- కేంద్ర మంత్రి గోయల్ దేశాన్ని తప్పుదోవ పట్టించారు
- పార్లమెంట్ ఉభయసభల్లో సభాహక్కుల నోటీస్ ఇచ్చిన టిఆర్‌ఎస్
- ఎంపిలతో దిల్లీలో సిఎం కెసిఆర్ భేటీ..11న దేశ రాజధానిలో ఆందోళనపై చర్చ
న్యూ దిల్లీ, ఏప్రిల్ 4 : కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్.. దేశాన్ని తప్పుదోవ పట్టించారని టిఆర్‌ఎస్ ఆరోపించింది. గత శుక్రవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ..డబ్ల్యూటీవో ఆంక్షల వల్లే పారా బాయిల్డ్ రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేయడంలేదన్నారు. అయితే కేంద్ర మంత్రి పీయూష్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని సోమవారం టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేశారు. రాజ్యసభ సభ్యులు చైర్మన్‌కు, లోక్‌సభ సభ్యులు స్పీకర్‌కు ఆ లేఖను ఇచ్చారు. రూల్ 187 ప్రకారం కేంద్ర మంత్రి పీయూష్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు రాజ్యసభ టీఆర్‌ఎస్ సభ్యులు తమ లేఖలో తెలిపారు. ఒకటో తేదీన పారా బాయిల్డ్ రైస్ ఎగుమతిపై మంత్రి పీయూష్ ఇచ్చిన సమాధానం తప్పుదోవ పట్టించేలా ఉందని, వాస్తవానికి విదేశాలకు మిలియన్ టన్నుల బాయిల్డ్ రైస్‌ను ఎగుమతి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ఆరోపించారు. మంత్రి సమాధానం సరైన రీతిలో లేని కారణంగానే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. లోక్‌సభ టీఆర్‌ఎస్ ఎంపీలు కూడా ఇదే అంశాన్ని లేఖలో ప్రస్తావిస్తూ రూల్ 222 కింద స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు.
ఎంపిలతో దిల్లీలో సిఎం కెసిఆర్ భేటీ..11న దేశ రాజధానిలో దీక్షపై చర్చ
దిల్లీలో టీఆర్‌ఎస్ ఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించారు. వీటితో పాటు దిల్లీ వేదికగా టీఆర్‌ఎస్ పార్టీ చేయాల్సిన నిరసనల కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు అంశంపై ఈ నెల 11న ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టాలని టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆదివారం దిల్లీ పర్యటనకు వొచ్చిన సీఎం కేసీఆర్ సోమవారం వడ్లుకొనాల్సిందే నంటూ పార్లమెంటులో ఎంపిలు చేసిన ఆందోళనపై ఆరా తీశారు. నీ సందర్భంగా ఇదే విషయమై ఈ నెల 11న చేపట్టబోయే దీక్షపై చర్చించినట్లు సమాచారం.