రాయదుర్గం హోటల్‌లో మంటలు

కార్మికులను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

హైదరాబాద్‌, ‌మే 28 : రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రీన్‌బావర్చి హోటల్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. హోటల్‌ ‌మొత్తం దట్టమైన పొగతో కమ్మేసింది. ఒక్కసారిగా హోటల్‌ ‌నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం
తెలుసుకున్న ఫైర్‌ ‌సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువస్తున్నారు. అయితే.. హోటల్‌లో సుమారుగా 20 మంది ఉండగా..10 మందిని సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. హోటల్‌లో మరో 10 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.
హోటల్‌ ‌రెండో అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

రెండో అంతస్తు నుంచి మంటలు మూడో అంతస్తుకు వ్యాపించాయి. యాక్షన్‌ ‌గార్డింగ్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెండ్‌ ‌సిబ్బందికి పైన కేటాయించిన కార్యాలయంలోనూ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది.. పోలీసు అధికారులు ఆ ఆఫీసులో ఉన్న వారిని సురక్షితంగా కిందకు తరలించారు. 4 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పారు. మంటల ధాటికి హోటల్‌లో నుంచి సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకున్న కొందర్ని అగ్నిమాపక సిబ్బంది కిందకు దించారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్యాలయంలో 15 మంది సిబ్బంది ఉన్నారని.. వారంతా సురక్షితంగా ఉన్నారని హోటల్‌ ‌యాజమాన్యం తెలిపింది. దట్టమైన పొగతో ఊపిరాడక ఇబ్బంది పడ్డ సిబ్బందికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. షార్ట్‌సర్క్యూట్‌ ‌వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. హోటల్‌ ‌పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పొగ వల్ల కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page