పేదలకు కడుపు నిండా తిండి పెట్టడమే ధ్యేయం

సన్నబియ్యం పథకం దేశంలోనే చారిత్రాత్మకం
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. రానున్న రోజులలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరుతామని .పేదలకు కడుపునిండా తిండి పెట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. 2013లో ఆహార భద్రత చట్టం తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బుధవారం  మల్లంపల్లి, ములుగు, వెంకటాపూర్, గోవిందరావు పేట,  మండలాల్లో కలెక్టర్ దివాకర్ టిఎస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, అదనపు కలెక్టర్ మహేందర్ జి తో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ అన్నమో రామచంద్ర అనే కాలం పోయిందని, ధనవంతుడు ఎలాంటి అన్నం తింటున్నాడో పేదవాడు సైతం అదే అన్నం తినాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిందని అన్నారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచి వెళుతున్న సమయంలో దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఎకరాల్లోనే వరి పంట పండిందని, ఆ సమయంలో తిండి దొరకక గడక, గంజి తాగి జీవించేవారమని అన్నారు. నెహ్రు, ఇందిరా గాంధీ కాలంలో దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక ప్రాజెక్టులను ఏర్పాటు చేశారని తెలిపారు. వారు ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల నీటితోనే రాష్ట్రంలోని రైతులు రికార్డు స్థాయిలో వరి పంట పండిస్తున్నారని అన్నారు.

నెహ్రూ, ఇందిరా గాంధీ కాలంలో గరీబీ హఠావో అనే నినాదంతో ప్రతి పేదవాడికి గూడు, గుడ్డతో పాటు బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టారని, వారిని ఆదర్శంగా తీసుకొని నేటి ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని అన్నారు. గతంలో ఇతర దేశాల నుండి మన దేశానికి బియ్యం దిగుమతి చేసుకునే వారమని, నేడు రికార్డు స్థాయిలో పంట పండడం వలన మనమే ఇతర దేశాలకు బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఒక్క రైతుకు కూడా బోనస్ డబ్బులు బాకీ లేమని అన్నారు. గత పాలకులు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడంతో ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ ఒకవైపు అప్పులకు వడ్డీలు కడుతూనే మరోవైపు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు.

ఇప్పటికే మహిళా గ్రూపులకు ఇచ్చిన హామీ మేరకు వడ్డీ రూపాయలను బ్యాంకులలో జమ చేశామని వివరించారు. ఉచిత సన్న బియ్యం పంపిణి కోసం ప్రభుత్వం కిలోకు రూ.40  వరకు ఖర్చు చేసింది. ధనవంతులు తినే సన్న బియ్యం ఇక పై పేదలు కూడా తినే రోజులు వచ్చాయని  అన్నారు.దేశ చరిత్రలోనే సన్న బియ్యం పంపిణీ పథకం చారిత్రాత్మక మని,  ముఖ్యమంత్రి పేదల కోసం మహత్తరమైన పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా తినదగిన బియ్యం సరఫరా చేస్తామని,  ఈ పథకం పేదల గుండెల్లో నిలిచే పథకమని మంత్రి పేర్కొన్నారు.సన్న బియ్యాన్ని పక్కదోవ పట్టించేందుకు డీలర్లు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని మంత్రి  హెచ్చరించారు.

తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడమే కాకుండా గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి సైతం సన్న బియ్యం పంపిణీ చేస్తామని కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, డిసిఎస్ఓ షా ఫైజల్ హుస్సేని, డిసిఎస్ఓ డిఎం  రాంపతి, తహసిల్దారులు విజయ భాస్కర్, గిరిబాబు, సృజన కుమార్, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page