కులకచర్ల, ప్రజాతంత్ర,22: భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న లేబర్ కార్డు ద్వారా పొందే పథకాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని జన్ సాహస్ స్వచ్చంధ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సౌమ్యా రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు… లేబర్ పొందిన కార్మికులకు ఎన్ఏసి వారిచే 15 రోజుల లేబర్ శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ శిక్షణ కాలంలో ఒక్కోక్క కార్మికుడికి రోజుకు రూ.300 చొప్పున 15 రోజులకు స్తైఫండ్ ఇచ్చి సర్టిఫికెట్ అందజేస్తారని తెలిపారు. లేబర్ కార్డు పొందిన వారి కుటుంబీకుల మహిళలు (భార్య లేదా కూతురు) లకు ఉచితంగా 90 రోజుల కుట్టు మిషన్ శిక్షణ ఉంటుదని శిక్షణ అనంతరం కుట్టు మిషన్ కూడా పంపిణి చేస్తారని వివరించారు. చదువుకునే పిల్లలుంటే వారికి కంప్యూటర్ శిక్షణ కూడా ఇచ్చి సర్టిఫికెట్ అందజేస్తారని పేర్కొన్నారు. ఇవే కాకుండా లేబర్ కార్మిక భీమా కూడా వర్తిస్తుందని తెలిపారు. ఇలాంటి లేబర్ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జన్ సాహస్ సంస్థ యొక్క కార్మికుల టోల్ ఫ్రీ నెంబర్ 180012011211 కార్మికులకు ఎలాంటి సమాచారం కావాలన్నా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అని తెలిపారు. అనంతరం టోల్ ఫ్రీ నెంబర్ పోస్టర్ ను సర్పంచ్ చేతుల మీదుగా విడుదల చేశారు. సర్పంచ్ సౌమ్యా రెడ్డి మాట్లాడుతూ… గ్రామంలో భవన నిర్మాణ కార్మికులను గుర్తించి కార్డులు అందజేసీ వాటి నుండి వచ్చే పథకాలను వివరించడం నిజంగా అభినందించే విషయమన్నారు. కార్మికులు న్యాక్ వారు అందించే శిక్షణ తరగతులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వెంకటేష్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.