ఎక్కడా రీపోలింగ్ అవకాశాలు లేవు
రాష్ట్రంలో మొత్తంగా 70.74 శాతం పోలింగ్ నమోదు
గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం తగ్గింది
అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.03 శాతం
అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.56 శాతం
మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 91.5 శాతం
యాకుత్ పురాలో అత్యల్పంగా 39.6 శాతం
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు. ఎక్కడా రీపోలింగ్ అవకాశాలు లేవన్నారు. గురువారం రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో పురుష వోటర్ల కంటే మహిళా వోటర్లు వోట్లు ఎక్కవగా నమోదయ్యాయని వికాస్ రాజ్ వెల్లడించారు. పురుష వోటర్ల కంటే మహిళా వోటర్లే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. 18 – 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వోటర్లు 3.06 శాతం ఉన్నట్లు పేర్కొన్నారు. థర్డ్ జెండర్స్ కూడా ఎక్కువ సంఖ్యలో వోటు వేశారని చెప్పారు. 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 7,591 కేంద్రాల వెలుపల సీసీ టీవీ సదుపాయం కల్పించినట్లు వివరించారు. ఇక మొత్తం 70.74 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. 2018 ఎన్నికలతో పోలిస్తే 2023లో పోలింగ్ 3 శాతం తగ్గిందని, 2018లో 73.37 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో లక్షా 80 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని తెలిపారు.
వోట్ ఫ్రమ్ హోమ్ మంచి ఫలితాలను ఇచ్చిందని, 80 ఏండ్లు పైబడిన వారికి వోట్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించామని అన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం, హైదరాబాద్‌లో అత్యల్పంగా 46.56 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఇక నియోజక వర్గాల వారీగా చూస్తే మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకుత్‌పురాలో అత్యల్పంగా 39.6 శాతం పోలింగ్ నమోదైందని వికాస్ రాజ్ వెల్లడించారు. చాలా చోట్ల రాత్రి 9.30 వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు. ఈసారి వోటర్లలో 18, 19 ఏండ్ల వయసున్న వారు 3.06 శాతం ఉన్నారన్నారు. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలోని 79 నియోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ జరిగిందని, వోట్ ఫ్రమ్ హోమ్ మంచి ఫలితాన్ని ఇచ్చిందని, ఎక్కడా రీపోలింగ్‌కు అవకాశమే లేదని సీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో 1.80 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించు కున్నారని, 80 ఏళ్లు పైబడిన వారికి వోట్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చామని వివరించారు.