మన రిషీ సునక్‌ ‌గ్రేట్‌ ‌బ్రిటన్‌ ‌పాలన పగ్గాలు చేపట్టనున్నారా..!

భారతీయ సంతతికి చెందిన 42-ఏండ్ల మాజీ యూకె ఎక్స్‌చెక్కర్‌ ‌చాన్సిలర్‌, ‌దేశ మాజీ ఆర్థికశాఖ మంత్రి రిషీ సునక్‌ ‌బ్రిటన్‌ ‌ప్రధానమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టడానికి అత్యంత చేరువలో ఉన్నారనే వార్తలు భారతీయులను ఆనంద సాగరంలో ముంచెత్తు తున్నాయి. రెండు శతాబ్దాలకు పైగా భారత్‌ను వలసపాలన వలలో బంధించి, దేశ ఆస్తులను కొల్లగొట్టిన ఆంగ్లేయుల దేశమైన యూకె పాలన పగ్గాలు చేపట్టడానికి భారత సంతతికి చెందిన రిషీ సునక్‌ ‌చేరువలో ఉండడం ఓ అద్భుత సంతోష సందర్భమే. బోరిస్‌ ‌జాన్సన్‌ ‌రాజీనామా అనంతరం జరుగుతున్న పరిణామాల్లో కన్జర్వేటివ్‌ ‌పార్టీ నాయకుడిగానే కాకుండా యూకె ప్రధానిగా ఎన్నికల బరిలో ఉన్న పలు ఆశావహుల కన్న ముందంజలో రిషీ సునక్‌ ఉన్నారు.

పలు కుంభకోణాలు, ఆరోపణల నడుమ బోరిస్‌ ‌జాన్సన్‌ ‌ప్రధాని పదవి నుంచి తప్పుకోవలసి రావడం మనకు తెలుసు. పార్టీలో రిషీ సునక్‌(88 ఓట్లు)కు పోటీదారులుగా 8 మంది నిలిచినప్పటికీ గట్టి పోటీదారులుగా మాజీ ట్రేడ్‌ ‌మినిస్టర్‌ ‌పెన్నీ మోర్డాంట్‌(67), ‌మాజీ విదేశీశాఖ మంత్రి లిజ్‌ ‌ట్రస్‌ ‌క్లాష్‌(50)‌లు నిలుస్తున్నారు. మలి దశ పార్టీ ఎన్నికల్లో 358 మంది కన్జర్వేటివ్‌ ‌పార్టీ యంపీలు అధిక మద్దత్తు పొందిన ఇద్దరు అభ్యర్థులను నిర్ణయించనున్నారు. ఫైనల్‌గా మిగిలిన ఇద్దరు అభ్యర్థుల్లో ఒక్కరిని నిర్ణయించడానికి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 2,00,000 మంది కన్జర్వేటివ్‌ ‌పార్టీ సభ్యులు ఓటింగులో పాల్గొంటారు. కన్సర్వేటివ్‌ ‌పార్టీ నాయకుడిగా ఎన్నికైన అభ్యర్థినే ప్రధానమంత్రిగా 05 సెప్టెంబర్‌ 2022‌న పార్టీ ప్రకటించడం జరుగుతుంది.

రిషీ సునక్‌ ‌వ్యక్తిగత జీవితం:
సౌథాంప్టన్‌, ‌యూకెలో భారతీయ పంజాబీ తల్లితండ్రులు యష్వీర్‌, ఉషా సునక్‌ ‌దంపతులకు 12 మే 1980న జన్మించిన రిషీ సునక్‌ ‌పాఠశాల విద్యను విన్‌చెస్టర్‌ ‌కాలేజీలో, 2001లో డిగ్రీ (ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్)‌ని లింకన్‌ ‌కాలేజీ, ఆక్సఫర్డ్‌లో పూర్తి చేశారు. విద్యార్థిగా సెలవుల్లో హోటల్‌ ‌వేయిటర్‌గా కూడా పని చేసిన రిషీ 2006లో ఫుల్‌‌బ్రైట్‌ ‌స్కాలర్‌షిప్‌ ‌పొంది స్టాన్ఫర్డ్ ‌యూనివర్సిటీలో యంబిఏ పట్టా పొందారు. 2009లో ఇన్ఫొసిస్‌ ‌నారాయణమూర్తి కూతురు తన సహచర స్టాన్ఫర్డ్ ‌యూనివర్సిటీ విద్యార్థిని అక్షత మూర్తిని వివాహం చేసుకున్నారు.

ఉద్యోగ, వ్యాపారాలు:
2001-04 మధ్య బ్యాంక్‌ ‌కన్సల్‌టెంట్‌గా, ఫండ్‌ ‌మెనేజర్‌గా ఉద్యోగాలు చేసిన అనంతరం చిల్డ్రన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌ఫండ్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌కంపెనీలో పార్ట్‌నర్‌గా చేరారు. ఈ వ్యాపారంలో తృప్తి చెందని రిషీ తన మిత్రులతో కలిసి హెడ్జ్ ‌ఫండ్‌ ‌స్థాపించి లాభాల బాట పట్టించారు. తన మామగారైన ఇన్ఫోసిస్‌ ‌యన్‌ ఆర్‌ ‌నారాయణ మూర్తికి చెందిన కటామరన్‌ ‌వెంచర్స్ ‌కంపెనీకి డైరెక్టర్‌గా సేవలందించారు. హిందు మతస్థుడైన రిషీ సునక్‌ ‌భగవద్గీత సాక్షిగా పదవీ ప్రమాణం చేశారు. యూకె అత్యంత సంపన్నుల జాబితాలో 222వ స్థానంలో నిలిచిన రిషీ సునక్‌ ‌వ్యక్తిగతంగా ఆల్కహాల్‌ ‌సేవనానికి దూరంగా ఆద్శవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

రాజకీయ జీవితం:
2014లో కన్సర్వేటివ్‌ ‌పార్టీ అభ్యర్థిగా యార్కస్, ‌రిచిమండ్‌ ‌స్థానం నుంచి ఎంపిక కాబడిన రిషీ, 2015 యూకె సాధారణ ఎన్నికల్లో యంపీగా గెలుపొంది 2017 వరకు ‘పర్యావరణం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల కమిటీ‘ సభ్యుడిగా పని చేశారు. 2017 సాధారణ ఎన్నికల్లో మరోసారి భారీ మెజారిటీతో యంపీగా గెలిచి 2018-19 కాలంలో ‘పార్లమెంటరీ అండర్‌ ‌సెక్రటరీ’గా సేవలందించారు. 2019లో ‘ట్రెజరీ చీఫ్‌ ‌సెక్రటరీ’గా నియమించబడ్డారు. 2019 ఎన్నికల్లో యంపీగా తిరిగి ఎంపికైన సునక్‌ ‌రిషీ 2020-2022 మధ్య ‘యూకె ఎక్సచెక్కర్‌ ‌చాన్సిలర్‌’‌గా కొనసాగారు.

ఇన్వెస్ట్‌మెంట్‌ అనలిస్ట్, ‌వ్యాపారి, రాజకీయ నాయకుడైన రిషీ సునక్‌ ‌నేడు గ్రేట్‌‌బ్రిటన్‌ ‌ప్రధానమంత్రి రేస్‌లో ముందుండి ప్రపంచ మానవాళి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం యూకె ఎదుర్కొంటున్న సమస్యల్లో పెరిగిన ద్రవ్యోల్బణం, తరిగిన నిధులు, పెరిగిన అప్పులు, కుంటుపడిన అభివృద్ధి, ఆర్థిక లోటు లాంటివని ప్రధానంగా గుర్తించబడినవి. ఉన్నత వ్యక్తిత్వం, అత్యుత్తమ నైతికత, ఆర్థిక వ్యవహారాల్లో లోతైన ప్రతిభ కలిగిన సునక్‌ ‌రిషీ యూకె ప్రధానమంత్రిగా ఎన్నికై తన ప్రతిభను చాటుతూ, బ్రిటన్‌తో పాటు ప్రపంచ మానవాళి శాంతి, శ్రేయస్సులకు ఊతం ఇవ్వాలని కోరుకుందాం. ఆల్‌ ‌ది బెస్ట్ ‌రిషీ సునక్‌. ఇం‌డియన్స్ ఆర్‌ ‌ప్రౌడ్‌ ఆఫ్‌ ‌యు అండ్‌ ‌యువర్‌ ‌పాపులర్‌ ‌పర్సనాలిటీ.
burra madhusudhan reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *