వేములవాడలో వైభవంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కల్యాణం

సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి28 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామిల కల్యాణం (శివ కల్యాణం) గురువారం ఉదయం  అత్యంత వైభవంగా నిర్వహించారు. అన్ని శ్కెవాలయాల్లో శ్రీ శివకళ్యాణాన్ని మహాశివరాత్రి నాడు నిర్వహిస్తుం డగా శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాత్రం కామ దహనానంతరం (హోలీ  పండుగ) అనంతరం నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో రాజన్న గుడిలో గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామిల కల్యాణాన్ని నిర్వహించగా వేలాది శివపార్వతులు, జోగినులు, వందలాది హిజ్రాలు పాల్గొన్నారు.

ఆలయంలో ఉదయం శ్రీస్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన పిదప దేవస్థానం పడమటి గేటు వద్ద ఏర్పాటు చేసిన వేదిక పై కల్యాణాన్ని నిర్వహించగా కన్యాదాతలుగా అప్పాల భీమాశంకర్‌ శర్మ,ఇందిరలు వ్యవహరించగా వేదపండితులు శరత్‌ చంద్ర,రాజేశ్వర శర్మ తదితరుల అధ్యర్యంలో ఉదయం 10  గంటల నుండి కల్యాణాన్ని నిర్వహించారు.

ఈ కల్యాణాన్ని తిలకించడానికి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం పూర్తిగా నిండిపోగా రోడ్డుపై వందలాది  భక్తులు వేచి ఉండి ఎల్‌ఇడి తెరపై కళ్యాణాన్ని చూశారు.ఈ సందర్భంగా రాష్ట్ర  ప్రభుత్వం తరపున శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలను  దేవస్థానం ఈఓ కృష్ణ ప్రసాద్‌,వేములవాడ మున్సిపాలిటి తరపున మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌లు సమర్పించారు. ఈ కల్యాణం లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *