హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : స్వతంత్ర జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త కె.సజయ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి(2021) ఎంపికయ్యారు. సామాజిక కార్యకర్త భాషా సింగ్ ఆంగ్లంలో రచించిన ‘‘అన్ సీన్’’ పరిశోధనాత్మక గ్రంథాన్ని ‘‘అశుద్ధ భారత్’’ పేరుతో తెలుగులోకి అనువదించిన కె.సజయకు ఈ పురస్కారం లభించింది. డా.చంద్రశేఖర్ కంబర్ అధ్యక్షతన కమిటీ 22 పుస్తకాలను వివిధ భాషల్లో(అనువాద) ఎంపిక చేసినట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో అకాడమీ పేర్కొంది. ఇటీవల వివిధ సాహిత్య పక్రియల్లో ఉత్తమ రచనలకు(2018 సంవత్సరం) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాలు ప్రకటించింది.
అందులో అనువాద విభాగంలో ఈ అవార్డును సుప్రసిద్ధ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త భాషాసింగ్ ఆంగ్లంలో రచించిన ‘‘అన్ సీన్’’ అన్న పరిశోధనాత్మక గ్రంథాన్ని ‘‘అశుద్ధ భారత్’’ పేరుతో తెలుగులోకి అనువదించినందుకు సజయ ఈ పురస్కారాన్ని పొందారు. ‘‘అన్సీన్ : ది ట్రూత్ అబౌట్ ఇండియాస్ మాన్యువల్ స్కావెంజింగ్’’ ఈ పుస్తకం ముఖ్యంగా పాకీపని విధానంలో వున్న మనుషుల గురించి చర్చిస్తుంది. తరాల తరబడి ఈ అమానవీయమైన విధానానికి బలైన పాకీ సమూహానికి చెందిన వారి గురించి మాట్లాడుతుంది. ఈ పుస్తకం వారి జీవితాలను, పోరాటాలను ఎత్తి చూపింది.