Take a fresh look at your lifestyle.

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలి

యువతకు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌పిలుపు
హైదరాబాద్‌ ‌రాష్ట్ర స్వాతంత్య్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన గవర్నర్‌

‌హైదరాబాద్‌, ‌పిఐబి, సెప్టెంబర్‌ 14 : ‌నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి తెలుసుకుని యువత స్ఫూర్తి పొందాలని రాష్ట్ర గవర్నర్‌ ‌తిమిళి సై సౌందరరాజన్‌ ‌సూచించారు. హైదరాబాద్‌ ‌రాష్ట్ర స్వాతంత్య్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్‌ను గవర్నర్‌ ‌బుధవారం సికింద్రాబాద్‌ ‌పెరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. సెంట్రల్‌ ‌బ్యూరో ఆఫ్‌ ‌కమ్యూనికేషన్‌(‌సీబీసీ), కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ  ఏర్పాటు చేసిన ఈ ఫోటో ఎగ్జిబిషన్‌ ‌సెప్టెంబర్‌ 18 ‌వరకు కొనసాగుతుంది. హైదరాబాద్‌ ‌విమోచన వారోత్సవాలను సెప్టెంబర్‌ 17‌వ తేదీ నుంచి అధికారికంగా ఏడాది పాటు 2023 సెప్టెంబర్‌ 17 ‌వరకు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో కలిసి  సెంట్రల్‌ ‌బ్యూరో ఆఫ్‌ ‌కమ్యూనికేషన్‌ (‌సీబీసీ), కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసాయి.

ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం గవర్నర్‌ ‌మాట్లాడుతూ..నిజాం పాలన నుంచి విముక్తి పొందిన హైదరాబాద్‌ ‌రాష్ట్రానికి సెప్టెంబర్‌ 17 ‌నిజమైన విమోచన దినం అని అన్నారు. పరకాల, బైరంపల్లి సంఘటనలను గవర్నర్‌ ఈ ‌సందర్భంగా గుర్తు చేశారు. పరకాల ఊచకోతలో 30 మందిని కాల్చి చంపారని అన్నారు. బైరంపల్లిలో రజాకార్లు 90 మందికి పైగా అమాయకులను బావిలోకి తోసి వేశారని  గవర్నర్‌ ‌వివరించారు. హైదరాబాద్‌ ‌రాష్ట్రానికి విముక్తి కల్పించి రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు  ఉక్కు మనిషిగా గుర్తింపు పొందిన అప్పటి కేంద్ర హోమ్‌ ‌మంత్రి సర్దార్‌ ‌వల్లభ్‌భాయ్‌ ‌పటేల్‌ ఆపరేషన్‌ ‌పోలో కార్యక్రమాన్ని చేపట్టారని గవర్నర్‌ ‌తెలిపారు.   ఈ నెల 17న జరుగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. హైదరాబాద్‌ ‌రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులపై ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసిన సెంట్రల్‌ ‌బ్యూరో ఆఫ్‌ ‌కమ్యూనికేషన్‌ (‌సీబీసీ)ని గవర్నర్‌ ఈ ‌సందర్భంగా అభినందించారు.

ఇటువంటి కార్యక్రమాల ద్వారా నేటి యువతకు నాటి స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు, సాగించిన పోరాటాలు తెలుస్తాయని అన్నారు. నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన స్వాతంత్య్ర సమరయోధులు వల్ల నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని గవర్నర్‌ ‌పేర్కొన్నారు. కార్యక్రమంలో పిఐబి, సిబిసి డైరెక్టర్‌ ‌జనరల్‌(‌సౌత్‌) ఎస్‌ ‌వెంకటేశ్వర్‌ ‌మాట్లాతూ..అప్పటి హైదరాబాద్‌ ‌సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో స్వాతంత్ర సమరయోధులు పోషించిన పాత్ర గుర్తుకు తెచ్చేలా ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశామని వివరించారు. కొమురం  భీమ్‌, ‌చాకలి ఐలమ్మ, వందేమాతరం రామచంద్రరావు, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి వంటి స్వాతంత్య్ర సమరయోధులు సాగించిన పోరాటాన్ని వివరిస్తూ మొత్తం 60 ఫొటోలను ప్రదర్శనకు ఉంచారు. అంతకుముందు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రమణారెడ్డిని, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను గవర్నర్‌ ‌సన్మానించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి పాల్గొన్నారు. వేదిక వద్ద  పబ్లికేషన్స్ ‌విభాగం ఒక పుస్తక ప్రదర్శన మరియు లలిత కళా అకాడమీ స్వాతంత్య్ర ఉద్యమాన్ని చిత్రించే పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది.

Leave a Reply