తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌ల వివాదం అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. వారు లేవత్తిన అంశంపైన ఇతర పార్టీలనుండి వొచ్చిన వారు ఒక అడుగు వెనక్కి తగ్గినప్పటికీ సీనియర్లు మాత్రం పట్టు వీడటంలేదు. ఆదివారంనాడు గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన టిపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశానికి కూడా వీరు హాజరు కాకుండా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వాస్తవంగా ఏఐసీసీ నిర్వహించ తలపెట్టిన కార్యక్రమంపైన చర్చించేందుకే ఈ సమావేశాన్ని రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేశారు. రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో’ యాత్ర జనవరి 24న ముగియనుంది. అయితే దాని కొనసాగింపుగా దేశ వ్యాప్తంగా ‘హాత్ సే హాత్ జోడో’ కార్యక్రమాన్ని రెండు నెలలపాటు నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో ఎలా జరుపాలన్నదానిపైన గాంధీ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, మధుయాస్కీ, జగ్గారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, కోదండరెడ్డి, దామోదర రాజనర్సింహలు హాజరుకాలేదు. తాము లేవనెత్తిన ప్రశ్నకు సరైన సమాధానం అధిష్టానం నుండి లభించేవరకు రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసే ఏ సమావేశానికి హాజరు కాబోమని వారు భీష్మించుకుని కూర్చున్నారు. అయితే టిడిపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పదమూడు మంది మూకుమ్మడిగా తమకు కొత్తగా లభించిన పదవులకు రాజీనామాచేస్తున్నట్లు ప్రకటించడంద్వారా ఒక విధంగా సీనియర్లకు వారు సవాల్ విసిరారు. దీనితోనైనా సీనియర్లు తమ అలకమాని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని భావించారు. కాని సీనియర్లనుండి ఏలాంటి స్పందన కన్పించలేదు. ఇదిలా ఉంటే అధికార పార్టీని గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యంగానే తాము రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
తెలంగాణరాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండడమేగాక, బిఆర్‌ఎస్ చేస్తున్న ఆగడాలకు ఆ పార్టీని ఎదుర్కునే సత్తాకూడా కాంగ్రెస్‌కే ఉందని, కాంగ్రెస్‌ద్వారానే రాజకీయ పునరేకీకరణ జరుగుతుందన్న ఉద్దేశ్యంగా కాంగ్రెస్‌లో చేరినట్లు వారు చెబుతున్నారు. అప్పటినుండీ ఆనాటి పీసీసీ ఆధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేటి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇచ్చిన ప్రతీ పిలుపును అందుకుని అధికార బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలపై రాజీలేని పోరాటం చేస్తున్న వీరు నిజంగానే పార్టీ పరమైన పదవులేవీ నేటివరకు అనుభవించకుండా ఉన్నారు. అయితే పార్టీలో వారిసేవలను గుర్తించి అధిష్టానం కొత్త కార్యవర్గంలో పదవులు కల్పించింది, ఇదే విషయాన్ని వారు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్కం ఠాకూర్‌కు పంపిన సుదీర్ఘలేఖలో వివరించారు. ఇప్పుడు సీనియర్లు అలిగిపోయారనో, వారికి భయపడో తాము ఆ పదవులకు రాజీనామా చేయలేదంటూ ఈ సందర్భంగా వారు మీడియా ముందు స్పష్టం చేస్తున్నారు. వాస్తవంగా తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచి క్యాడర్ ఉంది. నాయకులకు కొదవలేదు. అయితే నాయకుల్లో ఐక్యత లేకపోవడంవల్లె కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లో మూడవ స్థానానికి దిగజారిపోయింది. ఈ అనైక్యత కారణంగానే పెద్దగా క్యాడర్‌లేని బిజెపి రెండవ స్థానాన్ని ఆక్రమించుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ వాతావరణం చూస్తుంటే ఎన్నికలకున్న ఏడాది కాలంవరకు ఆగేపరిస్థితి కనిపించడంలేదు.
ఇప్పుడంటే ఇప్పుడు ఎన్నికలు పెడితే తమ సత్తా చూపించుకునేందుకు బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు సిద్దంగా ఉన్నాయి. ఇక్కడి రాజకీయాలపై స్యయంగా దేశ ప్రధానే దృష్టిపెట్టాడు. ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితిపైన తనకు సమాచారం ఇవ్వాల్సిందిగా పార్టీ నేతలను ఆయన ఆదేశిస్తున్న విషయం తెలియందికాదు. అలాగే రాష్ట్రంపైన కాంగ్రెస్ జండాను ఎగురవేయాలన్న దృఢ సంకల్పంతో రేవంత్‌రెడ్డి కూడా దూకుడుగానే పోతున్నప్పటికీ పార్టీలోని విబేధాల కారణంగా అనుకున్నంతగా దూసుకుపోలేకపోతున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిఆర్‌ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఈసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలను కుంటున్న తరుణంలో అంతర్ఘత విభేదాల కారణంగా అటు ప్రజల్లో ఇటు కార్యకర్తల్లో అపోహలను సృష్టించడం వల్ల నష్టపోయేది చివరకు కాంగ్రెసే అవుతుందని రేవంత్‌రెడ్డి వర్గంగా భావిస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతపెద్ద గందరగోళం జరుగుతున్న కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా స్పందించినట్లు కనిపించదు.
కాని రేవంత్‌రెడ్డిపైన తిరుగుబాటు ప్రకటించిన సీనియర్ నాయకులను దిల్లీ కి రావాల్సిందిగా అధిష్టానం ఆదేశించినట్లు అనధికారిక వార్త. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపుకు కృషిచేసిన ప్రియాంకగాంధీయే ఇప్పుడు తెలంగాణ వ్యవహారాలను చూసుకుంటుందన్న ప్రచారం జరుగతున్నది. సీనియర్లను శాంతింప జేసేందుకు ఇక్కడ అమె ఎలాంటి చర్యలు తీసుకోబోతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇక్కడి వ్యవహారాలపై ఒక సమగ్ర నివేదికను అందించాల్సిందిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు కెసి వేణుగోపాల్‌ను ప్రియాంకగాందీ కోరినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే తమ భవిష్యత్ కార్యక్రమంపైన సీనియర్లు మరోసారి సమావేశం అయ్యేందుకు నిర్ణయించారు. ఈ నెల 20న తిరుగుబాటు నాయకుడు ఏలేటి మహోశ్వర్‌రెడ్డి ఇంట్లో నిర్వహించతలపెట్టిన సమావేశంలో ఇప్పుడున్న తిరుగుబాటు సీనియర్లలో ఎంతమంది హాజరవుతారు, కొత్తవారెవరైనా వీరితో కలుస్తాఆరా అన్నది ఆసక్తిగా మారింది.