- పివి, చరణ్‌సింగ్, స్వామినాథన్‌లకు భారతరత్న కట్వీట్ ద్వారా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
- కర్పూరీ ఠాకూర్, అద్వానీలతో సహా ఈ యేడాది ఐదుగురికి అత్యున్నత పురస్కారం
- పివి దార్శనికతను, సేవలను కొనియాడిన ప్రధాని మోదీ
న్యూదిల్లీ, ఫిబ్రవరి 9 : దేశాన్ని ఆర్థిక అస్థిరత నుంచి సుస్థిరతకు మళ్లించి.. ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకుని నిలిచేలా చేసిన భారత మాజీ ప్రధాని, తెలుగు వారు తమ ఠీవిగా భావించే పీవీ నరసింహ రావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది. పీవీతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌లకు సైతం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇటీవలే..ఎల్ కే అద్వాణీ, కర్పూరీ టాకూర్‌కు కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రికార్డు స్థాయిలో ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న అవార్డులు ప్రకటించినట్టయ్యింది. సాధారణంగా ఏడాదికి 3 భారతరత్న అవార్డులు ఇస్తారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం ఐదుగురికి ప్రకటించడం విశేషం. చౌదరి చరణ్ సింగ్ జూలై 28, 1979 నుంచి జనవరి 14, 1980 మధ్యకాలంలో, పీవీ నరసింహారావు జూన్ 21, 1991 నుంచి మే 16, 1996 వరకు దేశ ప్రధాన మంత్రులుగా సేవలు అందించారు. ఇక హరితవిప్లవ పితామహుడైన ఎంఎస్ స్వామినాథన్ దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ‘ఎక్స్(ట్విటర్)’ వేదికగా వెల్లడిరచారు. దేశానికి వీరు అందించిన సేవలను కొనియాడారు.
ఆర్థిక సంస్కరణలతో కొత్త శకానికి నాంది…దేశానికి పీవీ సేవలు చిరస్మరణీయం : పివి సేవలను స్మరించుకున్న ప్రధాని
రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు ఈ దేశానికి అందించిన సేవలు అపారం… చిరస్మరణీయం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం త్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన చేసిన కృషి మరువలేనిది. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేసింది. పీవీ హయాంలో ప్రపంచ మార్కెట్‌ను భారత్ ఆకర్షించింది. ఆయన పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైంది. విదేశాంగ విధానం, విద్యారంగంలో ఆయన అందించిన సహకారం.. దేశాన్ని సాంస్కృతికంగా, మేథోపరంగా సుసంపన్నం చేసిందని ప్రధాని మోదీ కొనియాడారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరిం చడం ఆనందంగా ఉందని, ప్రముఖ పండితుడని, రాజకీయవేత్త అయిన నరసింహారావు వివిధ హోదాలలో విస్తృత సేవలు అందించారని ప్రధాని కొనియాడా రు. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంటు, అసెంబ్లీ సభ్యునిగా ఎన్నో ఏళ్లుగా ఆయన విశేష కృషి చేశారని, భారతదేశాన్ని ఆర్థికం గా అభివృద్ధి చేయడంలో, దేశ శ్రేయస్సు, అభివృద్ధికి బలమైన పునాది వేయడంలో దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. నరసింహారావు ప్రధానిగా పనిచేసిన కాలం ఆర్థికాభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇక మాజీ ప్రధాని చరణ్ సింగ్, శాస్త్రవేత్త స్వామినాథన్ కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. భారతదేశ ఐదో ప్రధానిగా పనిచేసిన దివంగత చౌదరి చరణ్ సింగ్ రైతుల సంక్షేమం కోసం చేసిన అచంచలమైన అంకితభావానికి మరణానంతరం భారతరత్నతో సత్కరించుకున్నామన్నారు.
పీవీ పుట్టిన ఊరు లక్నేపల్లి
మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఆయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921, జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. ఆ తర్వాత పూర్వపు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతన్ని దత్తత తీసుకోవడంతో పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. చదువుల అనంతరం ఆయన రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రికలో ‘జయ’ అనే మారుపేరుతో 1950 ప్రాంతంలో ఆర్టికల్స్ రాశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మంథని నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1962, 1967, 1972లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన అనంతరం ఆయనకు మంత్రి పదవి దక్కింది. తొమ్మిదేళ్ల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పని చేశారు.





