తెలంగాణకు విశ్వఖ్యాతి వొచ్చిందంటే కేసీఆర్ వల్లే..
హరీష్ రావును భారీ మెజారిటీతో ఆశీర్వదించండి
సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు సతీమణి శ్రీనితరావు ఇంటింటి ప్రచారం
అడుగడుగునా ఆత్మీయత… ఆప్యాయత….యువతుల జోష్…
సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 25: సిద్ధిపేట ప్రజలు మాకు వోటర్లు కాదనీ, మా కుటుంబ సభ్యులని సిద్ధిపేట బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సతీమణి శ్రీనితరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలోని వివిధ వార్డుల్లో మంత్రి హరీష్‌రావు తరపున శ్రీనిత ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన శ్రీనితరావుకు మహిళలు మంగళ హారతులతో, పూల వర్షాలతో ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా శ్రీనితరావు బీడీ కార్మికురాలితో ముచ్చటిస్తూ సరదాగా బీడీలు చుట్టారు. అనంతరం మునిసిపల్ ఛైర్‌పర్సన్ మంజుల రాజనర్సు, కౌన్సిలర్లు కవిత, ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి తదితరులతో కలిసి ఆమె మాట్లాడారు. సిద్ధిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలోనే మొదటి స్థానంలో నిలిపిన హరీష్‌రావుకు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో హరీష్‌రావుకు రికార్డు మెజారిటీ వచ్చిందనీ…ఈ ఎన్నికల్లో మంత్రి హరీష్‌రావును ఆశీర్వదించి మెజారిటీని మరింత పెంచి ఒక లక్షా 50వేల మెజారిటీని ఇవ్వాలని కోరారు.
తెలంగాణకు విశ్వఖ్యాతి వచ్చిందంటే సిఎం కేసీఆర్ వల్లేనని, ఇదే అభివృద్ధి కొనసాగాలి అంటే మళ్లీ బిఆర్‌ఎస్ పార్టీ సిఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. ఈ ఎన్నికల్లోనూ బిఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని శ్రీనితరావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బోటిక్స్ నడుపుతున్న సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో పర్యటించానని అప్పుడు తెలంగాణ అంటే ఎవరూ గుర్తుపట్టేవారు కాదనీ, ఆంధ్ర, హైదరాబాద్ అంటేనే గుర్తుపట్టేవారని మంత్రి హరీష్‌రావు సతీమణి శ్రీనిత అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతే తెలంగాణ పేరును ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఆగిపోకూడదంటే మరోసారి బిఆర్‌ఎస్‌నే గెలిపించాలన్నారు. వేరే పార్టీకి అధికారం ఇస్తే ఢల్లీి కేంద్రంగా పరిపాలన కొనసాగుతుందనీ, దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందన్నారు. పని చేసే బిఆర్‌ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి హరీష్‌రావు సతీమణి శ్రీనితరావు కోరారు. ఆమె వెంట మునిసిపల్ వైస్ ఛైర్మన్ జంగిటి కనకరాజు, పలువురు కౌన్సిలర్లు ఉన్నారు. శ్రీనితరావుకు పట్టణంలో ఇంటింటి ప్రచారం సందర్భంగా అడుగడుగునా ఆత్మీయత… ఆప్యాయత….యువతుల జోష్ కనిపించింది. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన, ఆదరణ, ప్రేమాభిమానం లభించింది.




