హరితహారంలో 19.50 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

జిల్లా కలెక్టర్లతో సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ‌వీడియో కాన్ఫరెన్స్
‌దళిత బంధు, వరి ధాన్యం సేకరణపైనా సమీక్ష

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 29 : ‌రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో 19.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 7.70  శాతం పెరిగిందని ఆయన అన్నారు. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం బిఆర్‌కెఆర్‌ ‌భవన్‌ ‌నుండి సిఎస్‌ ‌జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించి, రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం, దళిత బంధు, యాసంగి వరి ధాన్యం సేకరణ అమలుపై సమీక్షించారు. అటవీ విస్తీర్ణం 10 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో పెద్ద ఎత్తున గ్రీనరీ పెంపొందించేందుకై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 19,400 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు ఏర్పాటు చేయని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని సిఎస్‌ ఈ ‌సందర్భంగా కలెక్టర్లను ఆదేశించారు.

దీనితోపాటు ప్రతి మండలంలో కనీసం నాలుగు బృహత్‌ ‌పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం ప్రతీ మున్సిపాలిటీకి ప్రణాళిక ఉండాలని చెప్పారు. ఖాళీ స్థలాలను గుర్తించి, చిక్కటి పచ్చదనం పెంచటం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున హరితహారం మొక్కలకు వారంలో రెండు, మూడు సార్లు నీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా అన్ని ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టుల వద్ద, కాలువ గట్లపై పచ్చదనం పెంపు, పది శాతం కన్నా తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళికతో పచ్చదనం పెంచటం ఎనిమిదవ విడత హరితహారం ప్రాధాన్యతా అంశాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ‌ప్రకటించారు. అన్ని సాగునీటి ప్రాజెక్టులు, కాలువ గట్ల వెంట పచ్చదనం పెంచటం అత్యంత ప్రాధాన్యతా అంశమని, ఇందు కోసం వారం రోజుల్లో యాక్షన్‌ ‌ప్లాన్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దళిత బంధు అమలును కూడా సిఎస్‌ ‌సమీక్షించారు.

CS ‌Somesh ‌Kumar‌ Video Conference

ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే మంజూరు చేసి లబ్దిదారులను గుర్తించిన దళితబంధు యూనిట్లను వెంటనే గ్రౌండ్‌ ‌చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను ఆదేశించారు. వరి ధాన్యం సేకరణ గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికే ఏడు కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మరో 4.5 కోట్లు త్వరలో వొస్తాయని ఆయన అన్నారు. అన్ని రైతు వేదికల్లో రైతు సమావేశాలు నిర్వహించి, సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. రైతువేదికలను క్రియాత్మకంగా తీర్చిదిద్దాలని ఆయన ఆదేశించారు. వీడియోకాన్పరేన్స్‌లో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పిసిసిఎఫ్‌ ‌డోబ్రియల్‌, ‌మున్సిపల్‌ ‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ ‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ ‌కుమార్‌, ‌హరితహారం ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్‌ ‌వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page