మత విద్వేషాన్ని తిరస్కరిస్తున్నాం…

మేము శాంతి, ఐక్యత కోసం కలిసి నడుస్తాం…తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ ర్యాలీ

అన్ని వర్గాల నుంచి విస్తృత భాగస్వామ్యం; శాంతిని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ

పెరుగుతున్న మత దాడులు, మైనారిటీల రాజ్యాంగ హక్కుల భంగం పై ఆందోళన వ్యక్తం చేసిన పాల్గొన్న ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు

“శాంతి, సర్వ మత సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తామని, పౌరులందరి సమానతను, గౌరవాన్ని, కాపాడుతామని, స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్తామని తీర్మానిస్తూ అన్ని మతాలు, సమూహాలకు చెందిన ప్రజలకు శాంతి నెలకొల్పడానికి తోడ్పడాలని కోరుతూ, ఇతర మతాలపై వచ్చే విద్వేష పూరితమైన, అసత్య పూరితమైన ప్రచారాన్ని తిరస్కరించమని “తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ” (టి.పి.యు.) పిలుపునిచ్చారు.ఆదివారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎల్.బి.స్టేడియం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీని నిర్వహించిన ఈ వేదిక ర్యాలీలో పాల్గొన్నవారు “మేము శాంతి కోసం ఐక్యంగా ఉన్నాము”, “మత విద్వేషాలకు నో చెప్పండి”, “మజ్హబ్ నహీ సిఖాతా ఆపస్ మే  బైర్ రఖ్నా “, “మానవత్వమే మా అందరి మతం” వంటి మత సామరస్యం, శాంతి కోసం పోస్టర్‌ల ను ప్రదర్శించారు. ఈ ర్యాలీ లో పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు, ఇందులో ప్రొఫెసర్ రమా మెల్కోటే (ప్రముఖ కార్యకర్త, O.U. రిటైర్డ్ ప్రొఫెసర్), ప్రొఫెసర్ పద్మజా షా (రచయిత్రి, O.U. రిటైర్డ్ ప్రొఫెసర్), వి.సంధ్య (పిఒడబ్ల్యు), ఖలీదా పర్వీన్ (అమూమత్ సొసైటీ), కె.సజయ (తెలంగాణ ఉమెన్ & ట్రాన్స్‌జెండర్ జెఎసి), మజర్ హుస్సేన్ (COVA), మరియా తబస్సుమ్ (విద్యావేత్త), సారా మాథ్యూ (సంకల్ప్ ఉమెన్స్ సపోర్ట్ అలయన్స్), విస్సా కిరణ్‌కుమార్ (రైతుస్వరాజ్యవ్ వేదిక) , మీరా సంఘమిత్ర (ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక -NAPM), సిస్టర్ లిజీ మరియు సిస్టర్ రోసి (తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్), ఝాన్సీ (P.O.W.), M.A. షకీల్ (న్యాయవాది), ఖలీద్ ఖాన్ (ఆల్ ఇండియా ముస్లిం సంఘం), మోర్తాల విమల (రచయిత్రి, సామాజిక కార్యకర్త), కృష్ణ కుమారి (NFIW), సబా ఖాద్రీ & జాహిద్ ఖాద్రీ (హెల్ప్ హైదరాబాద్), సుజాత సూరేపల్లి & దీప్తి సిర్ల(దళిత ఉమెన్స్ కలెక్టివ్), పి. శంకర్ (దళిత బహుజన ఫ్రంట్), ఇమ్రాన్ సిద్ధిఖీ (ఆదివాసీ హక్కుల కార్యకర్త), వర్ష భార్గవి (ఫెమినిస్ట్ కలెక్టివ్), ఆకునూరి మురళి (ఐ.ఏ.ఎస్.), ఆర్. వెంకట రెడ్డి (సోషల్ డెవలప్మెంట్ ఫోరం), తదితరులు ఉన్నారు.

భారత రాజ్యాంగ పీఠిక పఠనం తో శాంతి ర్యాలీ ప్రారంభం కాగా, చివరిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక ఉమ్మడి తీర్మానాన్ని చదవడం, కొందరు ప్రముఖ కార్యకర్తలు మాట్లాడిన తర్వాత భారత జాతీయ గీతంతో ముగిసింది. అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీలో పాల్గొన్నవారిని మీడియాను ఉద్దేశించి ప్రొఫెసర్ రమా మేల్కోటే, వి. సంధ్య (పి.ఓ.డబ్ల్యూ.), సబా కాద్రి (హెల్ప్ హైదరాబాద్), ఖలీదా పర్వీన్ (అమూమత్ సొసైటి), అజీజ్ పాషా (మాజీ ఎం.పీ.), ఆకునూరి మురళి (ఐ.ఏ.ఎస్.), సారా మాథ్యు (సంకల్ప్ మహిళా వేదిక) మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page