ములుగు ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
•అధికారం రాగానే ఒక ఎన్‌కౌంటర్.. ఏడాదిలోపు మరొకటి..
•ములుగు ఎన్‌కౌంటర్ పై తెలంగాణ సమాజం స్పందించాలి
•ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే..
•మృతుల శవాలను ఫోరెనిక్స్ నిపుణులచే శవ పరీక్షలు నిర్వహించాలి
•మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరిపించాలి
•పౌర హక్కుల నేత ప్రొఫెసర్ జి.హరగోపాల్ డిమాండ్
•మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరిపించాలి
•పౌర హక్కుల నేత ప్రొఫెసర్ జి.హరగోపాల్ డిమాండ్
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4 : రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును పాలకులు కాలరాయొద్దని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని ఎన్‌కౌంటర్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారం రాగానే ఒక ఎన్‌కౌంటర్ సంవత్సరంలోపు మరో ఎన్‌కౌంటర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిందని ఆరోపించారు. అడవిలోని ఖనిజ సంపదను కార్పొరేట్లను కట్టబెట్టెందుకే ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో శ్రుతి సాగర్ ఎన్‌కౌంటర్ తర్వాత ప్రజల్లో నుంచి వొచ్చిన వ్యతిరేకత వల్ల ఎన్‌కౌంటర్లు ఆపివేశారని అన్నారు.
శ్రుతి సాగర్ ఎన్‌కౌంటర్ కు స్పందించినట్లుగానే ములుగు ఎన్‌కౌంటర్ పై తెలంగాణ సమాజం స్పందించాలన్నారు. తద్వారా బూటకపు ఎన్‌కౌంటర్లకు అడ్డుకట్ట పడుతుందన్నారు. ఈ మేరకు బుధవారం హైదర్ గూడ ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మృతుడు మధు సహచరి మీనాతో కలిసి ప్రొఫెసర్ జి.హరగోపాల్ మాట్లాడారు. డిసెంబర్ 1న జరిగిన ములుగు ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన వారికి అన్నంలో విషాహారం పెట్టి చిత్రహింసలకు గురిచేసి, కిరాతకంగా హత్య చేశారని, ఈ ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే ప్రజల నుంచి వొచ్చిన సమాచారం ప్రకారం అన్నంలో విషం కలిపి హత్య చేసినట్లు తెలిసిందన్నారు.
అదే నిజమని ఎన్‌కౌంటర్ మృత శరీరాలను బట్టి అర్థమవుతోందన్నారు. మృతుడు మధు శవాన్ని సహచరి మీనా చూసిన తర్వాత వాస్తవాలు అర్థమయ్యయని, ఎన్‌కౌంటర్ అంటే ఎదురు కాల్పులుగా ఇంతకాలం చరిత్ర సాగిందని, కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్ అంటే పట్టుకుని కాల్చి చంపడమని అందరికీ తెలిసిందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో మేడారంలో జరిగిన శ్రుతిసాగర్ ఎన్‌కౌంటర్ లో వాళ్లపై జరిగిన హింసను చూస్తే అవి ఎన్‌కౌంటర్ కాదని, అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని పూర్తిగా స్పష్టమైందన్నారు. అదే విధంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇటీవల డిసెంబర్ 1న జరిగిన ములుగు, ఏటూరు నాగారంలో జరిగిన ఎన్‌కౌంటర్లన్నీ బూటకమన్నారు. ఎన్ కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఇప్పటికే సుమారు 300కు పైగా ఆదివాసీలు, ఉద్యమకారులు హత్యకు గురయ్యారని, కేంద్ర ప్రభుత్వ ఆపరేషన్ కగార్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బార్డర్ లో ఇప్పటికే మూడు చోట్ల మిలటరీ క్యాంపులను ఏర్పాటు చేశారన్నారు. ఒకవైపు ఉద్యమాలనేవి మౌలిక సమస్యలకు పరిష్కారం వైపుగా ఉంటాయని చెబుతూనే..
అదే ఉద్యమకారులను ఎన్ కౌంటర్ పేరుతో కిరాతకంగా హత్య చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక 16 మంది ఉద్యమకారులను ఎన్ కౌంటర్ పేరుతో కాల్చి చంపారని, నవంబర్ 5న జరిగిన రఘునాథపాలెం ఎన్‌కౌంటర్‌పై నిజ నిర్ధారణ బృందానికి బయలుదేరిన వారిని అశ్వలపేటలో నిర్బంధించారని గుర్తుచేశారు. చరిత్రలో ఎప్పుడు కూడా నిజ నిర్ధారణ బృందాన్ని అరెస్టు చేసిన దాఖలాలు లేవన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రజాస్వామిక బద్దంగా పరిపాలించాలని, ఎన్‌కౌంటర్లుని తెలంగాణను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజ్యాంగంపై గౌరవం లేదని, మనిషి రక్షణ, భద్రత కల్పించడం కోసం ఉన్నదే రాజ్యాంగం అన్నారు.
రాజ్యాంగం ప్రకారం ఒక మనిషి ప్రాణం బలి తీసుకోవచ్చా అని ఆయన ప్రశ్నించారు. మృతుడు మధు సహకరి మీనాకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలని, ఆమెను ఎలాంటి వేధింపులకు గురి చేయవద్దని కోరారు. మావోయిస్టు శాంతి చర్చలు జరిపించి, శాంతియుత వాతావరణం నెలకొల్పాలని, డిసెంబర్ 1న జరిగిన ములుగు ఎన్ కౌంటర్ మృతుల శవాలను ఫోరెనిక్స్ నిపుణులచే శవ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ నాయకులు బల్లా రవీంద్రనాథ్, ఐఏపీఎల్ డి.సురేష్ కుమార్, బంధుమిత్రుల సంఘం నాయకులు అంజమ్మ పాల్గొన్నారు.