేద్యం.

నింగినుండి విరిజల్లులా కురుస్తున్న
ఆ హిమబిందువులు
మేనుని తాకుతోంటే,
చలికి గగుర్పొడిచే భావన అనిర్వచనీయం.

నింగిలోని తారలను
నేలపై పరచినట్లు,
పల్లెలు తెల్లని పొగమంచు
దుప్పటి కప్పుకున్నట్లు,
కనబడే ఆ హేమంతఋతుశోభను
ఏమని వర్ణించగలం?

ఈ ప్రాలేయబిందువులు
సర్వులకూ ఆనందదాయకమే.

              వేమూరి శ్రీనివాస్
                9912128967
                 తాడేపల్లిగూడెం         

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page