- మంత్రి హరీష్ కృషితో బస్టాండు పునర్నిర్మాణం
- జూన్ నెల 8న మోడల్ బస్టాండు ప్రారంభానికి సన్నాహాలు
- నిర్మాణ పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు
సిద్ధిపేట, మే 26(ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట పాత బస్టాండుకు కొత్త కళ వొచ్చింది. మంత్రి హరీష్ రావు కృషితో బస్టాండు పునర్నిర్మాణం పూర్తవుతున్నది. నాటి మంత్రి చొక్కారావు వేసిన పునాది 2 వేల మంది ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేది. నేటి మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో 24 వేల మంది ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలు కల్పనతో ప్రారంభానికి సిద్ధమవుతున్నది. ఈ మేరకు బస్టాండ్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న దరిమిలా గురువారం మధ్యాహ్నం పనులను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండే వీలుగా ముందు చూపుతో నిర్మాణం జరపాలని నిర్ణయించినట్లు, విజన్‌కు అనుగుణంగా బస్టాండ్ నిర్మాణం వొచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.
9 బస్ స్టాపులతో నిర్మితమవుతున్న పనులు క్షుణ్ణంగా పరిశీలించి, మిగులు పనులు వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బస్టాండుకు వొచ్చే ప్యాసింజర్లు-ప్రయాణీకులకు మోడ్రన్ టాయిలెట్స్, క్యాంటీన్, దుకాణ సముదాయం, బస్టాండులో దాదాపు 20 వరకూ ప్లాట్ ఫామ్స్ వొచ్చేలా డిజైన్లకు అనుగుణంగా పనులు ఆర్టీసీ అధికారులు వివరించారు. కార్యక్రమంలో మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, పాల సాయి రామ్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.