కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి20: రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని బీఆర్‌ఎస్న్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. దిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా? వాళ్ల ఆర్తనాదాలు వినిపిం చవా? ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న శ్రామికులపై కనికరం లేదా? సీట్లు, వోట్ల పంచాయితీ తప్ప..
అన్నదాత లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా అంటూ విమర్శలు సంధించారు. ప్రజా పాలన అంటే 24/7 ఫక్తు రాజకీయమేనా? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంట నష్టంపై లేదెందుకు? దెబ్బతిన్న పంటలను పరిశీలించే తీరిక లేదా? హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొడుతున్న కు.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా? అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందనిమాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.





