బీహార్‌లో విజయం సాధిస్తే కాంగ్రెస్‌లో పునరుత్తేజం: కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే

పాట్నా, జూన్‌ 23 : ‌బిహార్‌లో కాంగ్రెస్‌ ‌విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా పార్టీ పునరుత్తేజానికి దోహదం చేస్తుందని ఏఐసీసీ చీఫ్‌ ‌మల్లికార్జున్‌ ‌ఖర్గే అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కార్యాలయం సదకత్‌ ఆ‌శ్రమ్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. దేశం కోసం, దేశ ప్రజాస్వామ్య కోసం ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. రాహుల్‌ ‌గాంధీ ప్రారంభించిన భారత్‌ ‌జోడో కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాలన్నారు.

వొచ్చే ఎన్నికల్లో కలసికట్టుగా పోరాడుతాం : బెంగాల్‌ ‌సిఎం మమత
బిహార్‌ ‌సీఎం నితీష్‌ ‌కుమార్‌ అధ్యక్షతన పట్నాలో శుక్రవారం జరిగిన విపక్ష నేతల సమావేశం ముగిసిన అనంతరం పశ్చిమ బెంగాల్‌ ‌సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకమై పోరాడతాయని స్పష్టం చేశారు. పట్నా నుంచి చరిత్ర మొదలవుతుందని, చరిత్ర తిరగరాయాలని కోరుకుంటున్న కాషాయ పార్టీకి బుద్ధిచెబుతామని అన్నారు. ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాలన్నదే తమ ధ్యేయమని, తామూ భారత్‌ ‌మాత అంటామని, తమను ప్రతిపక్షమని పిలవకూడదని దీదీ పేర్కొన్నారు. మణిపూర్‌ ‌తల్లడిల్లితే తాము బాధపడ్డామని అన్నారు. రాజ్‌భవన్‌ను కేంద్రం ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా మార్చిందని, కేంద్రంపై గళమెత్తిన వారిపై ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తుందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని సర్కార్‌పై విమర్శలు గుప్పించే రాజకీయ పార్టీలపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్ధలను కేంద్రం ఉసిగొల్పుతుందని దుయ్యబట్టారు. ఇక విపక్ష నేతల భేటీ సామరస్య వాతావరణంలో జరిగిందని బిహార్‌ ‌సీఎం, జేడీయూ నేత నితీష్‌ ‌కుమార్‌ ‌పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పాలక బీజేపీకి వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని నిర్ణయించిందని చెప్పారు. త్వరలో మరోసారి విపక్ష నేతలంతా ఒకే వేదికపై చర్చిస్తారని నితీష్‌ ‌కుమార్‌ ‌వెల్లడించారు.

కర్నాటకలో హనుమంతుడే గదతో బిజెపిని మట్టి కరిపించాడు : ఆర్‌జెడి అధినేత లాలూ
హనుమంతుడు తన గదతో బీజేపీని మట్టికరిపించాడని, కర్ణాటకలో రాహుల్‌ను గెలిపించాడని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌  అన్నారు.  పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల మెగా భేటీలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ‌వి•డియాతో మాట్లాడారు. ’కర్ణాటకలో హనుమంతుడు తన గదతో బీజేపీని మట్టికరిపించాడు. రాహుల్‌ను గెలిపించాడు. హనుమంతుడు ప్రతిపక్షంతో ఉన్నాడు. రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీకి భారీ ఓటమి తప్పదు’ అని అన్నారు. అలాగే తాను ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నానని, నరేంద్ర మోదీని ఫిట్‌ ‌చేస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి భయంకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూలైలో మరోసారి సిమ్లాలో సమావేశమవుతామని లాలూ తెలిపారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఆ సమావేశంలో ఎజెండాను సిద్ధం చేస్తామని చెప్పారు.

కాగా, ప్రతిపక్షాల సమావేశం కేవలం అధికారం కోసం కాదని, విలువలు, భావజాలం కోసమేనని జమ్ముకశ్మీర్‌ ‌మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. జమ్ముకశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు, భావసారూప్యత కలిగిన ప్రతి పార్టీ ఈ సమావేశంలో పాల్గొన్నదని తెలిపారు. ‘అధికారం కోసం కాదు, విలువలు, భావజాలం కోసం మా పోరాటం’ అని చెప్పారు. వైట్‌హౌస్‌లో ప్రజాస్వామ్యం గురించి ప్రధాని మోదీ మాట్లాడటం వినడానికి ఆనందంగా ఉందని ఎద్దేవా చేశారు. అయితే, జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. తాను, మెహబూబా ముఫ్తీ దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేసిన ప్రాంతానికి చెందినవాళ్లమని తెలిపారు. దేశాన్ని విధ్వంసం నుంచి రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావడానికి తామంతా ఇక్కడ సమావేశమైనట్లు ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *