ఎదో ఒక చట్రానికి
కట్టిన ఊహే కావచ్చు
అదిగో తలుపు తడుతూ
ముడుపు కడుతూ
చూడ చక్కని
ఒక శవం బొమ్మ!
అనిశ్చితి లోంచే
అటువైపు అటుగా కనుసైగల్తో
క్రమరాహిత్యాన్ని కోల్పోతూ
తర్జనభర్జనలు పడుతూ…
ఒక గోడనో బల్లనో
గుద్ది చెప్పే గొంతు
కోట్లాది మంది తరపున
ఉంటానికి వింటానికి
ఎమైనా కాల్పనిక కథో
చారిత్రక ఘటనో కాదు కదా!
రక్తం చిందే శిశువునుంచి
గడ్డకట్టే ముదుసలి దాకా
నీ రొమ్ములపైన్నుంచి పరిగెట్టే
కాలచక్రపు వేగ విన్యాసమో
ధ్వని కోల్పోయి కూర్చున్న
రాబందుల కోరసో మరి
కంఠాలు తెగిపడ్డ
విషాద నాటక పాత్రలో..!!
ఒక పొగచూరిన
సంధ్యా మైదానంలో
అవాక్కైన కళ్ళతో
ఏడుస్తున్న దేహం ఒకటి
తచ్చాడుతూ వెతుక్కుంటుంది
సమాధులపై రాయాల్సిన
చరమ వాక్యాలను..!!!
– రఘు వగ్గు, మహబూబ్ నగర్ 9603245215