సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ఆపద్ధర్మ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)ను బుధవారం ఆయన స్వగ్రామమైన సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చింతమడక గ్రామస్థులు ఎర్రవెల్లిలో గల కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లి కలిశారు. గ్రామానికి చెందిన సుమారు 10 ప్రయివేట్ బస్సులలో గ్రామానికి చెందిన సుమారు 500 మంది వరకు గ్రామస్థులు ఎర్రవెల్లికి వెళ్లారు. బస్సుల్లో ఫామ్ హౌస్‌కు చేరుకున్న గ్రామస్థులను ఫామ్ హౌస్ వద్ద ఉన్న పోలీస్ చెక్‌పోస్ట్ దగ్గర పోలీస్ సిబ్బంది ఆపేశారని సమాచారం. అనుమతి ఉంటేనే లోపలికి అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పడంతో గ్రామస్థులు సందిగ్ధంలో పడ్డారు.
తర్వాత కేసీఆర్ నుండి అనుమతి రాగానే చింతమడక గ్రామస్థులందరూ ఫామ్ హౌస్‌లోకి వెళ్లారు. గ్రామస్థులను కలిసేందుకు వొచ్చిన కేసీఆర్‌ను చూడగానే చింతమడక గ్రామస్థులందరూ సంతోషం వ్యక్తం చేస్తూనే…మరోవైపు ఒకింత భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా గ్రామస్థులందరూ ‘మీరే మళ్లీ సిఎం కావాలి…సిఎం కేసీఆర్..సిఎం కేసీఆర్..కేసీఆర్ సిఎం..మీరే సిఎం కావాలి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేసినట్లు సమాచారం. గ్రామస్థులందరికీ సిఎం కేసీఆర్ కూడా రెండు చేతులు జోడిరచి నమస్కరిస్తూ…అభివాదం చేశారని తెలుస్తుంది.
చింతమడక గ్రామస్థులు వొచ్చిన సందర్భంలో ఫామ్ హౌస్‌లో కేసీఆర్ వెంట ఆపద్ధర్మ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు, టిఎస్‌ఐఐసి మాజీ ఛైర్మన్లు సర్దార్ రవీందర్‌సింగ్, గ్యాదరి బాలమల్లు తదితరులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ సిఎం పదవీకి రాజీనామాను పంపిన అనంతరం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే గత నాలుగు రోజులుగా ఉంటున్నారు. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా చింతమడక గ్రామస్థులను కలిశారు.