35 అడుగులకు చేరుకున్న నీటిమట్టం – మరింత పెరిగే అవకాశం
ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక అలా
పునరావాస కేంద్రాలు పరిశీలన – అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశం
భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 19 : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. బుధవారం ఉదయం 20 అడుగులు ఉన్న గోదావరి అతివేగంగా సాయంత్రానికి 32 అడుగులకు చేరుకుంది. రాత్రి వరకు 35 అడుగులు చేరుకుంటుందని అధికారులు అంచనా వేసారు. ఇది మరింత పెరిగే అవకాశాలు ఉంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వరద నీరు రావడం వలన భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతుంది. గోదావరికి ఎగువన ఉన్న కాళేశ్వరం, ఇంద్రావతి, తాలిపేరు నదుల వద్ద ప్రమాదస్థాయి నుండి గోదావరి ప్రవహించటంతో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. దీని కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతంది. ఇప్పటికే తాలిపేరు నుండి 60 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 2.35 లక్షల నీటిని విడుదల చేసారు. అంతేకాకుండా ఇంద్రావతి నది నుండి 2.15 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. బుధవారం ఉదయం నాటిని పేరూరు వద్ద 5.3 లక్షల క్యూసెక్కుల నీరు చేరుకుంది. ఎగువ ప్రాంతంలో వరద ప్రభావం ఎక్కువ ఉండటం వలన భద్రాచలం , బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. వరద ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
అధికారులు ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలపై పర్యవేక్షించాలి : కలెక్టర్ ప్రియాంక అలా
గోదావరి వరద ప్రభావం ఎక్కువగా ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమతంతగా ఉండాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఆదేశాలు జారీ చేసారు.బుధవారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాలైన భద్రాచలం, దుమ్ముగూడెం , చర్ల ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. వరద తాకిడికి గురయ్యే ప్రాంతాలను కాలనీలను పరిశీలించారు. అంతేకాకుండా వరదకు గురయ్యే కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసారు. అంతేకాకుండా కలెక్టర్ పునరావాస కేంద్రాలను పరిశీలించారు. వరద బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన భాధ్యత అధికారులపై ఉందని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసారు.