కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
కండువా కప్పి ఆహ్వానించిన సిఎం రేవంత్ రెడ్డి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర జూన్28: బీఆర్‌ఎస్ కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తెలంగాణ మాజీ స్పీకర్, బీఆర్ ఎస్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. దీంతో యాదయ్యతో కలిపి ఇప్పటివరకు ఆరుగురు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో తాజాగా ఆ పార్టీ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ లో చేరారు.
దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 71కి చేరింది. కాగా ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి కడియం శ్రీహరి, పొచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్, సంజయ్ కుమార్, దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎంపీపీ, జెడ్పీటీసీగా పని చేసి, 2009లో చేవెళ్ల నియోజకవర్గం నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోరాని సాయన్న రత్నం చేతిలో ఓడిపోయాడు.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కోరాని సాయన్న రత్నంపై 781 వోట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి 33 వేల 552 వోట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి స్వల్ప వోట్ల తేడాతో గెలిచారు.




