పెంచే పార్టీ బిజెపి…పంచే పార్టీ టిఆర్‌ఎస్‌

  • ఎవరు కావాలో ప్రజలే తేల్చుకోవాలి
  • ప్రజల నోట్లో మట్టి కొట్టి…సిగ్గు లేకుండా పాద యాత్రలు చేస్తారా?
  • దేనికి యాత్ర చేస్తున్నారో చెప్పకుంటే ప్రజలు దంచికొడుతరు
  • బండి సంజయ్‌పై మంత్రి హరీష్‌రావు మండిపాటు
  • ఈ నెలలోనే అర్హులకు కొత్త పెన్షన్లు…మే 1 నుంచి లబ్ధిదారుల ఖాతాలో జమ

బొందిలో ప్రాణమున్నంత వరకు కేసీఆర్‌ ‌సారథ్యంలో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతానని వెల్లడి
సిద్ధిపేట, ప్రజాతంత్ర బ్యూరో,మార్చి 31 : ధరలన్నింటిని పెంచేది బిజెపి పార్టీ అని….ప్రజల సంక్షేమం గురించి నిరంతరం ఆలోచన చేసే పార్టీ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అని పెంచే బిజెపి పార్టీ కావాలో…పంచే టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కావాలో ప్రజలే తేల్చుకోవాలనీ, దీనిపై గ్రామాలలో ప్రజల్లో విస్తృతంగా చర్చించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రజలను కోరారు. గురువారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెటలో పలు అభివృద్ధి, ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొని మాట్లాడుతూ…సిఎం కేసీఆర్‌  ‌ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు. తక్కువ సమయంలో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటే కేసీఆర్‌ ‌కృషి వల్లే. గతంలో ఈ ప్రాంతం వానాకాలం కూడా ఎండాకాలం లాగే ఉండేది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌నిర్మాణం పూర్తి కావడం వల్లే ఇప్పుడు ఏ కాలం చూసినా తెలంగాణ వానాకాలం లాగే ఉన్నదనీ అన్నారు. ఇప్పుడు సాగునీరు కావాలంటే మొగులు వైపు చూసే బదులు కేసీఆర్‌ ‌వైపు చూస్తే సాగు,త్రాగు నీరు విడుదలవుతుందన్నారు. రైతుల పక్షాన నిలబడి కలబడుతున్నది కేసిఆర్‌ ఒక్కరేననీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్‌, ‌రైతు అవార్డు, బీమా ఇలా అనేక కార్యక్రమాలతో రైతు పక్షపాతిగా కేసీఆర్‌ ‌నిలిచారన్నారు.  ప్రజల ఆకాంక్షల నుంచి, వారి ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ టిఆర్‌ఎస్‌ అని, బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కేసిఆర్‌ ‌సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి పునరంకితవుతామన్నారు. తెలంగాణకు ఈజిఎస్‌ ‌పథకంలో కూలీలకు రావల్సిన పని దినాలను తగ్గించడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. కూలీలపై ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్టు రాష్ట్రంలో పని దినాలను 13 వేల కోట్ల నుండి 16 వేల కోట్లకు పెంచేలా చూడాలన్నారు. మట్టి పనుల్లో 25 వేల కోట్ల రూపాయల కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వంను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్రాన్ని నిలదీయాలన్నారు.

అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టి సిగ్గు లేకుండా పాద యాత్రలు చేస్తారా? అని స్టేట్‌ ‌బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌ను ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు పెంచకుండా తొక్కి పెట్టినందుకా…వడ్ల కొననందుకా, పెట్రోల్‌ ‌డీజిల్‌ ‌ధరలు పెంచినందుకా, వంట గ్యాస్‌ ‌ధర మంట పెట్టినందుకా, నిరుద్యోగులకు జాబ్‌లు ఇవ్వనందుకా, ఎరువుల ధరలు విపరీతంగా పెంచినందుకా…ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో..ముందు స్పష్టత ఇచ్చాకే పాదయాత్ర చేపట్టాలన్నారు. అలా కాకుండా పాదయాత్రలు చేస్తే తెలంగాణ ప్రజలు దంచి కొడతారన్నారు.   నెహ్రూ నుంచి మన్మోహన్‌ ‌సింగ్‌ ‌వరకు అందరూ ప్రధానులు రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేశారని మంత్రి తెలిపారు.వడ్లు కొనని ఏకైక ప్రధానమంత్రి మోదీనేనని …. రైతుల అభివృద్ధిపై బిజెపికి ఉన్న చిత్త శుద్ధికి ఇదే నిదర్శమని ఎద్దేవా చేశారు.

బంకుల్లో ఇంధనం కొట్టిస్తుంటే…కండ్ల వెంట నెత్తురొస్తుంది
10 రోజుల్లో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌రేట్లు 9 సార్లు పెంచారని మంత్రి హరీష్‌రావు గ••ర్తు చేశారు. బంకుల్లో ఇంధనం కొట్టిస్తుంటే…పేద ప్రజల కండ్ల వెంట నెత్తురు వొస్తుందనీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన రేట్లు పెరగడం వల్ల దుక్కి దున్నే ట్రాక్టర్లు, వరి కోత యంత్రాల రేట్లు పెరిగాయన్నారు. ఎరువుల రేట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ రైతుల నడ్డి విరుస్తున్నయని అన్నారు. పోటాష్‌ ‌ధరలు ఒక్కరోజే 500 పెంచారని అన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో శానిటేషన్‌, ‌సెక్యూరిటీ, డైట్‌ ఏజెన్సీల్లో 16శాతం దళితులకు రిజర్వేషన్లు  కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దళితులు కూలి పనులకు మాత్రమే పరిమితం కావొద్దని.. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్‌ ‌కల్పించాలని స్వాతంత్య్రానికి ముందే డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి లేఖ రాశారు. నాడు అంబేద్కర్‌ ‌కన్న కలలను నేడు సిఎం కేసీఆర్‌ ‌నిజం చేశారు.

గతంలో నీటిపారుదల శాఖలో జరిగే టెండర్లలో 21శాతం ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ జీవో 59 విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేననీ మంత్రి తెలిపారు. ఇప్పటికే వైన్‌ ‌షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కేసిఆర్‌ ‌ప్రత్యేక చొరవ వల్లే నేడు 300కు పైగా షాపుల్లో గల్లాపెట్టెల మీద దళితులు కూర్చున్నారన్నారు. అలాగే దళితులు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించి దేశంలో ఎక్కడా లేనివిధంగా దళిత బంధు పథకంకు శ్రీకారం చుట్టారన్నారు.

పశువులు, గొర్రెల హాస్టళ్లు దేశానికే ఆదర్శం…
దేశంలోనే తొలిసారిగా సిద్దిపేట జిల్లాలోని నర్మెటలో నిర్మించిన సామూహిక గొర్రెల వసతి సముదాయం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఆ అనుభవాలను పెట్టుకుని పాడి రైతుల మేలును కోరి ఇక్కడే పశువుల హాస్టల్‌ను నిర్మించామని మంత్రి తెలిపారు. దేశంతో పాటు తెలంగాణలోని జిల్లాలు పశువులు, గొర్రెలు హాస్టళ్లు తమ రాష్ట్రాలు, జిల్లాలలో చేపట్టాలని భావించి గొర్రెల హాస్టల్‌ను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు సిద్దిపేట వొస్తున్నారన్నారు. పశువులు, గొర్రెల హాస్టల్‌ ‌వల్ల గొల్ల, కుర్మలు, పాడి రైతులకే కాక గ్రామానికి, గ్రామ ప్రజలందరికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరుగుతుందన్నారు. పశువుల, గొర్రెల హాస్టల్‌ ‌నిర్మాణం వల్ల గ్రామంలో స్వచ్ఛత మెరుగవుతుందన్నారు.

నర్మెటలో 27 మంది ఎస్సీ రైతులకు 54 పాడి పశువులను 60 శాతం రాయితీతో అందజేశామని మంత్రి తెలిపారు. పశువుల హాస్టల్‌లోనే పశువులకు అవసరమైన దాణా, మందులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పశు వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. విజయ డైరీ వారి పాల సేకరణ కేంద్రం తెరిచామని తెలిపారు. పశువుల హాస్టల్‌ ‌నిర్మాణానికి ఆర్థిక సహాయం కావేరి సీడ్‌ ‌సంస్థ అందజేసిందనీ మంత్రి తెలిపారు. అలాగే బాల వికాస సంస్థ కూడా సహకారం అందజేసిందన్నారు. పాడి రైతులు బై ప్రొడక్ట్‌లను తయారు చేసి ఆర్థికంగా మరింత ప్రగతి సాధించాలని మంత్రి హరీష్‌రావు అన్నారు.

ఈ నెలలోనే అర్హులకు కొత్త పెన్షన్లు…మే 1 నుంచి లబ్ధిదారుల ఖాతాలో జమ
ఏప్రిల్‌ ‌నెలలోనే 57 యేండ్లు నిండిన అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు. ఆయన గురువారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెటలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్‌ ‌బ్యాంక్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…ఏప్రిల్‌ ‌నెలలో 57 యేండ్లు నుండి అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుందనీ, అర్హులై ఉండి పెన్షన్‌ ‌రాని వారికి కూడా పెన్షన్‌ ‌మంజూరు చేస్తామన్నారు. కొత్తగా ఇచ్చే పెన్షన్లను మే 1 నుంచి లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని మంత్రి తెలిపారు. వొచ్చే వారం రోజుల్లోగా అభయ హస్తం లబ్ధిదారులకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం మిత్తితో సహా చెల్లించనుందని మంత్రి తెలిపారు. అలాగే ఉగాది పండుగ తర్వాత సొంత జాగాలో ఇళ్ల నిర్మాణం చేసుకునే లబ్ధిదారులకు మూడు కిస్తీల కింద మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం చేయనుందని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఓపెన్‌ ‌జిమ్‌ను, 22 లక్షల రూపాయల నిర్మించిన నర్మెట క్లస్టర్‌ ‌రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. అనంతరం పాలమాకులలో పెద్దమ్మ తల్లిని దర్శించుకుని, ముదిరాజ్‌  ‌కమ్యూనిటీ హాల్‌ ‌నిర్మాణంకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే, సిద్ధిపేట నుంచి  మిట్టపల్లి వరకు గల ప్రతిపాదిత నాలుగు వరుసల రహదారిని పాలమాకుల వరకు ప్రజల సౌకర్యార్థం పొడిగించనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు.

మనోధైర్యాన్నిచ్చిన మంత్రి…
అనారోగ్యంతో బాధపడుతున్న మగ్దుమ్‌పూర్‌ ‌సర్పంచ్‌ ‌పద్మ భర్త చక్రపాణిని మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని.. అధైర్య పడొద్దనీ, తాను అండగా ఉంటానని మంత్రి హరీష్‌రావు మనోధైర్యాన్ని ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *