వక్ఫ్‌ చట్టంపై వాడీవేడీ చర్చ

చట్ట సవరణ ఎవరికీ వ్యతిరేకం కాదు
లేకుంటే పార్లమెంట్‌ స్థలం కూడా వక్ఫ్‌దే అంటారు..
కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు సంచలన వ్యాఖ్యలు

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2 : వక్ఫ్‌ చట్టంపై వాడీవేడీ చర్చ జరిగింది. లోక్‌సభలో బిల్లుపై పలువురు ఎంపిలు తమ అభిప్రాయాలను తెలియచేశారు. వక్ఫ్‌ చట్ట సవరణ జరగకుంటే…పార్లమెంట్‌ భవనం కూడా దాని కిందకు వొచ్చేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ సవరణ బిల్లును తీసుకు వచ్చింది. ఈ బిల్లును సభలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. యూపీఏ హయాంలో ఈ వక్ఫ్‌ చట్టంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. 1970 నుంచి దిల్లీ జరుగుతున్న ఒక కేసులో పార్లమెంట్‌ భవనంతో సహా అనేక ఆస్తులు ఉన్నాయన్నారు. దిల్లీ వక్ఫ్‌ బోర్డు వీటిని క్లెయిమ్‌ చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని గుర్తుచేశారు. కానీ అప్పుడు యుపిఎ 123 ఆస్తులను డీనోటిఫై చేసి వక్ఫ్‌ బోర్డుకు ఇచ్చిందని కేంద్ర మంత్రి రిజిజు పేర్కొన్నారు. అయితే ఈ వక్ఫ్‌ సవరణ బిల్లు ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టకుంటే.. పార్లమెంట్‌ భూమి సైతం వక్ఫ్‌ ఆస్తి అనే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వక్ఫ్‌ చట్టంలోని పలు క్రూరంగా పరిగణించే అంశాలను తమ ప్రభుత్వం తొలగించిందన్నారు. అంతేకాకుండా.. దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటకలోని పలు దేవాలయాలతోపాటు హర్యానాలోని వివిధ గురుద్వార్‌లను ముస్లిం సమాజం వక్ఫ్‌ భూమిగా క్లయిమ్‌ చేసిందని రిజిజు ఈ సందర్భంగా వివరించారు. అయితే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదంటూ.. ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి రిజిజు చురకలంటించారు.

ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రతిపక్షాలు నడుం బిగించాయని మండిపడ్డారు. ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. బిల్లు గురించి విపక్షాలు అసత్య ప్రచారం చేశాయి. అందులోని అంశాలను లేవనెత్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. 1954లో తొలిసారి వక్ఫ్‌ చట్టం అమల్లోకి వొచ్చింది. అది అప్రజాస్వామికమని ఆనాడు ఎవరూ చెప్పలేదు. పార్లమెంట్‌ ఉభయ సభ్యులతో కూడిన జేపీసీకి అభినందనలు. మొత్తం 284 ప్రతినిధులు, 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వక్ఫ్‌ బోర్డులు జేపీసీలో తమ వాదనలు వినిపించాయి. మేం బిల్లులో కొన్ని సానుకూల మార్పులు చేస్తే.. మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు. ఈ బిల్లు తీసుకుని రాకపోతే.. కొందరు పార్లమెంట్‌ భవనాన్ని కూడా వక్ఫ్‌ ఆస్తిగా పేర్కొంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ స్పందనకు గతంలో ఏఐయూడీఎఫ్‌ చీఫ్‌ బద్రుద్దీన్‌ అజ్మల్‌ చేసిన వ్యాఖ్యలు కారణం. దేశ రాజధానిలోని పార్లమెంట్‌ భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్‌ ఆస్తికి సంబంధించినవని అజ్మల్‌ అప్పట్లో వాదించారు. వక్ఫ్‌ బిల్లు ముస్లిం సమాజానికి చెందిన మత విశ్వాసాలకు ఎలాంటి ఆటంకం కలిగించదు. ఇది కేవలం ఆస్తుల నిర్వహణకు సంబంధించిన విషయం మాత్రమే. ఈ బిల్లుకు మద్దతిచ్చేవారు, వ్యతిరేకించే వారు ఎప్పటికీ గుర్తుండిపోతారు. పేద ముస్లింలకు వక్ఫ్‌ ఆస్తులను ఉపయోగించాలి. వారిని అలా వదిలేయకూడదు. వారి ఉన్నతి కోసం మోదీ ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

 

ముస్లిం ప్రతినిధులు ఆ బిల్లును ఆహ్వానించారు. వీలైనంత త్వరగా దీనికి ఆమోదం లభించాలని ఆ వర్గంలోని పేదలు కోరుకుంటున్నారు. అలాగే రిజిస్టర్‌ చేసిన ఆస్తి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరు. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో ముస్లిం మహిళలు, పిల్లలకు వారి హక్కులు దక్కుతాయి. ప్రభుత్వ భూమి విషయంలో వివాదం తలెత్తితే కలెక్టర్‌ కంటే పైస్థాయి వ్యక్తి తీర్పు ఇవ్వాలంటూ జేపీసీ చేసిన ప్రతిపాదనను మేం అంగీకరించామని రిజిజు స్పష్టత ఇచ్చారు. మరోవైపు విపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కోల్‌కతాలో మార్చ్  జరిగింది. ఇక ఈ వక్ఫ్‌ బోర్డు విషయంతో తాము క్లియర్‌గా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆ క్రమంలో కేంద్ర, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డ్‌లలో ఇద్దరు ముస్లిమేతర వ్యక్తులు ఉండాలని నిర్ణయించామన్నారు.

అలాగే ఈ వక్ఫ్‌ బోర్డులల్లో ముస్లిం మహిళలకు చోటు ఉండడం లేదని తెలిపారు. దీంతో ఈ బోర్డుల్లో ఇద్దరు ముస్లిం మహిళలకు స్థానం కల్పిస్తామన్నారు. మరోవైపు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయని.. ఆ రాష్ట్రంలో 17 శాతం మైనార్టీల వోట్లు ఉన్నాయి. అందుకోసమే ఈ బిల్లును తీసుకొస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. అంతకు ముందు కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు గౌరవ్‌ గోగోయ్‌ మాట్లాడుతూ.. ఈ బిల్లుపై తప్పుదొవ పట్టించే ప్రయత్నాన్ని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా.. ఈ బిల్లు సవరణలు సమర్పించడానికి ఒక ఏడాది ముందు, 2023లో జరిగిన పార్లమెంటరీ కమిటీ  నాలుగు సమావేశాలు జరిగాయని.. వాటిలో దేనిలోనూ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ బిల్లును ఎందుకు ప్రస్తావించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని రంజన్‌ గొగోయ్‌ సూటిగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు పై విధంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page